IMA study: ఆత్మరక్షణకు ఆయుధాలు | One-third of doctors feel unsafe during night shifts says IMA study | Sakshi
Sakshi News home page

IMA study: ఆత్మరక్షణకు ఆయుధాలు

Published Sat, Aug 31 2024 5:01 AM | Last Updated on Sat, Aug 31 2024 5:01 AM

One-third of doctors feel unsafe during night shifts says IMA study

రాత్రి షిఫ్టుల్లో అభద్రత 

మహిళా వైద్యుల్లో మరీ ఎక్కువ

జూనియర్‌ డాక్టర్లపై అధిక హింస

ఐఎంఏ అధ్యయనంలో కీలకాంశాలు

దేశంలో మూడింట ఒక వంతు వైద్యులు రాత్రి షిఫ్టుల్లో అభద్రతతో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. దాంతో కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తీసుకెళ్లడం తప్పదన్న భావనకు కూడా వచ్చారట. ఐఎంఏ అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశమంతటా ఆందోళనకు దారితీయడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో రాత్రి షిఫ్టుల్లో వైద్యుల భద్రతను అంచనా వేయడానికి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఆన్‌లైన్‌ సర్వే చేపట్టింది. 3,885 వైద్యుల వ్యక్తిగత ప్రతిస్పందనలతో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే అతి పెద్ద అధ్యయనమని ఐఎంఏ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు వారు. 61 శాతం ఇంటర్న్‌ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీలున్నారు. 

కేరళ స్టేట్‌ ఐఎంఏ రీసెర్చ్‌ సెల్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ జయదేవన్, ఆయన బృందం రూపొందించిన ఈ సర్వే ఫలితాలను ఐఎంఏ కేరళ మెడికల్‌ జర్నల్‌ అక్టోబర్‌ సంచికలో ప్రచురించనున్నారు. ఈ ఆన్‌లైన్‌ సర్వేను గూగుల్‌ ఫామ్‌ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులకు పంపారు. 24 గంటల్లో 3,885 స్పందనలు వచ్చాయని డాక్టర్‌ జయదేవన్‌ తెలిపారు. ‘‘వీరిలో చాలామంది దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్టుల్లో అరక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది, పరికరాలను మెరుగుపరచాల్సిన అవసరముంది’’ అని అధ్యయనం పేర్కొంది.

అధ్యయన నివేదిక...
కొన్ని ఎంబీబీఎస్‌ కోర్సుల్లో లింగ నిష్పత్తికి అనుగుణంగా మహిళలు 63 శాతం ఉన్నారు. తమకు భద్రత లేదని భావించే వారి నిష్పత్తి మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. 20–30 ఏళ్ల వయస్సున్న వైద్యులు అతి తక్కువ భద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఇంటర్న్‌లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు. నైట్‌ షిఫ్టుల్లో 45 శాతం మందికి డ్యూటీ రూమ్‌ కూడా అందుబాటులో లేదు. 

రద్దీ, ప్రైవసీ లేకపోవడం, డ్యూటీ గదులకు తాళాలు లేకపోవడమే గాక అవి సరిపోవడం లేదు. దాంతో వైద్యులు ప్రత్యామ్నాయ విశ్రాంతి ప్రాంతాలను వెదుక్కోవాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న డ్యూటీ గదుల్లో మూడింట ఒక వంతు అటాచ్డ్‌ బాత్రూములు లేవు. దాంతో ఆ అవసరాలకు వైద్యులు అర్ధరాత్రి వేళల్లో బయటికి వెళ్లాల్సి వస్తోంది. సగానికి పైగా (53 శాతం) ప్రాంతాల్లో డ్యూటీ రూము వార్డు/ క్యాజు వాలిటీకి దూరంగా ఉంది. ప్రధానంగా జూ నియర్‌ డాక్టర్లు ఇలాంటి హింసను అనుభ విస్తున్నారు. పాలన లేదా విధాన రూప కల్పనలో వీరికి ప్రమే యం ఉండటం లేదు.

వైద్యుల సూచనలు...
→ శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలి.
→ సీసీ కెమెరాలను ఏర్పాటు  చేయాలి.
→ సెంట్రల్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ (సీపీఏ) అమలు చేయాలి.
→ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
→ తాళాలతో కూడిన సురక్షిత డ్యూటీ గదుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.
→ సురక్షితమైన, పరిశుభ్రమైన డ్యూటీ రూములు ఏర్పాటు చేయాలి.
– ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో మెరుగుదల అవసరం.
→ ఆస్పత్రుల్లో తగినంత వైద్య సిబ్బందిని నియమించాలి.
→ వార్డులు ఇతర ప్రాంతాల్లో రద్దీ లేకుండా ఏర్పాట్లు చేయాలి.

అదనపు సూచనలు
మద్యం సేవించిన లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి క్యాజువాలిటీలో పని చేస్తున్న వైద్యులు మౌఖిక, శారీరక బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అత్యవసర గదుల్లో మహిళా వైద్యులకు అనవసరంగా తాకడం, అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పరిమిత సిబ్బంది, తక్కువ భద్రత ఉన్న చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోందని చాలా మంది వైద్యులు తెలిపారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement