ఈ రోజుల్లో రాత్రంతా డ్యూటీలు చేయాల్సిన ఉద్యోగాలు పెరిగాయి. దాంతో చాలా మంది ఉద్యోగులు రాత్రిపూట నుంచి వేకువజాము వరకు పని చేయాల్సివస్తోంది. మామూలుగా రోజూ రాత్రి నిద్రపోయే వారి ఆహారపు అలవాట్లతో పోలిస్తే... నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. గాస్ట్రోఇంటస్టినల్ సమస్యతో పాటు రక్తపోటు, గుండె సమస్యలు, యాంగై్జటీ, ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్ వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వాళ్లలో బరువు పెరిగి ఊబకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే.
ఎందుకంటే... సాధారణ వ్యక్తులు రాత్రి నిద్రపోవడం వల్ల, ఉదయం వరకు భోజనం తీసుకోరు. రాత్రి డ్యూటీలు చేసేవారికి మెలకువగా ఉన్న సమయంలో ఆకలేయడం వల్ల రాత్రివేళ్లలోనూ యథావిధిగా తింటుంటారు. సాధారణంగా ఆ తినేవన్నీ మామూలు భోజనంలా కాకుండా కొవ్వులు ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్, జంక్‌ఫుడ్స్ వంటివే ఎక్కువ. అందుకే రాత్రివేళ పనిచేసే అసమతౌల్య ఆహారపు అలవాట్లు చోటుచేసుకోవడంతో పాటు... వారికి సాధారణంగా శారీరక శ్రమ చేయాల్సిన అవసరం కూడా బాగా తగ్గుతుంది. ఊబకాయంతో వచ్చే ఆరోగ్యపరమైన ముప్పులను తప్పించుకునేందుకు అనుసరించాల్సిన ఆహారపు అలవాట్లు...
►రాత్రుళ్లు పెద్ద పెద్ద పరిమాణాల్లో తక్కువ సార్లు కాకుండా... చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. దాంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. దాంతో పైన చెప్పిన గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలను నివారించవచ్చు.
►ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండాలి.
►ఆఫీసుల్లోని వెండింగ్ మెషిన్, కాఫెటేరియా వద్ద ఉన్న ఆహారపదార్థాలను సాధ్యమైనంత వరకు తీసుకోకండి. ఇంటిదగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారాన్నే తీసుకోండి.
►ఒకవేళ కాఫెటేరియా ఫుడ్‌నే తీసుకోవాల్సి వస్తే.. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే... సలాడ్స్, పళ్లు, మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు, గింజధాన్యాలు (ఉదాహరణకు... పొట్టుతోనే ఉన్న గోధుమలతో చేసిన రోటీలు, మొక్కజొన్నలతో చేసిన పదార్థాలు, బ్రౌన్‌బ్రెడ్ శాండ్‌విచ్‌లు) వంటివి తీసుకోండి. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్లు (ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, చిప్స్ వంటివి) అవాయిడ్ చేయండి.
►రాత్రివేళల్లో తీపి పదార్థాలు, రిఫైన్డ్ ఫుడ్స్ (క్యాండీలు, చాక్లెట్‌లు, వైట్ బ్రెడ్స్, బన్స్, పాస్తాస్, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్) వంటి వాటిని సాధ్యమైనంత వరకు తీసుకోకండి.
►రాత్రివేళల్లో పనిచేసేవారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. పగటితో పోలిస్తే రాత్రి ఒకింత చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్లు తాగడం తగ్గుతుంది. దాని వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి తరచూ నీళ్లు తాగటం మంచిది.
►రాత్రివేళల్లో పనిచేసేటప్పుడు కాఫీ, టీ లు తాగడం చాలా ఎక్కువవుతుంది. కానీ వాటిని వీలైనంతగా తగ్గించడం మంచిది.
►రాత్రివేళల్లో పనిచేసేవారు చాలావరకు తమ వ్యాయామాలను వదిలేస్తుంటారు. అయితే వర్క్‌షెడ్యూల్‌ను అనుసరించి రోజులో ఏదో ఒక నిర్ణీత సమయంలో ప్రతిరోజూ 45 – 60 నిమిషాల పాటు తప్పనిసరిగా ►వ్యాయామం చేయడం మంచిది. ఈ వ్యాయామం అన్నది మీరు పనికి వెళ్లే ముందర చేస్తే రాత్రంతా ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది. పైగా రాత్రి సమయంలో పని చేసేటప్పుడు తూగురావడం వంటివి జరగవు. ►ఇలా వ్యాయామం చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం తక్కువ. బరువు నియంత్రణలో ఉంటుంది.
►వ్యాయామం కారణంగా ఆడ్ టైమింగ్ అయిన రాత్రి పనివేళల్లో పనిచేయడం వల్ల కలిగే ఒత్తిడిని నివారించడం సాధ్యమవుతుంది. అధిక రక్తపోటు (హైబీపీ), డిస్‌లిపిడేమియా (రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు అసాధారణంగా పెరగడం) వంటి వాటిని కూడా నివారించవచ్చు.
డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment