సాక్షి, అమరావతి : పవన విద్యుత్ కొనుగోళ్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు ఒప్పందాలు చేసుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వద్దని ఆ రంగ నిపుణులు మార్చి 1, 2017న అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా నివేదించినా పవన విద్యుత్ పీపీఏలకు చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపేసింది.
అది కూడా రెట్టింపు కంటే అధిక ధరకు కొనుగోలు చేసేందుకు. గుజరాత్‌లో తక్కువకే పవన విద్యుత్ దొరుకుతున్నా ఇలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పీపీఏలు ఎందుకు కుదుర్చుకున్నారు? పోనీ రాష్ట్రంలో ఏమన్నా విద్యుత్ కొరత ఉందా అంటే అప్పటికి ఆ పరిస్థితి కూడా లేదు. కేవలం ముడుపుల కోసమే పవన విద్యుత్ పీపీఏలు కుదుర్చుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏ మాత్రం పెరగలేదు. పైగా కొరతనేదే లేదు.
అయినా అధిక ధర చెల్లించి ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంకావటవల్ల విద్యుత్ సంస్థలపై పెద్దఎత్తున ఆర్థిక భారం పడింది. ఇలాంటి నష్టదాయకమైన పీపీఏల ఫలితంగా థర్మల్ విద్యుత్ యూనిట్ల ఉత్పత్తి వ్యయంతోపాటు అప్పులు కూడా పెరిగాయి. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి.
తక్కువకే దొరుకుతున్నా..
టీడీపీ హయాంలో పవన విద్యుత్ ఏడాదికి 6 వేల మిలియన్ యూనిట్లకు పైగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. పోటీ పెరగడంతో అన్ని రాష్ట్రాల్లో ఈ పవన విద్యుత్ ధరలు తగ్గుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాలు నష్టదాయకమైన పీపీఏలకు దూరంగా ఉంటున్నాయి. చౌకగా లభించే చోటే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి.
గుజరాత్‌లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇఫ్ ఇండియా (సెకీ) ఓపెన్ బిడ్డింగ్‌కి పిలవగా పవన విద్యుత్ యూనిట్ రూ.2.48 చొప్పున 500 మెగావాట్లను సరఫరా చేస్తామని ఉత్పత్తిదారులు ముందుకొచ్చారు. స్ప్రింగ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, కేసీ ఎనర్జీ లిమిటెడ్ రూ.1.43కి సరఫరా చేస్తామన్నాయి. అంటే ఆ రేటుకు కొనుగోలు చేసేందుకు మనకూ అవకాశముంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు పీపీఏలలో సిద్ధపడింది. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.3.41 చొప్పున అదనంగా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ తయారైపోయింది.
ప్రైవేటుకు దోచిపెట్టింది రూ.11,375 కోట్లు..
పవన విద్యుత్ పీపీఏలను 25 ఏళ్లకు కుదుర్చుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను నాటి టీడీపీ ప్రభుత్వం ఆదేశించింది. 11 పీపీఏల ద్వారా మొత్తం 840 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఒక్కో మెగావాట్‌కు 2.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుంది. 810 మెగావాట్లకు 1,232 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు డిస్కంలకు ప్రైవేట్ సంస్థలు అంటగట్టాయి.
ఇలా ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ.3.41 చెల్లించటం ద్వారా 1,372 మిలియన్ యూనిట్లకు ఏటా రూ.455 కోట్లు అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సి వస్తోంది. 25 ఏళ్లకు చెల్లించే అదనపు వ్యయం రూ.11,375 కోట్లు. ఎలాంటి బిడ్డింగు లేకుండా ప్రైవేటు విద్యుత్ సంస్థలకు ఇంత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడానికి కారణం భారీగా ముడుపులు చేతులు మారడమే.
పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తొలుత అభ్యంతరాలు వ్యక్తంచేసిన రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ ఆ తర్వాత ఆమోదం తెలపడం వెనక కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది. విద్యుత్ ఉత్పత్తిదారులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన తర్వాత ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలుకు ఆమోదం లభించిడం ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది.
అసలు అదనపు విద్యుత్ అవసరమేలేదు..
రాష్ట్రంలో 2017–18లో 57 వేల మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అందనా వేస్తే వాస్తవ వినియోగం 52 వేల మిలియన్ యూనిట్లు దాటలేదు. 2018–19 కూడా డిస్కంలు ఇదే స్థాయిలో 61 వేల మిలియన్ యూనిట్లు అవసరం ఉంటుందని అంచనా చేశాయి. అయినప్పటికీ ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు ఏపీ జెన్‌కో థర్మల్, హైడల్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి.
రాష్ట్రంలో రోజుకు సగటున 156 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే థర్మల్ ద్వారా 98 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. కేంద్రం నుంచి చౌకగా మరో 18 మిలియన్ యూనిట్లు అందుతున్నాయి. జల విద్యుత్ ద్వారా 17 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశముంది.
వీటి ద్వారా యూనిట్ విద్యుత్ సగటున రూ.3.50లోపే లభిస్తుంది. డిమాండ్ కంటే ఇంకా ఐదు మిలియన్ యూనిట్లు మిగులు ఉండే అవకాశముంది. అలాంటప్పుడు డిమాండ్ లేకుండా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరంలేదు.
ఇదీ రాష్ట్రంలో పవన విద్యుత్ పరిస్థితి..
ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది.
అంటే.. జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయెరాలజీ (పూణే)కి చెందిన పరిశోధకులు వెల్లడించారు.
అంతేకాదు.. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్టు (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. ఇలాంటి అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని, రానున్నాయని ముందే నిపుణులు చెప్పినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వినకుండా పాతికేళ్లకు పీపీఏలు కుదుర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment