ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న యోగి సర్కార్ తాజాగా మహిళలకు శుభవార్త చెప్పింది.
వివరాల ప్రకారం.. యూపీలో మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్ షిప్ట్‌లు వేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో పనిచేయవద్దని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులను కోరింది. ఈ క్రమంలోనే ఒకవేళ సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేసే మహిళా ఉద్యోగులకు ఆఫీసు యాజమాన్యం ఉచిత రవాణా సౌకర్యంతో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు కంపెనీలు, ఆఫీసులకు కూడా వర్తిస్తాయని తెలిపింది.
అంతేకాకుండా.. ఇక నుంచి మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీ చేయమని బలవంతం చేయడానికి వీలు లేదు.. అవసరమైన సేవలు మినహా అన్ని విభాగాలతో పాటు ప్రైవేట్ సంస్థలలో ఈ నిబంధనలు వర్తిస్తాయని సమాచార ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ తెలిపారు. అలాగే, ఆఫీసుల్లో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, త్రాగునీటి సౌకర్యాలతో పాటు పని చేసే ప్రదేశంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా, మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా.. వారు తమ కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: పోలీస్‌స్టేషన్ల సీసీటీవీల్లో ఆడియో ఫుటేజీ తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment