సెలవులు తీసుకోండి బాబూ..!
- జపాన్‌లో కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం
టోక్యో: జపాన్.. ఎలక్ట్రానిక్స్ రంగంలో రారాజు.. సరికొత్త ఆవిష్కరణలకు, ఆధునిక సాంకేతికతకు చిరునామా..! అక్కడి కార్మికులూ అంతే.. పని రాక్షసులు.. పొద్దస్తమానం వారికి ఆఫీసే లోకం!! ఈ లోకంలో పడిపోయి సెలవులే మర్చిపోతున్నారు.. సెలవులేంటి..? పిల్లల్ని కనడమూ మర్చిపోతున్నారు. అందుకే ఆ దేశంలో యువత, పిల్లలు తక్కువ, వృద్ధులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఉద్యోగులు సెలవులు తీసుకోకపోవడంతో వారి ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నట్టు అధ్యయనాల్లో తేలింది.
భార్యాభర్తలకు ఏకాంతం చిక్కకపోవడంతో దాంపత్య జీవితం అంతంతేనని తేలింది.ఈ పరిస్థితి దే శాభివృద్ధిపై సైతం ప్రభావం చూపే స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. ప్రతి ఉద్యోగి తన సెలవులు పూర్తిగా వాడుకోవాల్సిందేనని చట్టం తేబోతున్నారు. వాళ్లు సెలవులను వాడుకునేలా చూసే బాధ్యత వారి బాస్‌దేనట! ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ చట్టం తేవడానికి కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగులందరికీ తగిన విశ్రాంతి ఉండేలా చూసేందుకు చట్టంలో 26 లక్ష్యాలను పొందుపరిచారు.