అమ్మేసిన వస్తువుకు మళ్లీ డబ్బులడుగుతామా?
అర్థంలేని చార్జీలతో కుదేలవుతున్న పరిశ్రమలు
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు
డిస్కంల రెవెన్యూ లోటు భర్తీపై ఏపీఈఆర్‌సీ, ఇంధన శాఖ చెరో మాట
సాక్షి, అమరావతి/కర్నూలు (సెంట్రల్): ‘ఒక పరిశ్రమలో ఉత్పత్తి అయిన వస్తువుకు ఒక ధర నిర్ణయించి విక్రయిస్తారు. దాని తయారీకి అయిన విద్యుత్ ఖర్చు సహా అన్ని ఖర్చులూ అందులో ఉంటాయి. వినియోగదారుడు ఆ రేటు చెల్లించి వస్తువు కొంటాడు. కొన్ని నెలల తర్వాత ఆ వస్తువు తయారు చేస్తున్న రోజుల్లో వాడిన విద్యుత్తుకు అదనపు చార్జీ చెల్లించాలంటున్నారు. అదెలా సాధ్యం? ప్రభుత్వం అడిగినట్లు మేం కూడా వస్తువు కొన్న వాళ్ల దగ్గరకు వెళ్లి అప్పుడు మీరు కొన్న టీవీకి అదనపు డబ్బులు ఇమ్మని అడిగితే ఇస్తారా? అర్ధం లేని చార్జీలతో పరిశ్రమలు కుదేలవుతున్నాయి.
సర్దుబాటు చార్జీలను వెంటనే రద్దు చేయాలి’ అని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కర్నూలులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో పారిశ్రామికవేత్తలు కరాఖండిగా చెప్పారు. ప్రజలు కూడా విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంధన సర్దుబాటు చార్జీలకు అంతమనేదే లేదా? అంటూ అనంతపురానికి చెందిన చంద్రశేఖర్ సహా పలువురు నిలదీశారు. పెంచిన చార్జీలు ప్రజలు కాదు.. ప్రభుత్వమే భరించాలని అందరూ స్పష్టం చేశారు.
మూడు రోజుల్లో 94 అభ్యంతరాలు
ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రూ.15,485 కోట్లకు సమర్పించిన 2025–26 ఆరి్థక సంవత్సరం ఆదాయ అవసరాల నివేదికలపై ఏపీఈఆర్సీ ఏపీఈఆర్‌సీ ఇన్‌చార్జి చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్, సభ్యుడు పీవీఆర్ రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడలో, శుక్రవారం కర్నూలులోని ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో బహిరంగ విచారణ జరిపారు.
మధ్యాహ్నం వరకూ అభ్యంతరాలను వినిపించడానికి ఎంచుకున్నవారికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని డిస్కం సర్కిల్, డివిజన్ కార్యాలయాల నుంచి మాట్లాడేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పించారు. ఈ మూడు రోజుల్లో వివిధ వర్గాలకు చెందిన 94 మంది వారి అభ్యంతరాలను మండలి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల అభ్యంతరాలపై డిస్కంల సీఎండీలు వివరణ ఇచ్చారు.
ఏపీఈఆర్సీ, ఇంధనశాఖ విరుద్ధ ప్రకటనలు
టారిఫ్ పెంపుదలపై డిస్కంలు ఎలాంటి ప్రతిపాదన చేయలేదని, అయితే వారు చూపించిన రెవెన్యూలోటు రూ. 14,683 కోట్లను ప్రభుత్వం భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్ తెలిపారు. అయితే ఇంధనశాఖ మాత్రం రెవెన్యూ లోటు తాము భరిస్తామని చెప్పలేదని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ రాయితీలకు కట్టుబడి ఉన్నామని, తద్వారా డిస్కంల రెవెన్యూ లోటు తగ్గించేందుకు మాత్రమే సాయపడతామని చెప్పినట్లు ఇంధన శాఖ డిప్యూటీ కార్యదర్శి బీఏవీపీ కుమారరెడ్డి వెల్లడించారు. ప్రజల అభ్యంతరాలు, డిస్కంల వివరణను పరిశీలించి ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ ఆర్డర్‌ను ఖరారు చేస్తామని చైర్మన్ చెప్పారు.
»పారిశ్రామిక విద్యుత్ (హెచ్‌టీ) వినియోగదారులు ఏటా ఆర్థిక సంవత్సరం చివర్లో ఆడిట్ నివేదికలు సమర్పిస్తాయి. ఏడాది ముగిసిన తరువాత పాత వినియోగంపై అదనంగా బిల్లులు వేస్తే చెల్లించడం ఎలా సాధ్యం? – అమర్‌రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ప్రతినిధి కుమార్ రాజా
» ట్రూ అప్ చార్జీలు న్యాయ సూత్రాలకు విరుద్ధం. అదనపు చార్జీలు వేయడంపై ఉన్న శ్రద్ధ నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో కనిపించడంలేదు. విద్యుత్ లైన్లు తెగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పాతపడ్డ లైన్లను మార్చడంలేదు. – కడప జిల్లా కమలాపురానికి చెందిన అశోక్‌కుమార్‌రెడ్డి
» ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులోనే ఉండాలి. పీక్ లోడ్ అవర్స్ కింద రూపాయి అదనంగా వసూలు చేస్తున్నారు. అది కాకుండా అదనంగా 4 రకాల చార్జీలు వేస్తున్నారు. ఏది ఎందుకో తెలియడంలేదు. – కర్నూలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి రామచంద్రారెడ్డి
వామపక్షాల ఆందోళన
మరోవైపు కర్నూలులోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో విద్యుత్ టారిఫ్‌లపై బహిరంగ విచారణ సమయంలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. సీఎం చంద్రబాబు విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పి ఒకేసారి రూ.15 వేల కోట్ల భారం మోపుతున్నారని వామపక్షాలు మండిపడ్డాయి.
ప్రజలపై అదనపు విద్యుత్ భారాలు వేయొద్దని, ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను పెట్టవద్దని డిమాండ్ చేశాయి. సీపీఎం నాయకుడు, ఎండీ ఆనందబాబు, సీపీఐ నాయకుడు పి.రామకృష్ణారెడ్డి, సీపీఐ (ఎంఎల్) నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment