సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోని వాతావరణంలో కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గించడంతోపాటు ప్రపంచానికి సరిపడిదానికన్నా ఎక్కువ విద్యుత్‌ను పవన విద్యుత్ ద్వారా అందించవచ్చని ఓ అంతర్జాతీయ ఇంధన సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. పవన విద్యుత్‌ను ప్రోత్సహించడం ద్వారా ఏటా ఐదువందల నుంచి ఏడు వందల కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపి వేసినప్పటికీ ఒక్క పవన విద్యుత్ ద్వారా ప్రపంచ విద్యుత్ అవసరాలను తీర్చవచ్చని ‘అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ)’ పరిశోధకలు అభిప్రాయపడ్డారు.
శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వల్ల ఈ శతాబ్దాంతానికి పెరుగుతున్న భూవాతావరం ఉష్ణోగ్రతను రెండు శాతం దిగువకు తీసుకరావాలన్న ప్రపంచ లక్ష్యాన్ని కూడా ఈ పవన విద్యుత్ వల్ల సాధించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. పవన్ విద్యుత్‌లో స్థాపించే ఖర్చును తగ్గించుకొని విండ్ టర్బైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఎంతో ఉందని వారు చెబుతున్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిలో కేవలం 0.3 శాతాన్ని మాత్రమే సముద్రంలో ఏర్పాటు చేసిన పవన విద్యుత్ స్తంభాల వల్ల ఉత్పత్తి చేస్తున్నామని, దీన్ని మరెంతో పెంచుకునే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రానున్న రెండు శతాబ్దాల్లో దీన్ని 15 రెట్లు పెంచుకున్నట్లయితే ఆ పవన విద్యుత్ పరిశ్రమ వ్యాపారాన్ని లక్ష కోట్ల డాలర్లకు తీసుకెళ్లవచ్చని వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment