సాక్షి, సిటీబ్యూరో : సంప్రదాయేతర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథార్టీ (హెచ్‌ఎండీఏ) చేసిన ప్రయోగం వికటించింది. వీధి దీపాలకు, వాణిజ్య ప్రకటనలకు సాధారణ విద్యుత్‌ను కాకుండా సౌర విద్యుత్‌ను వినియోగించాలని గతంలో హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా నెక్లెస్ రోడ్డులో 16 సోలార్ విద్యుత్ దీపాలు, పీపుల్స్ ప్లాజా వద్ద ఓ హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. సౌరశక్తి ఆధారంగా ఇవి వెలుగులు విరజిమ్మేలా అట్టహాసంగా తీర్చిదిద్దారు. నెక్లెస్ రోడ్డుకు వ్యాహాళికి వచ్చే ప్రజలకు సౌరశక్తి వినియోగంపై అవగాహన పెంచేందుకు ఇవి ఓ మోడల్‌గా ఉంటాయని భావించారు. అయితే... వాటికి నాసిరకం సోలార్ ప్యానల్స్ వినియోగించడం వల్ల ఈ ప్రయోగం ఆదిలోనే బెడిసికొట్టింది.
సోలార్ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో కంగుతిన్న అధికారులు తమ లోపాన్ని కప్పిపుచ్చుకొనేందుకు గుట్టుచప్పుడు కాకుండా సాధారణ విద్యుత్‌ను సరఫరా చేసి ఆ మార్గంలో లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేశారు. దీన్నిచూసిన ఉన్నతాధికారులు సైతం ఆహా... ఓహో.. అంటూ ఆర్భాటంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించి వెళ్లిపోయారు. ఆ తర్వాత వీటిగురించి పట్టించుకొన్న నాధుడు లేకపోవడంతో సోలార్ లైట్లు అసలు పనిచేయని విషయం బయటకు పొక్కలేదు. ఇందుకోసం వెచ్చించిన లక్షలాది రూపాయల నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ఫలించని యత్నం
ధరిత్రీ దినోత్సవం సందర్భంగా 2010 ఏప్రిల్ 22న సంజీవయ్య పార్కులో 17 సౌరశక్తి దీపాలను ఏర్పాటు చేసి సౌరశక్తి వినియోగానికి హెచ్‌ఎండీఏ తెర తీసింది. ఆ తర్వాత నెక్లెస్ రోడ్డులోనూ అదే ప్రయోగాన్ని అమలు చేస్తూ తన పరిధిలోని హోర్డింగ్స్, పార్కులు, ఇతర ప్రాంతాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే... సంజీవయ్య పార్కులో సోలార్ విద్యుత్ దీపాలు కేవలం వేసవి కాలంలోనే పనిచేసి ఆ తర్వాత మొరాయించాయి. ఇప్పుడక్కడ ఒక్కటంటే ఒక్కటి కూడా సోలార్ లైటు వెలగడం లేదు.
వీటిని మరమ్మతు చేయించేందుకు ప్రయత్నించిన అధికారులకు ఆలస్యంగా అసలు విషయం బోధపడింది. హుస్సేన్‌సాగర్ పరిసరప్రాంతాల్లో వాయు కాలుష్యం కారణంగా సోలార్ ప్యానల్స్‌పై ఓ పొరలా రస్ట్ ఏర్పడి అవి పనిచేయట్లదని తెలిసింది. సంజీవ్య పార్కులో రోజ్ గార్డెన్ నిర్మాణం కోసం అక్కడున్న సోలార్ లైట్లను తొలగించిన అధికారులు మళ్లీ వాటిని ఏర్పాటు చేసేందుకు శ్రద్ధ తీసుకోలేదు.
నెక్లెస్‌రోడ్, సంజీవయ్య పార్కులో సోలార్ లైట్లు పనిచేయని విషయమై సంబంధిత అధికారిని వివరణ కోరగా ‘ సోలార్ లైటింగ్ ఇక్కడే కాదు... ఎక్కడా కూడా అవి సక్సెస్ కాలేదు. మాదాపూర్ సమీపంలోని ఓ తండాలో ఏర్పాటు చేసిన లైట్లు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి’ అని సెలవిచ్చారు. రోజ్‌గార్డెన్ నిర్మాణం కోసం సంజీవయ్య పార్కులో కొన్ని సోలార్ లైట్లను తొలగించాల్సి వచ్చిందని, మిగిలినవి అలాగే ఉన్నాయన్నారు. ఇప్పుడు వాటికి మరమ్మతులు చేసినా పనిచేసే స్థితిలో లేవన్నారు.
‘సౌరశక్తి’ ఉత్తదే!
Published Sun, Mar 22 2015 1:19 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement