రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు | IOC, HPCL buys 2 million bbl Russian crude Oil | Sakshi
Sakshi News home page

రష్యా చమురు రేసులో దేశీ సంస్థలు

Published Fri, Mar 18 2022 3:06 AM | Last Updated on Fri, Mar 18 2022 9:58 AM

IOC, HPCL buys 2 million bbl Russian crude Oil - Sakshi

న్యూఢిల్లీ: భారీ డిస్కౌంటుతో లభిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు మిలియన్‌ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) బాటలోనే తాజాగా హిందూస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) రెండు మిలియన్‌ బ్యారెళ్లు తీసుకుంది. యూరప్‌కు చెందిన ట్రేడరు విటోల్‌ ద్వారా రష్యన్‌ ఉరల్స్‌ క్రూడాయిల్‌ను హెచ్‌పీసీఎల్‌ కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ (ఎంఆర్‌పీఎల్‌) కూడా అదే తరహాలో ఒక మిలియన్‌ బ్యారెళ్ల క్రూడాయిల్‌ కోసం టెండర్లు ఆహ్వానించింది.

ఉక్రెయిన్‌ మీద దాడుల కారణం గా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంటుకు లభిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, చమురును చౌకగా దక్కించుకునేందుకు భారత రిఫైనింగ్‌ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మే నెలలో డెలివరీ కోసం బ్యారెల్‌కు 20–25 డాలర్ల డిస్కౌంటుతో ఐవోసీ గత వారమే మూడు మిలియన్‌ బ్యారెళ్లను విటోల్‌ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది. అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున, రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రం రష్యన్‌ క్రూడాయిల్‌కు దూరం గా ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  

డాలర్లలో సెటిల్మెంట్‌..
అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాపరంగా ఇంకా ఆంక్షలేమీ విధించనందున.. రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మారకంలోనే సెటిల్మెంట్‌ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్‌పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏదీ ప్రస్తుతం లేదు. ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చే సేందుకు, అంతర్జాతీయ పేమెంట్‌ సిస్టమ్స్‌ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది.  

2020 నుంచే ఒప్పందాలు..
దేశీయంగా క్రూడాయిల్‌ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో.. భారత్‌ తన అవసరాలకు సంబంధించి 85% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలదే. అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి కూడా భారత్‌ సరఫరా పెంచుకుంటోంది. సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతులపరంగా రష్యా రెండో స్థానంలో ఉంది. యూరప్‌లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. కానీ, రష్యా నుండి భారత్‌ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో కేవలం 45,000 బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం. వాస్తవానికి.. దాదాపు 2 మిలియన్‌ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌ ఆయిల్‌ కంపెనీతో 2020 ఫిబ్రవరిలోనే ఐవోసీ ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్‌లో చమురుకు డిమాండ్‌ 8% అప్‌
ఈ ఏడాది 5.15 మిలియన్‌ బీపీడీకి చేరొచ్చని ఒపెక్‌ అంచనా
న్యూఢిల్లీ: మహమ్మారి ప్రభావాల నుండి ఎకానమీ నెమ్మదిగా పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ఏడాది చమురుకు డిమాండ్‌ 8.2 శాతం మేర పెరగనుంది. రోజుకు 5.15 మిలియన్‌ బ్యారెళ్లకు (బీపీడీ) చేరనుంది. ఆయిల్‌ మార్కెట్‌ నివేదికలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి ఒపెక్‌ ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌లో 2020లో చమురు డిమాండ్‌ రోజుకు 4.51 మిలియన్‌ బ్యారెళ్లుగా (బీపీడీ) ఉండగా.. 2021లో 5.61 శాతం పెరిగి 4.76 మిలియన్‌ బీపీడీకి చేరింది. కరోనా పూర్వం 2018లో ఆయిల్‌ డిమాండ్‌ 4.98 మిలియన్‌ బీపీడీగా, 2019లో 4.99 మిలియన్‌ బీపీడీగా నమోదైంది. ‘2022లో ఆర్థిక వృద్ధి పటిష్టంగా 7.2 శాతం స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు తోడు సమీప భవిష్యత్తులో ఒమిక్రాన్‌ను వేగంగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నందున ఆయిల్‌కు డిమాండ్‌ మెరుగుపడవచ్చని భావిస్తున్నాం‘ అని ఒపెక్‌ నివేదిక పేర్కొంది.  

డీజిల్, నాఫ్తాకు పరిశ్రమల తోడ్పాటు..
కోవిడ్‌–19 కట్టడిపరమైన ఆంక్షలను సడలించడంతో దేశీయంగా ప్రయాణాలు, రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. పారిశ్రామిక రంగం మెరుగుపడుతుండటంతో డీజిల్, ఎల్‌పీజీ, నాఫ్తాకు డిమాండ్‌ పెరగగలదని నివేదిక వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement