సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా పరిపాలన అందిస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఈనాడు మరో తప్పుడు కథనాన్ని అచ్చేసింది. ఇంధన సర్దుబాటు చార్జీ అంటే వినియోగదారులకు సంబంధం లేని ఖర్చు అన్నట్లు.., అయినా రూ.7,200 కోట్ల ట్రూ అప్ చార్జీలను వసూలు చేసేందుకు డిస్కంలు సిద్ధమైపోయినట్లు కుట్రకు తెరలేపింది.
యూనిట్‌కు మరో రూ.1.10 పైసలు ట్రూ అప్ చార్జీ అదనంగా పెరగనుందంటూ గురువారం ఓ ఊహాజనిత కథనాన్ని అడ్డగోలుగా అచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఇంకా ఆమోదమే తెలపని నివేదికల ఆధారంగా వినియోగదారులను భయపెట్టేందుకు ప్రయత్నించింది. ఇలాంటి అబద్దాలను ప్రజలు నమ్మరని మర్చిపోయింది. రామోజీ రాతల్లో రాయని వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
► కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా 2021–22 నుంచి విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు త్వరితగతిన జరగడానికి అప్పటివరకు అమలులో ఉన్న వార్షిక ట్రూ అప్ చార్జీల స్థానంలో త్రైమాసిక సర్దుబాటు చార్జీలు అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారమే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా నిబంధనలను రూపొందించింది.
► ట్రూ అప్ చార్జీలు, సర్‌చార్జీలు పరిమిత కాలానికి విధిస్తారు. శాశ్వతంగా రెగ్యులర్ చార్జీల మాదిరిగా బిల్లులో కలపరు. విద్యుత్ కొనుగోలు కాకుండా డిస్కంల నిర్వహణకు జరిగిన వాస్తవ వ్యయానికి, అనుమతించిన వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని ట్రూ అప్ చార్జీల రూపంలో ఏపీఈఆర్‌సీ నిర్ణయించిన ప్రకారమే విధిస్తున్నారు.
► 2021–22 సంవత్సరానికి ప్రతి త్రైమాసికానికి డిస్కంలు రూ.3,336.7 కోట్లకు నివేదిక సమర్పిస్తే కమిషన్ వాటిపై సమగ్ర బహిరంగ విచారణ, సమీక్ష జరిపి రూ.3,080 కోట్లకు అనుమతినిచ్చింది. ఈ చార్జీలు 2022 ఏప్రిల్ నుంచి ఏడాది పాటు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. 2014–15 నుంచి 2018–19 వరకు దాదాపు రూ.7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కంలు నివేదికలు పంపించాయి.
అందులో నెట్‌వర్క్ ట్రూ అప్ చార్జీలు దాదాపు రూ.3,976 కోట్లుగా ఏపీఈఆర్‌సీ నిర్ధారించింది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ భాగం రూ.2,135 కోట్లు, సీపీడీసీఎల్ భాగం రూ.1,232 కోట్లు, ఈపీడీసీఎల్ భాగం రూ.609 కోట్లు. కాగా ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగం నిమిత్తం ఈ ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది.
► ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం జూన్ నుంచి నెల వారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును డిస్కంలు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ఒక నెల సర్దుబాటు చార్జీ ఆ తరువాత రెండో నెలలో అమలులోకి వస్తుంది. ఆ విధంగా ఈ ఏడాది ఆగస్టు నెల ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీ అక్టోబర్ బిల్లులో అంటే ప్రస్తుత నెల బిల్లులో వసూలు చేస్తున్నారు.
► నెలవారీ అదనపు కొనుగోలు వ్యయం, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరలు తారస్థాయికి చేరడం, థర్మల్ కేంద్రాలలో 20 నుంచి 30 శాతం వరకూ విదేశీ బొగ్గు వాడటం, తగినంత జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వలన యూనిట్ దాదాపు రూ.1 వరకు పెరిగింది. అయినా కమిషన్ ఆదేశాల మేరకు డిస్కంలు 40 పైసలే వసూలు చేస్తున్నాయి.
► 2022–23 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్ కింద డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనల్లో ఎంత వసూలుకు అనుమతించాలనేది బహిరంగ విచారణ అనంతరం ఏపీఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. మండలి నిర్ణయించిన ప్రకారమే డిస్కంలు వసూలు చేస్తాయి.
డిస్కంలను నష్టాల్లోకి నెట్టిన టీడీపీ ప్రభుత్వం
విద్యుత్ పంపిణీ సంస్థలు ఒక ఆర్థిక సంవత్సరం ఆదాయ, అవసరాల నివేదికలను అంతకు ముందు సంవత్సరం సెప్టెంబర్ నెల నాటికి ఉన్న పరిస్థితుల ఆధారంగా తయారుచేస్తాయి. అప్పుడు వంద శాతం ఖచ్చితత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయం అంచనా వేయడం సాధ్య పడదు. ఆర్థిక సంవత్సరం జరుగుతున్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఖర్చులో హెచ్చు తగ్గులు ఉంటాయి.
అవి సర్దుబాటు చార్జీల ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు డిస్కంలకు ఉంటుంది. కానీ 2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల సుడిగుండంలోకి నెట్టేసింది. 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను కూడా ఏపీఈఆర్‌సీకి సమర్పించలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలేదు.
సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా, అదనంగా నిధులు విడుదల చేస్తూ డిస్కంలను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ వల్ల విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండి, మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దానివల్ల ఆదా అయిన దాదాపు రూ.4,800 కోట్లను 2022–23 టారిఫ్‌లో డిస్కంలు తగ్గించాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై చార్జీల భారం పడలేదు. ఇలా ఖర్చులు తగ్గినప్పుడు వినియోగదారులకు ప్రభుత్వం చొరవతో విద్యుత్ సంస్థలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment