Rural poverty agency
-
బ్యాంక్ ఖాతాలకే పింఛన్లు
► మాన్యువల్ చెల్లింపులకు ఇక స్వస్తి ► పోస్టాఫీసుల్లోనూ ఆసరా పింఛన్ల అందజేత సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ పింఛన్ల చెల్లింపుల్లో పారదర్శకతకు పట్టం కట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) నిర్ణయించింది. అవకతవకలను నివారించే నిమిత్తం ఇకపై మాన్యువల్(చేతికి ఇవ్వడం) పద్ధతికి స్వస్తి పలకాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 లక్షల మంది లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ వచ్చే జనవరి నుంచి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా మాత్రమే పింఛన్ సొమ్మును అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏదేని బ్యాంకు శాఖ ఉన్న గ్రామంలో లబ్ధిదారులందరికీ పింఛన్ సొమ్మును తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలని సెర్ప్ సీఈవో నీతూకుమారి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 37 శాతం మందికి బ్యాంక్‌లు, 50 శాతం మందికి పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేశారు. 13 శాతం మందికి పంచాయతీ సిబ్బంది ద్వారా మాన్యువల్‌గా సొమ్మును అందజేస్తున్నారు. జాప్యం నివారణకు ఎన్పీసీఐతో ఒప్పందం! ఆసరా లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు నూతన విధానాన్ని అవలంభించాలని సెర్ప్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కోర్ బ్యాంకింగ్ విధానం(సీబీఎస్) వల్ల బ్యాంకు ఖాతాలున్న 13 లక్షల మందికి పింఛన్ సొమ్మును జమ చేసేందుకు కనీసం 10 నుంచి 15 రోజులు పడుతోంది. ఈ విధానంలో రోజుకు 1.5 లక్షలకు మించి లావాదేవీలు జరిపే అవకాశం లేకపోవడం, బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవు కావడంతో పింఛన్ సొమ్ము సకాలంలో లబ్ధిదారులకు చేరడం లేదు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకబిగిన ఒకేసారి లబ్ధిదారులందరి ఖాతాలకు సొమ్మును జమ చేసేందుకు వీలుగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. సీబీఎస్ విధానంతో సొమ్ము పంపిణీ పూర్తి ఉచితం కాగా, ఎన్పీసీఐ ద్వారా సొమ్ము జమ చేసే ప్రక్రియకు ఒక్కో లావాదేవీకి రూ.11 చెల్లించాల్సి ఉంది. సేవాపన్నుతో కలిపి మొత్తం 13 లక్షలమంది లబ్ధిదారుల ఖాతాలకు ఒకేరోజు పింఛన్ సొమ్మును జమ చే యాలంటే, సర్కారుపై నెలకు రూ.1.5 కోట్ల భారం పడుతుంది. సకాలంలో పింఛన్ ఇవ్వలేకపోయామనే అపవాదు కంటే భారం మోయడమే మేలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
‘ఆసరా’ అక్రమాలపై సర్కారు సీరియస్
సాక్షి కథనానికి స్పందించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకం అమలులో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న అవకతవకలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల ఖమ్మం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో నిర్వహించిన సామాజిక తనిఖీలో లక్షలాది రూపాయల ‘ఆసరా’ సొమ్ము అక్రమార్కుల పాలైనట్లు వెల్లడైంది. ఈ విషయమై సోమవారం ‘ఆసరా.. అక్రమార్కుల పరం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సర్కారులో కదలిక తీసుకువచ్చింది. తక్షణం అన్ని జిల్లాల్లో(పట్టణ, నగర ప్రాంతాలు సహా) సామాజిక తనిఖీలు నిర్వహించి ఆసరా పథకం అమల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఆసరా పింఛన్ల మంజూరు బాధ్యతలను నిర్వహిస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో మురళి సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ(శాట్) డెరైక్టర్‌కు సోమవారం లేఖ రాశారు. ‘ఆసరా’ పింఛన్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే సామాజిక తనిఖీ నిర్వహించాలని సోషల్ ఆడిట్ విభాగం డెరైక్టర్‌ను కోరారు. దీంతో మంగళవారం నుంచే సామాజిక తనిఖీ నిర్వహించేందుకు శాట్ సన్నద్ధమైంది. -
నిరుపేదలు నష్టపోవద్దు
ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల మంజూరులో జాగ్రత్తలు తీసుకోండి అధికారులకు ‘సెర్ప్’ సీఈవో ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రతా కార్డులు, పింఛన్లను అందించడంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మురళి క్షేత్రస్థాయి అధికారులను అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్ కార్యక్రమాల అమలుపై వివిధ జిల్లాల డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ల(పీడీ)తో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. సెర్ప్ రూపొందించిన నిరుపేద కుటుంబాల జాబితా లో అర్హులైన వారి పేర్లు లేనట్లైతే కొత్తగా వారి వివరాలను పొందుపరచాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో తమ వివరాలను ఇవ్వలేకపోయిన కుటుంబాల నుంచి కూడా డేటాను సేకరించాలని సూచించారు. ఆహారభద్రత, పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వలసల సంగతేంటి? దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పలు జిల్లాల ప్రాజెక్టు డెరైక్టర్లు ఉన్నతాధికారులకు వివరించారు. తమ జిల్లాల నుంచి వలస వెళ్లిన కుటుంబాల వారు సమగ్ర కుటుంబ సర్వే, కార్డుల దరఖాస్తుల ప్రక్రియ సందర్భంగా జిల్లాకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకొని వెళ్లారని, ప్రస్తుతం పరిశీలనకు వారు అందుబాటులో లేనందున ఏం చేయాలో పాలుపోవడం లేదని ప్రాజెక్టు డెరైక్టర్లు పేర్కొన్నారు. దీనిపై సీఈవో మురళి స్పందిస్తూ.. వలస వెళ్లిన కుటుంబాలు తాత్కాలికంగా వెళ్లినట్లయితే.. వారిని పరిశీలన నిమిత్తం వెనక్కి పిలిపించాలని సూచించారు. శాశ్వతంగా వలస వెళ్లిన కుటుంబాల గురించి పట్టించుకోనక్కర్లేదన్నారు. ‘సదరం’ వైకల్య ధ్రువపత్రాలు లేవని పీడీలు తెలుపగా, ధ్రువపత్రాలు లేకున్నా పరిశీలన కొనసాగించాలని సీఈవో సూచించారు. పింఛన్ల మంజూరు నాటికి సదరం సర్టిఫికెట్లు సమర్పిస్తామని ఆయా దరఖాస్తుదారుల నుంచి హామీ పత్రాలు తీసుకోవాలని పీడీలను సీఈవో ఆదేశించారు. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన డేటాఎంట్రీని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఈవో తెలిపారు. పింఛన్ టెన్షన్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచుతుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులతో అధికారులు సతమతమవుతున్నారు. సమయం తక్కువగా ఉండడం, సరిపడా సిబ్బంది లేకపోవడం, అర్హుల ఎంపికలో తేడా వస్తే సదరు అధికారులనే బాధ్యులుగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో మండల స్థాయి అధికారులు టెన్షన్‌కు లోనవుతున్నారు.