ఈ నగరానికి ఏమైంది.. రాత్రుళ్లు నిద్రపోరేంటి.. ఓ వైపు నైట్ షిఫ్ట్స్, మరోవైపు టైం పాస్.. ఈ అలవాట్లకి చరమగీతం పాడకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యు నిపుణులు.. నగర ప్రజలను ప్రస్తుతం ప్రధానంగా వేధిస్తున్న సమస్య నిద్రలేమి తనం. ఇందుకు ఆలస్యంగా నిద్రపోవడమే ముఖ్యమైన కారణం. సగటున నగరవాసుల ఆన్‌స్క్రీన్ సమయం రాత్రుళ్లే ఎక్కువగా ఉంటుందని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇందులో నైట్ షిఫ్ట్స్ ఓ భాగమైతే.. రాత్రుళ్లు రోడ్లపై షికార్లు, రకరకాల గ్యాడ్జెట్లు వినియోగిస్తూ అర్ధరాత్రి వరకూ టైంపాస్ చేయడం మరో కారణం. దీంతో నగరజీవి ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నాడని నిపుణులు చెబుతున్న మాట.
రాత్రంతా ఉద్యోగాలు, అర్థరాత్రి దాటేంత వరకూ పర్యాటక ప్రాంతాల్లో రకాల ఈవెంట్స్, ఇంటికి చేరుకున్నా అర్థరాత్రి దాటేంత వరకూ మొబైల్ ఫోన్‌లో చాటింగ్, టైంపాస్ వెరసి నగర జీవికి నిద్రను దూరం చేస్తున్నాయి. రానురానూ ఉదయం ఆలస్యంగా లేవడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం నగర ప్రజల జీవన శైలిగా మారిపోతోంది. ఉద్యోగం, పాఠశాల విద్యార్థులు, గృహిణులు, యువత ఇలా ఏ ఏజ్ గ్రూపువారిదైనా దాదాపు ఇదే దినచర్యగా మారుతోంది. ఇబ్బడి ముబ్బడిగా పెరిపోయిన గ్యాడ్జెట్స్ వినియోగం సగటు నగరవాసిని నిద్రకు దూరంచేస్తున్నాయి.
రాత్రిళ్లే.. సరైన సమయమట!..
కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లేందుకు నగర ప్రజలకు రాత్రి వేళల్లోనే సమయం దొరుకుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. రోజు వారీ విధులు ముగించుకుని ఇంటికి చేరాక కాసేపు కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు. దీంతో అర్థరాత్రి వరకూ నగరంలోని ప్రముఖ ప్రాంతాలైన ట్యాంక్‌బండ్, ఎన్‌టీఆర్ మార్గ్‌కి వెళ్లి సేదతీరుతున్నారు. మరికొందరైతే హోటల్స్, మ్యూజిక్, డ్యాన్స్, ఇతర ఈవెంట్స్‌తో అర్థరాత్రి వరకూ ఎన్‌జాయ్ చేస్తున్నారు. సినిమా షోలు సైతం రాత్రి 11.30 గంటలకు మొదలయ్యే థియేటర్లు ఉన్నాయి. నగరంలో పబ్ కల్చర్ కూడా భారీగా పెరిగింది. మాదాపూర్, జూబ్లిహిల్స్, రా>యదుర్గం, హైటెక్ సిటీ, కేపీహెచ్‌బీ, మెహిదీపట్నం తదితర ప్రదేశాల రహదారులు అర్థరాత్రి జన సంచారంతో కిటకిటలాడుతున్నాయి. పగలు ట్రాఫిక్ ఇబ్బందులకు భయపడి రాత్రిళ్లు బయటకు వెళ్లి, చల్లని వాతావరణంలో పర్యాకట ప్రాంతాలను చుట్టివస్తున్నారు.
పెరిగిన ఆన్ స్క్రీన్ టైం..
మహానగరంలో విద్యార్థి దశ నుంచే టీవీ, మొబైల్ ఫోన్‌లకు ఎక్కువ సమయం అతుక్కపోతున్నారు. ఆపై యువత, ఉద్యోగులు విధి నిర్వహణలో కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల ముందే సగం కాలం గడిపేస్తున్నారు. దీంతో రోజులో మొబైల్ వాడకం 4 గంటలుగా నమోదవుతోంది. దీనికి తోడు టైంపాస్ కోసం పిచ్చి పిచ్చి యాప్స్‌లో రీల్స్, వీడియోలు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. దీంతో నిద్రపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
కళ్లపై తీవ్ర ప్రభావం..
నిద్ర లేమి వల్ల శరీరం, కళ్లు, మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. కళ్లు పొడిబారిపోవడం, చూపు మందగించడం, కళ్లు ఎర్రగా మారడం, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, మానసిక రోగాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఎక్కువ సమయం స్క్రీన్ చూడాల్సి వస్తే వైద్యుల సూచన మేరకు కళ్లజోడు వినియోగించడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల చూపు మందగిస్తుంది. మెల్లకన్ను వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారని చెబుతున్నారు.
ప్రశాంతమైన నిద్ర అవసరం
ప్రస్తుత కాలంలో గ్యాడ్జెట్స్ లేకుండా జీవితం లేదు. అయితే అతిగా వినియోగించడం వల్ల కన్ను, మెదడుపై ఒత్తిడి పెరుగుతోంది. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. మనకు మానసిక, శారీరక ప్రశాంతతకు సరైన నిద్ర అవసరం. అందుకే మొబైల్ చూసే సమయంలో కనీసం 25 సెంటీమీటర్ల దూరంలో చూడాలి. రాత్రి వేళల్లో వెళుతురు లేకుండా మొబైల్ చూడొద్దు. కంప్యూటర్‌పై పనిచేసే ఉద్యోగులు ప్రతి గంటకు పది నిమిషాలు కంటికి రెస్ట్ ఇవ్వాలి. కను రెప్పలు ఎక్కువ మూసి, తెరుస్తుండాలి. సరైన నిద్ర ఉన్నప్పుడే శరీరం, మొదడు రీఫ్రెష్ అవుతుంది. మెలుకువ వచ్చిన తరువాత ఫ్రెష్‌గా వర్క్ ప్రారంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
– జీవీ రమణకుమార్, నేత్ర వైద్యుడు
Comments
Please login to add a commentAdd a comment