స్లీప్ కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ ఇలా షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటివల నిద్ర సరిగా ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ఏ అంశంపైనా సరిగా దృష్టి నిలపలేకపోతున్నాను. తగిన సలహా ఇవ్వగలరు.
- కమలాకర్, బెంగళూరు
మీరు చెప్పిన వివరాలను బట్టి మీరు ‘షిఫ్ట వర్క్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’తో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చిమార్చి పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్‌కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. అలారంలాగే మనం తినేవేళలు, నిద్రపోయే సమయాలు ఆ గడియారంలో నమోదై ఉంటాయి. అది నిర్వహించే క్రమబద్ధతకు ‘సర్కేడియన్ రిథమ్’ అని పేరు.
ఈ రిథమ్ దెబ్బతినడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయినా వాళ్లకు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. పొద్దున్నే పనిచేసేవాళ్లలో, రాత్రిడ్యూటీలు చేసేవారిలో, పనివేళలు తరచూ నైట్ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి ఈ సమస్య వచ్చిన వారిలో కనిపిస్తుంటాయి.
ఇలాంటివారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిద్రపట్టడంలో ఇబ్బంది, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలూ కనిపిస్తాయి. దాంతో పనుల్లో తప్పులు చేయడం, ఒక్కోసారి గాయపడటం కూడా జరుగుతుంది. ఒక్కోసారి వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. రక్తంలో కొవ్వుల పాళ్లు పెరగడం, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల బారిన పడటం, గుండెజబ్బల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ ఉండే కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్ వర్క్ డిజార్డర్‌తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీ, మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి.
- డాక్టర్ రమణ ప్రసాద్
స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
నిద్రలేదు... అంతా చికాకు... ఏం చేయాలి?
Published Mon, Sep 19 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
Advertisement