రాత్రంతా హోటళ్లు, రెస్టారెంట్లు | No Objection for Night Hotels, restaurants | Sakshi
Sakshi News home page

రాత్రంతా హోటళ్లు, రెస్టారెంట్లు

Published Wed, Feb 18 2015 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

No Objection for Night Hotels, restaurants

అభ్యంతరం లేదన్న పోలీసు విభాగం
సాక్షి, ముంబై: నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, పాల కేంద్రాలు, కాఫీ సెంటర్లు, మందుల షాపులు తదిత అత్యవసర సేవలకు సంబంధించిన దుకాణాలు రాత్రి వేళల్లో తెరిచి ఉంచితే తమకు అభ్యంతరం లేదని ముంబై పోలీసు శాఖ స్పష్టం చేసింది. దీంతో సెకండ్, నైట్ షిప్టులో పనిచేసే ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వ్యాపారులకు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సాధారణ ప్రజలకు ఎంతో ఊరట లభించనుంది.

గడియారంలో ముల్లులాగా 24 గంటలు ఉరుకులు, పరుగులతో జీవనం సాగించే ముంబైకర్లకు రాత్రి 10 గంటలు దాటిన తరువాత మంచి హోటళ్లు, రెస్టారెంట్లు, కనీసం కాఫీ సెంటర్లు కూడా అందుబాటులో ఉండవు. నేటి ఆధునిక, పోటీ కాలంలో అనేక ప్రైవేట కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు రాత్రి వేళల్లో కూడా పనిచేస్తున్నాయి. నైట్ షిఫ్టుల్లో పని చేసే వారికి అర్థరాత్రి సమయంలో కనీసం అల్పాహారం, టీ, కాఫీ కూడా దొరకవు. దీంతో గత్యంతరం లేక చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై లభించే అపరిశుభ్రమైన, కల్తీ తినుబండరాలు తినక తప్పడం లేదు.

ముంబైకర్ల సౌకర్యార్థం రాత్రి వేళల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, పాల కేంద్రాలు తెరిచి ఉంచాలని గతంలో శివసేన కార్పొరేటర్లు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్థాయి సమితిలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మంజూరు లభించడంతో ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ప్రభుత్వం మారిన తరువాత ఈ ప్రదిపాదనను మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన బీజేపీ, శివసేన ప్రభుత్వం రాత్రి వేళల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఈ ప్రతిపాదనను ముంబై పోలీసు శాఖకు పంపించారు.

నారిమన్‌పాయింట్, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), షాపింగ్ మాల్స్ లాంటి నివాసేతర ప్రాంతాలలో హోటళ్లు, రెస్టారెంట్లు, కాఫీ సెంటర్లు, పాల డెయిరీలు ప్రారంభించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసు శాఖ ప్రభుత్వంతో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రులున్న ప్రాంతాల్లో మాత్రమే మెడికల్ షాపులు (అనుమతి పొందినవి) 24 గంటలు తెరిచి ఉంటున్నాయి. మిగతా ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తరువాత వాటిని మూసివేస్తున్నారు. అత్యవసరం సమయంలో మందులు కావాలంటే ఆస్పత్రులున్న ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇక నుంచి ఉరుకులు పరుగులు తీయనవసరం లేదు. త్వరలో ముంబై పోలీసు శాఖ నుంచి సర్క్యులర్ విడుదల కానుంది. ఆ తరువాత అత్యవసర సేవల షాపులన్నీ అందుబాటులోకి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement