
భారత్ తన లక్ష్యాలను చేరుకోవడానికి 2030 నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలో దాదాపు రూ.32 లక్షల కోట్లు అవసరమవుతాయని ఐఆర్‌ఈడీఏ ఛైర్మన్ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. 23వ ఇండియా పవర్ ఫోరమ్ 2024లో పాల్గొని ఆయన మాట్లాడారు. రుణదాతలు కస్టమర్ల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సకాలంలో ఆర్థిక అవసరాలు తీర్చేలా ప్రణాళికలు ఉండాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పునరుత్పాదక ఇంధన రంగంలో ఎలాంటి హానికర ఉద్గారాలు లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అందుకోసం 2030 నాటికి ఈ రంగంలో సుమారు రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంది. ఇందుకోసం రుణదాతలు కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టాలి. భవిష్యత్తులో దేశీయ విద్యుత్ అవసరాలు తీర్చే ఈ రంగంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరాలంటే ఈ విభాగం కీలకంగా మారనుంది. ఈ రంగంలో మరిన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేలా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, ఆఫ్‌షోర్ విండ్(సముద్ర అలల సాయంతో విద్యుత్ ఉత్పత్తి), ఇ-మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక సాంకేతికతలకు రానున్న రోజుల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది’ అన్నారు.
ఇదీ చదవండి: 99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment