సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. వార్షిక ఇంధన వినియోగం 2017–18లో 50,077 మిలియన్ యూనిట్లతో పోలిస్తే 2022–23లో 65,830 మిలియన్ యూనిట్లకు చేరుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
భవిష్యత్ ప్రణాళికలపై విద్యుత్ సంస్థలతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే.. విద్యుత్ వినియోగం దాదాపు 31.45 శాతానికి పెరిగిందని, ఇటీవల రోజుకు 251 మిలియన్ యూనిట్లు ఆల్ టైమ్ హై ఎనర్జీ డిమాండ్ రాగా విద్యుత్ సంస్థలు విజయవంతంగా తీర్చాయని చెప్పారు.
ఒప్పందాలతో ఉజ్వల భవిష్యత్
ఈ ఏడాది మార్చి నెలలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగం పెట్టుబడులతో దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని విజయానంద్ వెల్లడించారు. ఈ 42 అవగాహన ఒప్పందాలను అమలు చేయాల్సిన అవసరం విద్యుత్ సంస్థలపై ఉందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని ప్రభుత్వం మార్చిందన్నారు.
విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి ప్రభుత్వం ఇప్పటికే పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రకటించిందని తెలిపారు. పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్‌లు (పీఎస్‌పీ) పూర్తయితే విద్యుత్ రంగంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్‌గా మారి మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుందన్నారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్‌ను అందించాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించాలని పదే పదే చెబుతున్నారన్నారు. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 25 ఏళ్ల పాటు కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు.
రాష్ట్ర గ్రిడ్ కు 105 మిలియన్ యూనిట్లు
జెన్‌కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర గ్రిడ్‌కు రోజుకు 102 నుంచి 105 మిలియన్ యూనిట్లను జెన్‌కో సరఫరా చేస్తోందని, ఇది మొత్తం ఇంధన డిమాండ్‌లో 40 నుండి 45 శాతం ఉందని తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ఇదే అత్యధికమని, బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి కూడా జెన్‌కో అన్ని ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. సమావేశంలో ట్రాన్స్‌కో జేఎండీ బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు, ఏపీ ఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్లు ఏవీకే భాస్కర్, టి.వీరభద్రారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment