సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం సౌరకాంతులు వెదజల్లుతోంది. నగరంలోని పలు గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ..ప్రైవేటు సంస్థల కార్యాలయాలు, ఇళ్లపై సౌర ఫలకాలు (సోలార్ ప్యానెళ్లు) ఏర్పాటవుతున్నాయి. ఇవి సొంతింటి విద్యుత్ అవసరాలను తీర్చడమే గాకుండా ఇతరత్రా అవసరాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. అదనపు ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి. సాధారణ విద్యుత్ బిల్లుల మోత మోగుతుండడంతో ‘సిటీ’జనులు సౌర విద్యుత్ వైపు మొగ్గు చూపుతున్నారు. మొదట్లో దీనిపై అంతగా అవగాహన లేకున్నా.. క్రమేణా సౌర విద్యుత్‌పై ప్రజలకు ఆదరణ పెరుగుతోంది.
♦ నగరంలోని 34 బల్దియా కార్యాలయాలపై రూ.4.5 కోట్ల వ్యయంతో 941 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ప్యానెల్ ఏడాదికి సగటున 1,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈవిధంగా జీహెచ్‌ఎంసీ సోలార్ విద్యుత్ ఉత్పత్తితో తన కరెంటు బిల్లుల వ్యయాన్ని ఏడాదికి రూ.1.50 కోట్ల మేర తగ్గించుకుంది.
♦ బండ్లగూడ నగరపాలిక పరిధి గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్‌లోని పది బహుళ అంతస్తుల్లో 518కుటుంబాలు నివసిస్తున్నాయి. వ్యక్తిగత, ఉమ్మ డి అవసరాలకు నెలకు రూ.12 లక్షల విలువ చేసే కరెంట్ వినియోగించేవారు. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు రూ.2.60 కోట్లతో 750 కిలోవాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటిద్వారా నెలకు 85వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా వారి నెలవారీ విద్యుత్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గిపోయింది.
♦ఈయన పీవీ రంగనాయకులు. కాప్రాలోని వెస్ట్రన్ బ్లీస్ విల్లాస్‌లో నివసిస్తున్నారు. 2022 నవంబర్‌లో రూ.3 లక్షలు ఖర్చు చేసి ఇంటిపై ఐదు కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నారు. రోజుకు సగటున 25 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో అప్పటివరకు నెలకు రూ.5,000 వచ్చే కరెంటు బిల్లు రూ.150 నుంచి రూ.200కు పడిపోయింది.
పాఠశాలలకూ సోలార్ హంగులు
సర్కారీ పాఠశాలలను కరెంట్ బిల్లుల భారం నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మన ఊరు– మన బడి’లో భాగంగా 11 జిల్లాల పరిధిలో తొలి విడతగా 1,521 ప్రభుత్వ పాఠశాలలపై రూ.32.02 కోట్లతో 3,072 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా పాఠశాలల భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది.
మరికొన్ని ప్రాజెక్టులు
♦ శంషాబాద్ విమానాశ్రయంలో 2015లో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2021 జూలైలో అదనంగా మరో ఐదు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటును అమర్చారు. ప్రస్తుతం విమానాశ్రయం విద్యుత్ అవసరాలు 50% సౌరశక్తి ద్వారానే తీరుతుండటం గమనార్హం. కాచిగూడ రైల్వేస్టేషన్ సైతం సోలార్ ఎనర్జీతో నెలవారీ విద్యుత్ బిల్లుల భారం నుంచి గట్టెక్కింది.
♦ రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలోవార్షిక విద్యుత్ బిల్లు రూ.కోటికి పైగా వచ్చేది. భవనాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు తర్వాత ఈ బిల్లు రూ.40 లక్షలకు తగ్గింది.
♦ శామీర్‌పేట జినోమ్ వ్యాలీలో 952, జవహర్‌నగర్‌లో 947, కోకాపేట్ ఓపెన్ స్పేస్‌లో 100, కిమ్స్ రెసిడెన్సీలో 275, హిమాయత్‌సాగర్ ఓనర్స్ అసోసియేషన్ పరిధిలో 710 కిలోవాట్ల సామర్థ్యం గల ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి. విద్యుత్ బిల్లులు తగ్గిపోయాయి. నిథమ్ క్యాంపస్‌లో 200 కిలోవాట్ల సామర్థ్యం గల ప్యానెళ్ల ద్వారా నెలకు 2.50 లక్షల బిల్లు ఆదా చేస్తున్నారు.
అదనపు విద్యుత్ డిస్కంకు..
♦ గ్రేటర్ పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 220 మెగావాట్ల సామ ర్థ్యం కలిగిన మినీ సోలార్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున 170 నుంచి 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వేసవిలో మరో 30% అదనంగా ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. నగరంలో రోజుకు సగ టున 2,500 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ ఉండగా, ఇందులో థర్మల్, జల విద్యుత్ 2,300 మెగావాట్లు, సోలార్ ద్వారా 220 మెగావాట్ల వరకు రికార్డవుతోంది. నగరంలో సౌర విద్యుత్‌కు సంబంధించి మొత్తం 11,968 రూఫ్ టాప్ నెట్ మీటర్ కనెక్షన్లు ఉన్నాయి.
మిద్దెలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు వీటి ద్వారా తమ రోజువారీ అవసరాలు తీర్చుకుంటూ, మిగిలిన విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు సరఫరా చేస్తున్నారు. తద్వారా ఇంటి విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గించుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వెలుస్తున్న విల్లా ప్రాజెక్టుల్లో అధికశాతం గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తున్నాయి. సోలార్ విద్యుత్‌ను అదనపు ఫెసిలిటీగా కస్టమర్లకు చూపుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
♦ మల్కాజ్‌గిరికి చెందిన శ్యామ్‌సుందర్ సింగ్ తన ఇంటిపై 6 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. రోజుకు సగటున 30 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలు పోను మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు విక్రయిస్తున్నారు.
ఒక్కసారి బిగిస్తే.. 25 ఏళ్ల పాటు ఉత్పత్తి
గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు, ఇతర రెసిడెన్షియల్ కాలనీలకు డిస్కం వ్యక్తిగతంగా కాకుండా అందరికీ కలిపి ఒకే కనెక్షన్ (హెచ్‌టీ) జారీ చేస్తుంది. ఆ తర్వాత వ్యక్తిగత మీటర్లు అమర్చుకుని ఎవరికి వారు బిల్లులు చెల్లిస్తుంటారు. ఇందుకు ఆయా వినియోగదారుల నుంచి డిస్కం యూనిట్‌కు రూ.6.30 పైసల చొప్పున వసూలు చేస్తుంది. అదే వారి ఇంటిపై ఉత్పత్తి అయిన విద్యుత్‌కు రూ.4.09 పైసలు చెల్లిస్తుంది.
ఒకసారి ఇంటిపై ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్లపాటు విద్యుత్ ఉత్పత్తికి ఢోకా ఉండదు. అంతేకాదు ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం 25 నుంచి 50 శాతం రాయితీ కూడా ఇస్తుంది. – బి.అశోక్, అధ్యక్షుడు, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment