
సాక్షి, న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరులే కాకుండా అదనంగా బయోమాస్, హరిత విద్యుత్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కేసింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ బుధవారం లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా కమిటీలు ఏర్పాటు చేశాయని లేఖలో ఆయన గుర్తు చేశారు. 2005తో పోలిస్తే 2030 నాటికి 45 శాతం ఉద్గార తీవ్రత తగ్గింపు విజయవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకమని కేంద్ర మంత్రి తెలిపారు.
స్టీరింగ్ కమిటీల్లో విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం, రవాణా, పరిశ్రమలు, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ప్రజా పనుల శాఖలు, వాటి ప్రధాన కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారని మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.