అర్ధరాత్రి విధినిర్వహణలో
ఏదీ తనంతట తాను దరిచేరదు, ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు అక్షర సత్యమని నిరూపించారీ యువతులు. పెట్రోల్ ఉత్పత్తి కర్మాగారంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తున్నారీ మహిళలు. సంస్థ పురోగతిలో మేము సైతం అని ముందడుగు వేశారు విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) సంస్థ ఉద్యోగినులు.
హెచ్‌పిసిఎల్ సంస్థ పనివేళలు... ఉదయం 8 నుంచి 4.30 గంటల వరకు జనరల్ షిఫ్ట్, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు సాయంత్రం షిఫ్ట్, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అర్ధరాత్రి షిఫ్ట్‌లుంటాయి. మోటార్ స్పిరిట్ (పెట్రోల్)ను తయారు చేసే విభాగంలో ఇంజనీరింగ్ చదివి సుశిక్షితులైన 15 మంది విధులను నిర్వహిస్తున్నారు. కంట్రోల్ రూమ్ విభాగంలో క్షణక్షణం అప్రమత్తులై కన్నార్పకుండా పరిశీలించడంతోపాటు, అత్యవసర సమయాలలో ప్లాంట్‌లో సమస్యలను గుర్తించడం, వాటిని సరిచేయడం, సరఫరా వ్యవస్థను నిరాఘాటంగా నడపడం వీరి విధులు. ప్రతి షిఫ్ట్‌లో ముగ్గురు మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి రొటీన్ సజావుగా సాగుతోంది.
మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ
మహిళలకు రాత్రి విధులు అప్పగించడానికి ముందు... వారి భద్రత గురించి చాలా కసరత్తు జరిగింది. సాయంత్ర షిఫ్ట్, అర్ధరాత్రి షిఫ్ట్‌కు హాజరయ్యే మహిళలకు క్యాబ్ సదుపాయంతోపాటు సెక్యూరిటీ గార్డులుగా కూడా మహిళలనే నియమించారు. నైట్ షిఫ్ట్ ఉద్యోగినులకు మార్షల్ ఆర్ట్స్(ఆత్మరక్షణ)లో ప్రాథమిక తర్ఫీదు ఇచ్చారు. మహిళలు డ్యూటీకి రావడానికి ఇంటి నుంచి బయలు దేరిన సమయం నుంచి హిందుస్థాన్ పెట్రోలియం ప్లాంట్‌కు చేరే వరకు, విధులు ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకునే వరకు వారు ప్రయాణించే వాహనం గమనాన్ని పరిశీలించే జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఆ క్షణంలో స్పందించాలి
పరిశ్రమలో పనిచేయడం ఎంతో సంక్లిష్టమైన విషయం. ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించాలి. ఆ క్షణంలో మేము తీసుకున్న నిర్ణయంతోపాటు అమలు చేసే విధానం కూడా వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఆపరేషన్స్ విభాగంలో పనిచేయడం ఎంతో అవసరం. ఇది మా ప్రగతికి దోహదం చేస్తుంది.
– ఎం. నవ్య, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఐఐటి, ఖర్గపూర్ పూర్వ విద్యార్థి
ఇది మంచి ప్రయత్నం
గతంలో సేల్స్‌లో విధులు నిర్వర్తించాను. ఫిబ్రవరిలో ఎంఎస్ బ్లాక్ విధుల్లోకి వచ్చాను. మహిళలు నైట్‌షిఫ్ట్‌లలో పనిచేస్తున్న విషయం ఇంట్లో చెప్పి వారిని ఒప్పించాను. సాహసోపేతమైన నిర్ణయంలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది.
– వై. చందన, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఎన్‌ఐటి వరంగల్ పూర్వ విద్యార్థి
సవాళ్ల ఉద్యోగం
మేము ఎంచుకున్న రంగం ఎన్నో సవాళ్లతో కూడినదనే విషయం మాకు విద్యార్థిగా ఉన్నపుడే అర్థమైంది. మానసికంగా ముందుగానే సన్నద్ధం అయి ఉండడంతో విధి నిర్వహణ మాకు పెద్దగా కష్టం అనిపించలేదు. ప్లాంట్‌లో సమస్య రావడం, గ్యాస్ లీకవడం వంటివి జరుగుతుంటాయి. వీటిని డిటెక్టర్‌లతో వెంటనే గుర్తించి ప్రమాదాలను నివారించడం పెద్ద సవాలే. కానీ టాస్క్ మొత్తాన్ని మా చేతులతో పూర్తి చేసిన తర్వాత కలిగే సంతోషం కూడా అంతే పెద్దది.
– ఆర్. సత్య శిరీష, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని
సంస్థ నిర్ణయం ధైర్యాన్నిచ్చింది
నైట్ షిఫ్ట్ కోసం మా సంస్థ ఏర్పరచిన ప్రత్యేక రక్షణ సదుపాయాలు బాగున్నాయి. కంట్రోల్ రూమ్‌లో ప్లాంట్ పనితీరును నిరంతరం పర్యవేక్షించడం, డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ సిస్టమ్‌ను నిర్వహించడంలో అందరం మహిళలం అయిన కారణంగా ఎటువంటి సమస్యలూ ఎదురవలేదు. విధినిర్వహణలో ఆపరేటర్లను, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేయడం, తగిన సూచనలు అందించడం మా విధి. కొన్ని సందర్భాలలో అత్యవసరంగా షట్ డౌన్ చేయాల్సి వస్తుంది కూడా. కీలకమైన విధులను కూడా విజయవంతంగా చేయగలుగుతున్నామనే తృప్తి ఉంది.
– సిప్రా ప్రియదర్శిని, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఎన్‌ఐటి రూర్కెలా పూర్వ విద్యార్థిని
నైట్ షిఫ్టే బెటర్
నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహించడం వలన పగలు తగినంత అదనపు సమయం లభిస్తోంది. వ్యక్తిగత పనులు చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంది. జనరల్ షిఫ్ట్ కంటే నైట్ షిఫ్టే బాగుంది.
– శిఖ, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, జాదాపూర్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని
రోజుకో కొత్త పాఠం
ఇక్కడికి ప్యానల్ ఆఫీసర్ గా వచ్చాను. నైట్ షిఫ్ట్ కొత్తలో కొంత సవాలుగా అనిపించింది. మెల్లగా అలవాటైంది. మా ఉద్యోగం ఎలాంటిదంటే... విధి నిర్వహణలో ప్రతి రోజూ ఒక కొత్త సవాల్ ఎదురవుతుంటుంది. ఒక్కో అనుభవం నుంచి ఒక్కో పాఠం నేర్చుకుంటాం.
– సింఘ్ ఇషిత్ రాజ్, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఐఐటి, ముంబయి పూర్వ విద్యార్థిని
స్ఫూర్తిదాయకం....
విధుల్లో చేరిన నాటి నుంచి ఈ మహిళల నిబద్ధత, పనిలో చూపుతున్న ప్రగతి స్ఫూర్తిదాయకంగా ఉంది. చక్కగా సమన్వయం చేసుకుంటూ విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. మా నమ్మకాన్ని రెట్టింపు చేసారు. మేము ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం. భవిష్యత్తులో రిఫైనరీలో మరింత ఎక్కువమంది మహిళలు పనిచేయడానికి అవకాశాలు కల్పిస్తాం.
– వి.రతన్ రాజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెచ్‌పిసిఎల్, విశాఖ రిఫైనరీ
– వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం
ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment