సీఎం రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారన్న దానకిశోర్
ఇంధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు
మిషన్ లైఫ్ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ వేదికపై అత్యుత్తమ నగరంగా నిలపాలని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు.
ఇంధన సామర్థ్య సాధన ద్వారా ప్రపంచంలోనే పెట్టుబడులకు సురక్షిత నగరంగా హైదరాబాద్ త్వరలో రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా మూసీ నది పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యలు ఇందులో భాగమని స్పష్టం చేశారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో కలిసి హైదరాబాద్‌లో మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్) పోస్టర్‌ను గురువారం ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, నగర సామాజిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థల్ని మెరుగుపరచడం కూడా ప్రభుత్వ లక్ష్యమని దానకిశోర్ చెప్పారు. ఇవన్నీ పూర్తయితే లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఈసీబీసీతో విస్తృత ప్రయోజనాలు
తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్ రెడ్కో), బీఈఈ సంయుక్త భాగస్వామ్యంతో ఇంధన శక్తి సామర్థ్య నిర్వహణ, పర్యావరణ లక్ష్యాల్ని అందుకునేందుకు దానకిశోర్ నేతృత్వంలో చర్చించి, పలు నిర్ణయాల అమలుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. నగరంలో ఇకపై ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)కు అనుగుణంగానే కొత్త ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నారు.
బీఈఈ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈసీబీసీ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు ఆర్థిక, తదిత విస్తృత ప్రయోజనాలను అందిస్తుందని భావిస్తున్నారు. బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవ్‌రా, బీఈఈ డైరెక్టర్లు సౌరభ్ దీదీ, ఎస్‌కే వర్ణా, బీఈఈ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment