Night shift
-
IMA study: ఆత్మరక్షణకు ఆయుధాలు
దేశంలో మూడింట ఒక వంతు వైద్యులు రాత్రి షిఫ్టుల్లో అభద్రతతో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. దాంతో కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తీసుకెళ్లడం తప్పదన్న భావనకు కూడా వచ్చారట. ఐఎంఏ అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశమంతటా ఆందోళనకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి షిఫ్టుల్లో వైద్యుల భద్రతను అంచనా వేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆన్లైన్ సర్వే చేపట్టింది. 3,885 వైద్యుల వ్యక్తిగత ప్రతిస్పందనలతో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే అతి పెద్ద అధ్యయనమని ఐఎంఏ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు వారు. 61 శాతం ఇంటర్న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలున్నారు. కేరళ స్టేట్ ఐఎంఏ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్, ఆయన బృందం రూపొందించిన ఈ సర్వే ఫలితాలను ఐఎంఏ కేరళ మెడికల్ జర్నల్ అక్టోబర్ సంచికలో ప్రచురించనున్నారు. ఈ ఆన్లైన్ సర్వేను గూగుల్ ఫామ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు పంపారు. 24 గంటల్లో 3,885 స్పందనలు వచ్చాయని డాక్టర్ జయదేవన్ తెలిపారు. ‘‘వీరిలో చాలామంది దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్టుల్లో అరక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది, పరికరాలను మెరుగుపరచాల్సిన అవసరముంది’’ అని అధ్యయనం పేర్కొంది.అధ్యయన నివేదిక...కొన్ని ఎంబీబీఎస్ కోర్సుల్లో లింగ నిష్పత్తికి అనుగుణంగా మహిళలు 63 శాతం ఉన్నారు. తమకు భద్రత లేదని భావించే వారి నిష్పత్తి మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. 20–30 ఏళ్ల వయస్సున్న వైద్యులు అతి తక్కువ భద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఇంటర్న్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. నైట్ షిఫ్టుల్లో 45 శాతం మందికి డ్యూటీ రూమ్ కూడా అందుబాటులో లేదు. రద్దీ, ప్రైవసీ లేకపోవడం, డ్యూటీ గదులకు తాళాలు లేకపోవడమే గాక అవి సరిపోవడం లేదు. దాంతో వైద్యులు ప్రత్యామ్నాయ విశ్రాంతి ప్రాంతాలను వెదుక్కోవాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న డ్యూటీ గదుల్లో మూడింట ఒక వంతు అటాచ్డ్ బాత్రూములు లేవు. దాంతో ఆ అవసరాలకు వైద్యులు అర్ధరాత్రి వేళల్లో బయటికి వెళ్లాల్సి వస్తోంది. సగానికి పైగా (53 శాతం) ప్రాంతాల్లో డ్యూటీ రూము వార్డు/ క్యాజు వాలిటీకి దూరంగా ఉంది. ప్రధానంగా జూ నియర్ డాక్టర్లు ఇలాంటి హింసను అనుభ విస్తున్నారు. పాలన లేదా విధాన రూప కల్పనలో వీరికి ప్రమే యం ఉండటం లేదు.వైద్యుల సూచనలు...→ శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలి.→ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.→ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీపీఏ) అమలు చేయాలి.→ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.→ తాళాలతో కూడిన సురక్షిత డ్యూటీ గదుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.→ సురక్షితమైన, పరిశుభ్రమైన డ్యూటీ రూములు ఏర్పాటు చేయాలి.– ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో మెరుగుదల అవసరం.→ ఆస్పత్రుల్లో తగినంత వైద్య సిబ్బందిని నియమించాలి.→ వార్డులు ఇతర ప్రాంతాల్లో రద్దీ లేకుండా ఏర్పాట్లు చేయాలి.అదనపు సూచనలుమద్యం సేవించిన లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి క్యాజువాలిటీలో పని చేస్తున్న వైద్యులు మౌఖిక, శారీరక బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అత్యవసర గదుల్లో మహిళా వైద్యులకు అనవసరంగా తాకడం, అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పరిమిత సిబ్బంది, తక్కువ భద్రత ఉన్న చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోందని చాలా మంది వైద్యులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అదే పనిగా భర్తకు నైట్ షిఫ్ట్.. కోపంతో భార్య.. రాత్రి మాస్క్ వేసుకుని ఇంట్లోకి దూరి
సాధారణంగా కార్పొరేట్ కంపెనీల్లో నైట్ షిఫ్టులు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా అమెరికా, యూకే ఆధారిత కంపెనీల్లో పని చేస్తుంటే నైట్ షిఫ్ట్‌లు చేయక తప్పదు. ఉద్యోగం కోసం కొందరు తప్పక నైట్ షిఫ్ట్‌లకు అంగీకరించినా.. వారి జీవన విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. రాత్రిళ్లు మేల్కొని పనిచేయాల్సి ఉంటుంది. మెలకువగా ఉండేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయినా ఎలాగోఒకలా డ్యూటీ చేసినా.. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల రావడం కామన్. అదే పనిగా నైట్ షిఫ్ట్... అందుకే రాత్రిపూట పని చేయడానికి చాలా వరకు ఇష్టపడరు. కానీ... కొన్ని చోట్ల కార్పొరేట్ కంపెనీల్లో బాస్‌లు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ బలవంతంగా నైట్ షిఫ్ట్‌లు చేయిస్తుంటారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉదంసింగ్ నగర్ జిల్లాలో ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..టేకి రవ్లీన్, రవ్లీన్ కౌర్ ఇద్దరూ దంపతులు. వీరు ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని ట్రాన్సిట్ క్యాంపు ప్రాంతంలోని హౌసింగ్ డెవలప్మెంట్లో రౌలీన్ నివసిస్తున్నారు. టెకీ రవ్లీన్ పంత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. పగ పెంచుకుంది అదే కంపెనీలో పనిచేస్తున్న రవ్లీన్ హెడ్ దీపక్ భాటియా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ ఇటీవల రవ్లీన్కు అదే పనిగా నైట్ షిఫ్ట్ వేయిస్తున్నాడు. అంతే కాకుండా జీతం కూడా పెంచలేదు. రోజూ భర్త రాత్రికి వెళ్లి నైట్ షిఫ్ట్ చేసి తెల్లవారుజామున తిరిగి వచ్చేవాడు, దీంతో క్రమంగా అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. ఈ క్రమంలో తన భర్త యజమానిపై రవ్లీన్ కౌర్ పగ పెంచుకుంది. అతనికి తగిన బుద్ధి చెప్పాలనుకుని అందుకోసం ఓ ప్లాన్ వేసింది.. ఓ రోజు రాత్రి మాస్క్ ధరించి భర్త బాస్ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న యజమాని తల్లిపై దాడి చేసి.. ఆమె తలపై సుత్తితో బాదింది. ఆమె గట్టిగా అరిచింది. ఈ క్రమంలో.. అరుపులు విని ఆమె మనవడు గదిలోకి వచ్చాడు. దీంతో ఆ మహిళ భయపడి అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆపై.. సీసీటీవీల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేం రివెంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి Aunty Network: హోరు వానలో.. కూర్చుని ముచ్చట్లు పెట్టిన ఆంటీలు.. -
పార్ట్‌టైమ్ ఉద్యోగాలపై మహిళల ఆసక్తి
న్యూఢిల్లీ: అవసరాల రీత్యానే కాకుండా ఆర్థిక స్వాతంత్య్రం కోసం కూడా ఉద్యోగాలు చేయాలనుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది. తీవ్ర పోటీతో కూడుకున్న జాబ్ మార్కెట్లో తమకంటూ గుర్తింపు సాధించుకోవాలని వారు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా శ్రమతో కూడుకున్నవి, నైట్ షిఫ్టులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. 2022లో ట్రెండ్స్‌కి సంబంధించి ఉద్యోగాలు, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం ’అప్నా’ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం పార్ట్ టైమ్ ఉద్యోగాలకు మహిళల నుంచి వచ్చిన దరఖాస్తులు 67 శాతం పెరిగాయి. అదే సమయంలో ఫుల్ టైమ్ ఉద్యోగాలకు వచ్చిన అప్లికేషన్లు 34 శాతమే పెరిగాయి. అటు నైట్ షిఫ్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల సంఖ్య 60 శాతం పెరిగింది. శ్రమ ఎక్కువగా ఉండే డెలివరీ, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫ్యాక్టరీ వర్కర్లు, డ్రైవర్ల ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 34 శాతం పెరిగినట్లు అప్నాడాట్‌కో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మానస్ సింగ్ తెలిపారు. పేటీఎం, జొమాటో, ర్యాపిడో, స్విగ్గీ వంటి కంపెనీలు తమ కార్యాలయాల్లో సిబ్బందిపరమైన వైవిధ్యాన్ని పాటించేందుకు మహిళల కోసం అత్యధికంగా ఉద్యోగాలను పోస్ట్ చేశాయి. హైదరాబాద్, చెన్నైలాంటి పెద్ద నగరాలతో పాటు ఇండోర్‌లాంటి చిన్న పట్టణాల్లోనూ పోస్టింగ్‌లు 28 శాతం పెరిగినట్లు అప్నా నివేదిక పేర్కొంది. -
యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న యోగి సర్కార్ తాజాగా మహిళలకు శుభవార్త చెప్పింది. వివరాల ప్రకారం.. యూపీలో మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్ షిప్ట్‌లు వేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో పనిచేయవద్దని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులను కోరింది. ఈ క్రమంలోనే ఒకవేళ సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేసే మహిళా ఉద్యోగులకు ఆఫీసు యాజమాన్యం ఉచిత రవాణా సౌకర్యంతో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు కంపెనీలు, ఆఫీసులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. అంతేకాకుండా.. ఇక నుంచి మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీ చేయమని బలవంతం చేయడానికి వీలు లేదు.. అవసరమైన సేవలు మినహా అన్ని విభాగాలతో పాటు ప్రైవేట్ సంస్థలలో ఈ నిబంధనలు వర్తిస్తాయని సమాచార ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ తెలిపారు. అలాగే, ఆఫీసుల్లో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, త్రాగునీటి సౌకర్యాలతో పాటు పని చేసే ప్రదేశంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా, మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా.. వారు తమ కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇది కూడా చదవండి: పోలీస్స్టేషన్ల సీసీటీవీల్లో ఆడియో ఫుటేజీ తప్పనిసరి -
హెచ్‌పీసీఎల్ జాబిలమ్మలు...
ఏదీ తనంతట తాను దరిచేరదు, ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు అక్షర సత్యమని నిరూపించారీ యువతులు. పెట్రోల్ ఉత్పత్తి కర్మాగారంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తున్నారీ మహిళలు. సంస్థ పురోగతిలో మేము సైతం అని ముందడుగు వేశారు విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) సంస్థ ఉద్యోగినులు. హెచ్‌పిసిఎల్ సంస్థ పనివేళలు... ఉదయం 8 నుంచి 4.30 గంటల వరకు జనరల్ షిఫ్ట్, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు సాయంత్రం షిఫ్ట్, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అర్ధరాత్రి షిఫ్ట్లుంటాయి. మోటార్ స్పిరిట్ (పెట్రోల్)ను తయారు చేసే విభాగంలో ఇంజనీరింగ్ చదివి సుశిక్షితులైన 15 మంది విధులను నిర్వహిస్తున్నారు. కంట్రోల్ రూమ్ విభాగంలో క్షణక్షణం అప్రమత్తులై కన్నార్పకుండా పరిశీలించడంతోపాటు, అత్యవసర సమయాలలో ప్లాంట్‌లో సమస్యలను గుర్తించడం, వాటిని సరిచేయడం, సరఫరా వ్యవస్థను నిరాఘాటంగా నడపడం వీరి విధులు. ప్రతి షిఫ్ట్‌లో ముగ్గురు మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి రొటీన్ సజావుగా సాగుతోంది. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ మహిళలకు రాత్రి విధులు అప్పగించడానికి ముందు... వారి భద్రత గురించి చాలా కసరత్తు జరిగింది. సాయంత్ర షిఫ్ట్, అర్ధరాత్రి షిఫ్ట్‌కు హాజరయ్యే మహిళలకు క్యాబ్ సదుపాయంతోపాటు సెక్యూరిటీ గార్డులుగా కూడా మహిళలనే నియమించారు. నైట్ షిఫ్ట్ ఉద్యోగినులకు మార్షల్ ఆర్ట్స్(ఆత్మరక్షణ)లో ప్రాథమిక తర్ఫీదు ఇచ్చారు. మహిళలు డ్యూటీకి రావడానికి ఇంటి నుంచి బయలు దేరిన సమయం నుంచి హిందుస్థాన్ పెట్రోలియం ప్లాంట్‌కు చేరే వరకు, విధులు ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకునే వరకు వారు ప్రయాణించే వాహనం గమనాన్ని పరిశీలించే జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ క్షణంలో స్పందించాలి పరిశ్రమలో పనిచేయడం ఎంతో సంక్లిష్టమైన విషయం. ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించాలి. ఆ క్షణంలో మేము తీసుకున్న నిర్ణయంతోపాటు అమలు చేసే విధానం కూడా వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఆపరేషన్స్ విభాగంలో పనిచేయడం ఎంతో అవసరం. ఇది మా ప్రగతికి దోహదం చేస్తుంది. – ఎం. నవ్య, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఐఐటి, ఖర్గపూర్ పూర్వ విద్యార్థి ఇది మంచి ప్రయత్నం గతంలో సేల్స్‌లో విధులు నిర్వర్తించాను. ఫిబ్రవరిలో ఎంఎస్ బ్లాక్ విధుల్లోకి వచ్చాను. మహిళలు నైట్‌షిఫ్ట్‌లలో పనిచేస్తున్న విషయం ఇంట్లో చెప్పి వారిని ఒప్పించాను. సాహసోపేతమైన నిర్ణయంలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది. – వై. చందన, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఎన్ఐటి వరంగల్ పూర్వ విద్యార్థి సవాళ్ల ఉద్యోగం మేము ఎంచుకున్న రంగం ఎన్నో సవాళ్లతో కూడినదనే విషయం మాకు విద్యార్థిగా ఉన్నపుడే అర్థమైంది. మానసికంగా ముందుగానే సన్నద్ధం అయి ఉండడంతో విధి నిర్వహణ మాకు పెద్దగా కష్టం అనిపించలేదు. ప్లాంట్‌లో సమస్య రావడం, గ్యాస్ లీకవడం వంటివి జరుగుతుంటాయి. వీటిని డిటెక్టర్లతో వెంటనే గుర్తించి ప్రమాదాలను నివారించడం పెద్ద సవాలే. కానీ టాస్క్ మొత్తాన్ని మా చేతులతో పూర్తి చేసిన తర్వాత కలిగే సంతోషం కూడా అంతే పెద్దది. – ఆర్. సత్య శిరీష, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని సంస్థ నిర్ణయం ధైర్యాన్నిచ్చింది నైట్ షిఫ్ట్ కోసం మా సంస్థ ఏర్పరచిన ప్రత్యేక రక్షణ సదుపాయాలు బాగున్నాయి. కంట్రోల్ రూమ్‌లో ప్లాంట్ పనితీరును నిరంతరం పర్యవేక్షించడం, డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ సిస్టమ్‌ను నిర్వహించడంలో అందరం మహిళలం అయిన కారణంగా ఎటువంటి సమస్యలూ ఎదురవలేదు. విధినిర్వహణలో ఆపరేటర్లను, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేయడం, తగిన సూచనలు అందించడం మా విధి. కొన్ని సందర్భాలలో అత్యవసరంగా షట్ డౌన్ చేయాల్సి వస్తుంది కూడా. కీలకమైన విధులను కూడా విజయవంతంగా చేయగలుగుతున్నామనే తృప్తి ఉంది. – సిప్రా ప్రియదర్శిని, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఎన్ఐటి రూర్కెలా పూర్వ విద్యార్థిని నైట్ షిఫ్టే బెటర్ నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహించడం వలన పగలు తగినంత అదనపు సమయం లభిస్తోంది. వ్యక్తిగత పనులు చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంది. జనరల్ షిఫ్ట్ కంటే నైట్ షిఫ్టే బాగుంది. – శిఖ, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, జాదాపూర్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని రోజుకో కొత్త పాఠం ఇక్కడికి ప్యానల్ ఆఫీసర్ గా వచ్చాను. నైట్ షిఫ్ట్ కొత్తలో కొంత సవాలుగా అనిపించింది. మెల్లగా అలవాటైంది. మా ఉద్యోగం ఎలాంటిదంటే... విధి నిర్వహణలో ప్రతి రోజూ ఒక కొత్త సవాల్ ఎదురవుతుంటుంది. ఒక్కో అనుభవం నుంచి ఒక్కో పాఠం నేర్చుకుంటాం. – సింఘ్ ఇషిత్ రాజ్, హెచ్‌పిసిఎల్ ఉద్యోగిని, ఐఐటి, ముంబయి పూర్వ విద్యార్థిని స్ఫూర్తిదాయకం.... విధుల్లో చేరిన నాటి నుంచి ఈ మహిళల నిబద్ధత, పనిలో చూపుతున్న ప్రగతి స్ఫూర్తిదాయకంగా ఉంది. చక్కగా సమన్వయం చేసుకుంటూ విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. మా నమ్మకాన్ని రెట్టింపు చేసారు. మేము ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం. భవిష్యత్తులో రిఫైనరీలో మరింత ఎక్కువమంది మహిళలు పనిచేయడానికి అవకాశాలు కల్పిస్తాం. – వి.రతన్ రాజ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెచ్‌పిసిఎల్, విశాఖ రిఫైనరీ – వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
నైట్‌షిఫ్ట్‌తో క్యాన్సర్ ముప్పు!
న్యూఢిల్లీ: అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులతో రాత్రిపూట కూడ పనిచేయించు కొంటున్నాయి. ఈ కంపెనీలు ప్రధానంగా అమెరికా,యూకే దేశాలతో తమ ప్రాజెక్టులను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయనే విషయం తెలిసిందే..అయితే తాజాగా, వాషింగ్టన్ యూనివర్సీటీ పరిశోధనల్లో మరొక భయంకరమైన విషయాన్నివెలుగులోకి తెచ్చింది. దీని ప్రకారం, పగటిపూట పనిచేసే వ్యక్తులతో పోలీస్తే, రాత్రిళ్ళు పనిచేసే వ్యక్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని తెలిపింది. కాగా,ఈ రీసెర్చ్‌ను జర్నల్ ఆఫ్ పినీల్ రీసెర్చ్‌లో ప్రచురించారు. వీరిలో శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయని కూడా తెలిపారు. అయితే..రాత్రిళ్ళు పనిచేసే వారిలో జీవ గడియారంలో మార్పులు వచ్చి..ఏదిసరిగ్గా గుర్తుండక పోవడం, ఆకలిలేకపోవడం, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో గుండె సంబంధిత ప్రభావం కూడా ఎక్కువేఅని అంటున్నారు. కాగా, తాజా పరిశోధనలతో నైట్ షిప్టులు ప్రమాదకరమనే విషయం మరోసారి రుజువైంది. చదవండి: మేనకోడలిని దారుణంగా చంపాడు! -
నైట్‌షిఫ్టులో పని చేస్తున్నారా?
ఈ రోజుల్లో రాత్రంతా డ్యూటీలు చేయాల్సిన ఉద్యోగాలు పెరిగాయి. దాంతో చాలా మంది ఉద్యోగులు రాత్రిపూట నుంచి వేకువజాము వరకు పని చేయాల్సివస్తోంది. మామూలుగా రోజూ రాత్రి నిద్రపోయే వారి ఆహారపు అలవాట్లతో పోలిస్తే... నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. గాస్ట్రోఇంటస్టినల్ సమస్యతో పాటు రక్తపోటు, గుండె సమస్యలు, యాంగై్జటీ, ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్ వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వాళ్లలో బరువు పెరిగి ఊబకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఎందుకంటే... సాధారణ వ్యక్తులు రాత్రి నిద్రపోవడం వల్ల, ఉదయం వరకు భోజనం తీసుకోరు. రాత్రి డ్యూటీలు చేసేవారికి మెలకువగా ఉన్న సమయంలో ఆకలేయడం వల్ల రాత్రివేళ్లలోనూ యథావిధిగా తింటుంటారు. సాధారణంగా ఆ తినేవన్నీ మామూలు భోజనంలా కాకుండా కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్ఫుడ్స్, జంక్ఫుడ్స్ వంటివే ఎక్కువ. అందుకే రాత్రివేళ పనిచేసే అసమతౌల్య ఆహారపు అలవాట్లు చోటుచేసుకోవడంతో పాటు... వారికి సాధారణంగా శారీరక శ్రమ చేయాల్సిన అవసరం కూడా బాగా తగ్గుతుంది. ఊబకాయంతో వచ్చే ఆరోగ్యపరమైన ముప్పులను తప్పించుకునేందుకు అనుసరించాల్సిన ఆహారపు అలవాట్లు... ►రాత్రుళ్లు పెద్ద పెద్ద పరిమాణాల్లో తక్కువ సార్లు కాకుండా... చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. దాంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. దాంతో పైన చెప్పిన గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలను నివారించవచ్చు. ►ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండాలి. ►ఆఫీసుల్లోని వెండింగ్ మెషిన్, కాఫెటేరియా వద్ద ఉన్న ఆహారపదార్థాలను సాధ్యమైనంత వరకు తీసుకోకండి. ఇంటిదగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారాన్నే తీసుకోండి. ►ఒకవేళ కాఫెటేరియా ఫుడ్‌నే తీసుకోవాల్సి వస్తే.. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే... సలాడ్స్, పళ్లు, మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు, గింజధాన్యాలు (ఉదాహరణకు... పొట్టుతోనే ఉన్న గోధుమలతో చేసిన రోటీలు, మొక్కజొన్నలతో చేసిన పదార్థాలు, బ్రౌన్‌బ్రెడ్ శాండ్విచ్లు) వంటివి తీసుకోండి. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్లు (ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, చిప్స్ వంటివి) అవాయిడ్ చేయండి. ►రాత్రివేళల్లో తీపి పదార్థాలు, రిఫైన్డ్ ఫుడ్స్ (క్యాండీలు, చాక్లెట్లు, వైట్ బ్రెడ్స్, బన్స్, పాస్తాస్, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్) వంటి వాటిని సాధ్యమైనంత వరకు తీసుకోకండి. ►రాత్రివేళల్లో పనిచేసేవారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. పగటితో పోలిస్తే రాత్రి ఒకింత చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్లు తాగడం తగ్గుతుంది. దాని వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి తరచూ నీళ్లు తాగటం మంచిది. ►రాత్రివేళల్లో పనిచేసేటప్పుడు కాఫీ, టీ లు తాగడం చాలా ఎక్కువవుతుంది. కానీ వాటిని వీలైనంతగా తగ్గించడం మంచిది. ►రాత్రివేళల్లో పనిచేసేవారు చాలావరకు తమ వ్యాయామాలను వదిలేస్తుంటారు. అయితే వర్క్షెడ్యూల్ను అనుసరించి రోజులో ఏదో ఒక నిర్ణీత సమయంలో ప్రతిరోజూ 45 – 60 నిమిషాల పాటు తప్పనిసరిగా ►వ్యాయామం చేయడం మంచిది. ఈ వ్యాయామం అన్నది మీరు పనికి వెళ్లే ముందర చేస్తే రాత్రంతా ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది. పైగా రాత్రి సమయంలో పని చేసేటప్పుడు తూగురావడం వంటివి జరగవు. ►ఇలా వ్యాయామం చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం తక్కువ. బరువు నియంత్రణలో ఉంటుంది. ►వ్యాయామం కారణంగా ఆడ్ టైమింగ్ అయిన రాత్రి పనివేళల్లో పనిచేయడం వల్ల కలిగే ఒత్తిడిని నివారించడం సాధ్యమవుతుంది. అధిక రక్తపోటు (హైబీపీ), డిస్లిపిడేమియా (రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు అసాధారణంగా పెరగడం) వంటి వాటిని కూడా నివారించవచ్చు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కర్ణాటకలో మహిళలకు నైట్‌షిఫ్ట్
బెంగళూరు: మహిళలు నైట్‌షిఫ్ట్‌లో (రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు) పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పరిశ్రమల చట్టం కింద నమోదైన పరిశ్రమల్లో మహిళలు రాత్రిపూట పనిచేయవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఐటీ పరిశ్రమ, ఐటీ అనుబంధ విభాగాల్లో మాత్రమే మహిళల నైట్ షిఫ్ట్‌లకు అనుమతి ఉంది. అయితే దీనికి పలు నిబంధనలు పాటించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇష్టపూర్వకంగా పనిచేస్తున్నామని మహిళల నుంచి లేఖలు తీసుకోవాలని చెప్పింది. కనీసం 10 మంది మహిళా ఉద్యోగులు ఉండాలని, మహిళలు పనిచేసే చోట పూర్తి వెలుతురుతో పాటు సీసీకెమెరాల పర్యవేక్షణ ఉండాలని తెలిపింది. సీసీకెమెరాల రికార్డులను కనీసం 45 రోజుల పాటు నిక్షిప్తం చేయాలంది. ప్రతి 15 రోజులకు ఒకసారి పనిచేసిన మహిళల నివేదికలను పరిశ్రమల ఇన్స్పెక్టర్తోపాటు స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని చెప్పింది. -
నైట్షిఫ్ట్లతో డీఎన్ఏలో మార్పులు
ఇతరులతో పోలిస్తే నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసే వారి డీఎన్ఏలో చాలా ఎక్కువగా మార్పులు వస్తుంటాయని హాంకాంగ్ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. ఫలితంగా గుండెజబ్బులు, నాడీసంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వీరు అంటున్నారు. అనెస్థీషియా అకడమిక్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. నైట్‌షిఫ్ట్‌లో పనిచేసే వారి డీఎన్ఏ మార్పులు... మామూలు వారితో పోలిస్తే 30 శాతం వరకూ ఎక్కువ ఉంటాయి. దీనికి నిద్రలేమి కూడా తోడైతే డీఎన్ఏ నష్టం ఇంకో 25 శాతం ఎక్కువ ఉంటుంది. డీఎన్ఏలో తరచూ ఒకటి అరా మార్పులు జరగడం మామూలే అయినప్పటికీ రెండుగా విడిపోయేటప్పుడు ఈ మార్పులు కొనసాగడం.. మరమ్మతులకు లొంగకపోవడం వల్ల సమస్యలు వస్తూంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డబ్ల్యూ.చోయి తెలిపారు. తాము జరిపిన అధ్యయనంలో రాత్రిపూట పనిచేసే వారితోపాటు మూడురోజులపాటు సరైన నిద్ర లేని వారి రక్తాన్ని విశ్లేషించామని, కాకపోతే ఈ పరీక్షలు చాలా తక్కువ మందితో జరిపామని చోయి వివరించారు. మరిన్ని విస్తృత పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకున్న తరువాతే డీఎన్ఏ విడిపోవడానికి.. వ్యాధులకూ ప్రత్యక్షసంబంధం ఉందని చెప్పగలమని వివరించారు. -
నైట్ డ్యూటీలతో డీఎన్ఏకు చేటు
బీజింగ్: రాత్రిపూట విధులు నిర్వర్తించే వారిలో డీఎన్ఏకు ముప్పు పొంచి ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల కేన్సర్, హృదయ, జీవక్రియ, నాడీ వ్యవస్థకు సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశముందని తెలిపింది. ఫుల్ టైమ్ విధులు నిర్వర్తించే 49 మంది వైద్యుల రక్త నమూనాలను వివిధ సమయాల్లో సేకరించి యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్ పరిశోధకులు అధ్యయనం చేశారు. ‘ఈ పని చాలా చిన్నదైనప్పటికీ స్పష్టమైన ఫలితాలు వెల్లడయ్యాయి. రాత్రి పూట విధులు నిర్వర్తించే వారిలో నిద్రలేమి సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇటు డీఎన్ఏ సైతం దిబ్బతింటోంది. ఇదే దీర్ఘకాలిక వ్యాధులను ప్రేరేపించేందుకు దోహదపడుతోంది..’ అని పరిశోధకుల్లో ఒకరైన సియూ–వై చోయ్ చెప్పారు. అలాగే డీఎన్ఏ ఎంత దెబ్బ తింటే అంతగా నిద్రలేమి సమస్య తీవ్రమవుతోందని వెల్లడించారు. -
మీది నైట్ షిఫ్టా..?
సాఫ్ట్వేర్ పుణ్యామా అని జీతాలతో పాటు రోగాలు కూడా పెరిగాయి. సూర్యుడితో పాటు మేలుకోవాల్సిన వారం కాస్తా చంద్రుడితో సహవాసం చేస్తున్నాం. అర్ధరాత్రి పూట.. తెల్లవారు జామున తినడం ఈ రోజుల్లో చాల సాధరణం అయ్యింది. ఫలితంగా ఇంట్లో.. ఒంట్లో రకరకాల సమస్యలు. శరీరం బాగుంటే మనసు బాగుంటుంది.. ఆపై అన్ని బాగుంటాయి. మరి అలా ఉండాలంటే పని గంటలకు తగ్గట్టుగా మన ఆహార అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పూర్తి ఆరోగ్యంగా ఉండోచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో చూడండి.. డిన్నర్‌తో రోజు ప్రారంభం.. ఎవరైనా బ్రేక్‌ఫాస్ట్‌తో తమ రోజును ప్రారంభిస్తారు. కానీ నైట్ షిఫ్ట్ చేసే వారు మాత్రం డిన్నర్‌తో తమ రోజును ప్రారంభించాలంటున్నారు నిపుణులు. మీరు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆఫీస్‌కు వెళ్లేటట్లయితే 7 - 7. 30 మధ్య.. సాయంత్ర 4 గంటలకు ఆఫీస్‌కు వెళ్లేవారు రాత్రి ఎనిమిదింటికల్లా డిన్నర్ చేయడం మేలంటున్నారు నిపుణులు. తేలికపాటి ఆహరం.. డిన్నర్ చేయగానే ఎవరికైనా నిద్ర వస్తున్నట్లు అన్పించడం సహజం. అందుకే నైట్ షిఫ్ట్ చేసేవారు తేలీకపాటి ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయల భోజనం చేయడం.. బ్రౌన్ రైస్ తీసుకోవడం ఉత్తమం. ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫలితంగా చాలా చురుగ్గా పని చేయగల్గుతారు. ఒక చెంచాడు నెయ్యి.. ఆయుర్వేదం ప్రకారం రాత్రి పూట మెలుకువగా ఉంటే శరీరం పొడిగా తయారవుతుంది. అందువల్ల ఆఫీస్‌కు వెళ్లే ముందు ఓ చెంచాడు నెయ్యి తీసుకుంటే మంచిది. అది శరీరాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. వేపుళ్లు అసలే వద్దు.. ఎక్కువగా వేయించిన పదార్థాలు తినడం వల్ల చాలా ఇబ్బందిగా అన్పించడం మాత్రమే కాకా బరువు కూడా అధికంగా పెరుగుతారు. రాత్రి పూట మన జీర్ణ వ్యవస్థ చురుగ్గా ఉండదు. అందువల్ల రాత్రి సమయంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల అది సరిగా జీర్ణం కాదు ఫలితంగా ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. పప్పులే ఉత్తమం.. రాత్రి పూట పని చేసేటప్పుడు ఆకలిగా అనిపిస్తే ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. వేయించిన శనగలు, బాదం పప్పులు వంటి వాటిని తీసుకోవడం మేలంటున్నారు. పిజ్జా బర్గర్లకు దూరంగా ఉండండం మంచిదంటున్నారు. కాఫీ, టీలు వద్దు.. రాత్రి పూట పనిచేసేవారు మెలకువగా ఉండటం కోసం అదేపనిగా కాఫీ, టీలు తాగుతుంటారు. కానీ దీనివల్ల చేకూరే ప్రయోజనం చాలా తక్కువ. నిద్ర వచ్చినట్లు అనిపిస్తే నీరు తాగడం, తాజా పండ్ల రసాలు తీసుకోవడం మేలంటున్నారు. -
పగలు సాఫ్ట్వేర్.. రాత్రి క్యాబ్ డ్రైవర్
సాక్షి, హైదరాబాద్ : వరంగల్‌కు చెందిన కిరణ్‌కుమార్ నగరం లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం 8గంటల నుంచి సాయం త్రం 5గంటల వరకు సంస్థలో బిజీగా ఉంటాడు. నెలకు రూ.45 వేల సంపాదన. ప్రతివారం సినిమా, నెలకు రెండుసార్లు ఔటింగ్.. ఇలా ఎంజాయ్‌చేసే కిరణ్ జీతం తన ఖర్చులకు సరి పోతుంది. దీంతో డబ్బు పొదుపు చేసేందుకు ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఉదయం సాఫ్ట్వేర్ ప్రొఫెష నల్గా పనిచేస్తూనే రాత్రి 8గంటల నుంచి 1గంట వరకు క్యాబ్ డ్రైవింగ్ చేయాలని నిర్ణయించు కున్నాడు. తనకున్న రూ.9 లక్షల విలువైన కారును ఓ ప్రముఖ క్యాబ్ కంపెనీలో లాగిన్ చేశాడు. రోజుకు 5గంటల నుంచి 6గంటల పాటు డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కిరణ్ సంపాదిస్తున్నాడు. ఇలా కిరణ్ ఒక్కడే కాదు.. పగలు కీబోర్డ్‌ను టకటకలాడించినా రాత్రిళ్లు స్టీరింగ్ తిప్పే టెక్కీలు చాలామందే ఉన్నారు. ఒక ప్రముఖ క్యాబ్ సంస్థ అంచనా ప్రకారం రాత్రి వేళల్లో క్యాబ్ డ్రైవ్ చేస్తున్న వాళ్లలో ఎక్కువమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడం కోసం కొందరు, డ్రైవింగ్‌ను కూడా హాబీగా భావిస్తూ మరికొందరు రాత్రివేళ స్టీరింగ్ పడుతున్నారు. 28 శాతం మంది టెక్కీలు... హైదరాబాద్‌లో రెండు ప్రముఖ సంస్థలకు చెందిన క్యాబ్‌లు లక్షపైనే తిరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు అధిక సంఖ్యలో క్యాబ్‌లు నడుస్తున్నాయి. రాత్రి 7 నుంచి ఉదయం 4గంటల సమయంలో మాత్రం తక్కువ సంఖ్యలో సర్వీసులు ఉంటున్నాయి. ఈ రాత్రి సమయాల్లో నడిచే క్యాబుల్లో 28శాతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల క్యాబ్లే ఉంటాయని ఒక అంచనా. వీరితో పాటు మరో 18శాతం ఇతర ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగస్తులవి. మొత్తం 46శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం క్యాబ్ సర్వీసులోకి రావడం ఆసక్తి కల్గిస్తోంది. లగ్జరీ కార్లకు డిమాండ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు ప్రముఖ క్యాబ్సర్వీసుల్లో లగ్జరీ కార్లకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ లగ్జరీ సర్వీసుల్లో ప్రీమియం, ఎస్యూవీ విభాగాలు అందుబాటులో ఉంటాయి. సాధారణ కార్లకు లగ్జరీ కార్లకు రేట్ల విషయంలో 50శాతం వ్యత్యాసం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లగ్జరీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు ఆ కార్ల మెయింటెనెన్స్ కోసం ప్రీమియం, ఎస్యూవీ డిమాండ్లపై నడిపిస్తున్నారు. దీని ద్వారా తక్కువ ట్రిప్పులు చేసినా ఎక్కువ లాభం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వీకెండ్స్‌లో ఏకంగా రోజుమొత్తం సర్వీసులిస్తున్నారు. రెండు విధాలుగా... ప్రస్తుతం 28శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో 20శాతం మంది కార్ల యజమానులే డ్రైవర్లుగా వ్యవహరిస్తూ బిజినెస్ చేస్తున్నారు. మిగిలిన 8శాతం మంది నమ్మకస్తులను డ్రైవర్లుగా పెట్టి లగ్జరీ కార్లను క్యాబు సర్వీసుల్లోకి దించారు. ఉద్యోగ సొమ్ము సేవింగ్స్‌లోకి... జీతాన్ని పొదుపు ఖాతాలో జమచేసుకుంటున్న ప్రైవేట్ ఉద్యోగులు, నెలవారీ ఖర్చులు, ఇంటి కిరాయిలను క్యాబ్ సర్వీసు ద్వారా వచ్చే ఆదాయంతో తీర్చుకుంటున్నారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుందని చెప్తున్నారు. నాకు డ్రైవింగ్ హాబీ నాకు డ్రైవింగ్ ఇష్టం. మాదాపూర్‌లో పనిచేస్తాను. ఆఫీస్ అయిపోగానే ఫ్రెషప్ అయి క్యాబ్ యాప్‌లో లాగిన్ అవుతున్నాను. రాత్రి ఏడునుంచి రెండు గంటల వరకు ఐదారు ట్రిప్పులు ప్రీమియమ్ లేదా ఎస్‌యూవీలో నడుపుతున్నా. నెలకు రూ.20 నుంచి 24వేల వరకు వస్తోంది. డ్రైవింగ్ హాబీతో అదనపు ఆదాయం బావుంది. – చైతన్యసింగ్ ప్రొఫెషన్‌గా ఫీలవుతున్నా నేను మారుమూల ప్రాంతం నుంచి వచ్చా. కష్టపడి చదువుకొని మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 6గంటల పాటు క్యాబ్ సర్వీసులో ఉంటున్నా. నెలకు రూ.20వేల వరకు వస్తోంది. దీనితో కుటుంబానికి, కారుకు సంబంధించి ఈఎంఐలు కట్టేస్తున్నాను. డ్రైవింగ్ అనుకున్నంత సులభంకాదు, ఇది కూడా ప్రొఫెషనల్ ఉద్యోగమే. – రాకేశ్‌కుమార్, కరీంనగర్ -
నైట్ షిఫ్ట్‌ల్లో ఆ రిస్క్ ఎక్కువ
వాషింగ్టన్: నైట్ షిఫ్ట్‌ల్లో తరచూ పనిచేసేవారికి త్వరగా లావెక్కి ఒబెసిటీకి గురయ్యే ప్రమాదం 29 శాతం అధికమని ఓ అథ్యయనంలో వెల్లడైంది. అడపాదడపా నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే వారితో పోలిస్తే నిత్యం రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ ముప్పు మరింత ఎక్కువని తేలింది.రాత్రి వేళల్లో పనిచేయడాన్ని వీలైనంత తగ్గిస్తే ఒబెసిటీ రిస్క్ నుంచి కొంతమేర తప్పించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. పలు ప్రచురిత అథ్యయనాలను విశ్లేషించిన నిపుణులు ఈ అంశాన్ని నిగ్గుతేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది ఉద్యోగులు షిఫ్ట్ వర్క్‌ల్లో నిమగ్నమయ్యారని సీనియర్ స్టడీ రచయిత డాక్టర్ లాప్త్సే వివరించారు. ఇక షిఫ్ట్‌ల్లో పనిచేసేవారిలో పని స్వభావాన్ని అనుసరించి కూడా ఒబెసిటీ, ఓవర్‌వెయిట్ రిస్క్ ఉంటుందని అథ్యయనం వెల్లడించింది. ఒబెసిటీ బ్రెస్ట్ క్యాన్సర్, మధుమేహం, గుండెజబ్బులు వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని ఈ అథ్యయనం పేర్కొంది. -
నిద్రలేదు... అంతా చికాకు... ఏం చేయాలి?
స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ ఇలా షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటివల నిద్ర సరిగా ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ఏ అంశంపైనా సరిగా దృష్టి నిలపలేకపోతున్నాను. తగిన సలహా ఇవ్వగలరు. - కమలాకర్, బెంగళూరు మీరు చెప్పిన వివరాలను బట్టి మీరు ‘షిఫ్ట వర్క్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’తో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చిమార్చి పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. అలారంలాగే మనం తినేవేళలు, నిద్రపోయే సమయాలు ఆ గడియారంలో నమోదై ఉంటాయి. అది నిర్వహించే క్రమబద్ధతకు ‘సర్కేడియన్ రిథమ్’ అని పేరు. ఈ రిథమ్ దెబ్బతినడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయినా వాళ్లకు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. పొద్దున్నే పనిచేసేవాళ్లలో, రాత్రిడ్యూటీలు చేసేవారిలో, పనివేళలు తరచూ నైట్ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి ఈ సమస్య వచ్చిన వారిలో కనిపిస్తుంటాయి. ఇలాంటివారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిద్రపట్టడంలో ఇబ్బంది, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలూ కనిపిస్తాయి. దాంతో పనుల్లో తప్పులు చేయడం, ఒక్కోసారి గాయపడటం కూడా జరుగుతుంది. ఒక్కోసారి వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. రక్తంలో కొవ్వుల పాళ్లు పెరగడం, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల బారిన పడటం, గుండెజబ్బల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ ఉండే కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్ వర్క్ డిజార్డర్‌తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీ, మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి. - డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కార్యాలయం నుంచి కార్పొరేట్ బోర్డుల దాకా... మహిళలకు తప్పని వివక్ష
కార్యాలయంలోనే కాదు... వేతనాలు, పనివేళలు, ఆఖరికి కార్పొరేట్ బోర్డుల్లోనూ మహిళల పట్ల వివక్షే కనిపిస్తోంది. కొన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న వారిని మినహాయిస్తే... మెజారిటీ మహిళలు పలు అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారనేది వాస్తవం. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో 48 శాతం మంది మహిళలున్నారు. లింగ వివక్ష సూచీలోని 152 దేశాల్లో మనది 127వ ర్యాంకు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘నేటి మహిళ’ పరిస్థితి చూద్దాం. మహిళల పురోగతిలో అట్టడుగున భారత్ ఆర్థిక, సామాజికాంశాల్లో మహిళలకు సమానత్వానికి సంబంధించి 16 ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్ అట్టడుగు స్థాయిలో నిల్చింది. బంగ్లాదేశ్, శ్రీలంక కూడా మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. మాస్టర్‌కార్డ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనిప్రకారం ఆసియా పసిఫిక్ దేశాల్లోని మహిళ లు విద్య విషయంలో పురుషుల కంటే ముందు ఉంటున్నప్పటికీ, వ్యాపారాల్లో.. రాజకీయాల్లో వారితో సమానత్వం ఉండటం లేదు. సమానత్వానికి సంబంధించి న్యూజిలాండ్ ఇండెక్స్ స్కోరు అత్యధికంగా 77గా ఉండగా, భారత్ మాత్రం 44.2 స్కోరుతో అట్టడుగు స్థానాన్ని దక్కించుకుంది. మహిళా డెరైక్టర్లు తక్కువే... ప్రతి లిస్టెడ్ కంపెనీలోనూ ఒక మహిళా డెరైక్టర్ ఉండాలని కంపెనీల చట్టం నిర్దేశిస్తోంది. కానీ బీఎస్ఈ 200 కంపెనీల బోర్డుల్లో మహిళలు కేవలం 9.5 శాతం. ఇంకా రీసెర్చ్ సంస్థ క్యాటలిస్ట్ నివేదించిన దాని ప్రకారం ఏ దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే... వేతనాల్లోనూ తేడాలే... ఐటీ రంగంలో కనీస వేతనం గంటకు రూ.291. ఇది సగటున గంటకు రూ.341. ఇతర రంగాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే పురుషులతో పోలిస్తే ఇక్కడ కూడా మహిళలు 34% తక్కువ జీతాల్ని పొందుతున్నట్లు ఆన్లైన్ కెరీర్, నియామకాల సొల్యూషన్స్ ప్రొవైడర్ మాన్స్టర్ ఇండియా పేర్కొంది. వివిధ రంగాల సగటు జీతాలు గంటకు... విద్యారంగంలో మహిళలు ఎక్కువ ఉండటమే తక్కువ జీతాలకు కారణమన్నది అభిప్రాయం. దావోస్‌కు వెళ్లినవారిని చూసినా... ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పలువురు మహిళా వ్యాపార దిగ్గజాలు కూడా పాల్గొన్నారు. మొత్తం 2,500 మంది డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొంటుండగా వీరిలో మహిళలు 17 శాతం మందే. గడిచిన 2-3 ఏళ్లలో మహిళల సంఖ్య ఇదే స్థాయిలో ఉంది. ఇందులోనూ భారత్ నుంచి హాజరవుతున్న వారి సంఖ్య మరీ తక్కువ. రాత్రి షిఫ్ట్‌లలో తగ్గుతున్న మహిళలు... రాత్రి షిఫ్ట్ ఉండే కంపెనీలు, పట్టణ శివార్లలో ఉన్న కంపెనీల్లో మహిళ ఉద్యోగుల సంఖ్య గత రెండేళ్లలో 27% తగ్గిందని అసోచామ్ వెల్లడించింది. ఉద్యోగం చేయడానికి ఎక్కువ గంటలు ప్రయాణించాల్సి రావడం, భద్రత, తదితర అంశాలు ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భద్రతకు సంబంధించి ఆందోళన అధికంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో ఉన్నాయి. మహిళల భద్రతకు సంబంధించి దక్షిణాది నగరాల్లో ఒకింత మెరుగైన పరిస్థితులున్నాయి. రిటైర్మెంట్ అనంతర వ్యయాల విషయంలో పురుషులకన్నా, స్త్రీలు ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు హెచ్ఎస్బీసీ సర్వే ఒకటి తెలిపింది. -
రాత్రిషిఫ్ట్ ఉద్యోగాల్లో తగ్గుతున్న మహిళలు
న్యూఢిల్లీ: రాత్రి షిఫ్ట్ కలిగిన కంపెనీలు, పట్టణ శివార్లలో ఉన్న కంపెనీల్లో మహిళ ఉద్యోగుల సంఖ్య గత రెండేళ్లలో 27 శాతం తగ్గిందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. ఉద్యోగం చేయడానికి ఎక్కవ గంటలు ప్రయాణించాల్సి రావడం వల్ల కూడా మహిళ ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నదని ఈ నివేదిక పేర్కొంది. 20 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న మొత్తం 1,600 మంది ఉద్యోగులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 12% పెరిగిన ఆన్లైన్ ఉద్యోగాలు: కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాలలో 12% వృద్ధి నమోదైంది. హైదరాబాద్‌లో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాల డిమాండ్ అత్యధికంగా 36% పెరిగినట్లు టైమ్స్‌జాబ్.కామ్ పేర్కొంది. రంగాల వారీగా చూస్తే ఐటీ రంగంలో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాల డిమాండ్ అత్యధికంగా 22% పెరిగినట్లు తెలిపింది. -
రాత్రంతా హోటళ్లు, రెస్టారెంట్లు
అభ్యంతరం లేదన్న పోలీసు విభాగం సాక్షి, ముంబై: నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, పాల కేంద్రాలు, కాఫీ సెంటర్లు, మందుల షాపులు తదిత అత్యవసర సేవలకు సంబంధించిన దుకాణాలు రాత్రి వేళల్లో తెరిచి ఉంచితే తమకు అభ్యంతరం లేదని ముంబై పోలీసు శాఖ స్పష్టం చేసింది. దీంతో సెకండ్, నైట్ షిప్టులో పనిచేసే ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వ్యాపారులకు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సాధారణ ప్రజలకు ఎంతో ఊరట లభించనుంది. గడియారంలో ముల్లులాగా 24 గంటలు ఉరుకులు, పరుగులతో జీవనం సాగించే ముంబైకర్లకు రాత్రి 10 గంటలు దాటిన తరువాత మంచి హోటళ్లు, రెస్టారెంట్లు, కనీసం కాఫీ సెంటర్లు కూడా అందుబాటులో ఉండవు. నేటి ఆధునిక, పోటీ కాలంలో అనేక ప్రైవేట కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు రాత్రి వేళల్లో కూడా పనిచేస్తున్నాయి. నైట్ షిఫ్టుల్లో పని చేసే వారికి అర్థరాత్రి సమయంలో కనీసం అల్పాహారం, టీ, కాఫీ కూడా దొరకవు. దీంతో గత్యంతరం లేక చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై లభించే అపరిశుభ్రమైన, కల్తీ తినుబండరాలు తినక తప్పడం లేదు. ముంబైకర్ల సౌకర్యార్థం రాత్రి వేళల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, పాల కేంద్రాలు తెరిచి ఉంచాలని గతంలో శివసేన కార్పొరేటర్లు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్థాయి సమితిలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మంజూరు లభించడంతో ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ప్రభుత్వం మారిన తరువాత ఈ ప్రదిపాదనను మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన బీజేపీ, శివసేన ప్రభుత్వం రాత్రి వేళల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఈ ప్రతిపాదనను ముంబై పోలీసు శాఖకు పంపించారు. నారిమన్‌పాయింట్, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), షాపింగ్ మాల్స్ లాంటి నివాసేతర ప్రాంతాలలో హోటళ్లు, రెస్టారెంట్లు, కాఫీ సెంటర్లు, పాల డెయిరీలు ప్రారంభించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసు శాఖ ప్రభుత్వంతో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రులున్న ప్రాంతాల్లో మాత్రమే మెడికల్ షాపులు (అనుమతి పొందినవి) 24 గంటలు తెరిచి ఉంటున్నాయి. మిగతా ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తరువాత వాటిని మూసివేస్తున్నారు. అత్యవసరం సమయంలో మందులు కావాలంటే ఆస్పత్రులున్న ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇక నుంచి ఉరుకులు పరుగులు తీయనవసరం లేదు. త్వరలో ముంబై పోలీసు శాఖ నుంచి సర్క్యులర్ విడుదల కానుంది. ఆ తరువాత అత్యవసర సేవల షాపులన్నీ అందుబాటులోకి వస్తాయి.