ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల మంజూరులో జాగ్రత్తలు తీసుకోండి
అధికారులకు ‘సెర్ప్’ సీఈవో ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రతా కార్డులు, పింఛన్లను అందించడంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మురళి క్షేత్రస్థాయి అధికారులను అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్ కార్యక్రమాల అమలుపై వివిధ జిల్లాల డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ల(పీడీ)తో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. సెర్ప్ రూపొందించిన నిరుపేద కుటుంబాల జాబితా లో అర్హులైన వారి పేర్లు లేనట్లైతే కొత్తగా వారి వివరాలను పొందుపరచాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో తమ వివరాలను ఇవ్వలేకపోయిన కుటుంబాల నుంచి కూడా డేటాను సేకరించాలని సూచించారు. ఆహారభద్రత, పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వలసల సంగతేంటి?
దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పలు జిల్లాల ప్రాజెక్టు డెరైక్టర్లు ఉన్నతాధికారులకు వివరించారు. తమ జిల్లాల నుంచి వలస వెళ్లిన కుటుంబాల వారు సమగ్ర కుటుంబ సర్వే, కార్డుల దరఖాస్తుల ప్రక్రియ సందర్భంగా జిల్లాకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకొని వెళ్లారని, ప్రస్తుతం పరిశీలనకు వారు అందుబాటులో లేనందున ఏం చేయాలో పాలుపోవడం లేదని ప్రాజెక్టు డెరైక్టర్లు పేర్కొన్నారు. దీనిపై సీఈవో మురళి స్పందిస్తూ.. వలస వెళ్లిన కుటుంబాలు తాత్కాలికంగా వెళ్లినట్లయితే.. వారిని పరిశీలన నిమిత్తం వెనక్కి పిలిపించాలని సూచించారు. శాశ్వతంగా వలస వెళ్లిన కుటుంబాల గురించి పట్టించుకోనక్కర్లేదన్నారు. ‘సదరం’ వైకల్య ధ్రువపత్రాలు లేవని పీడీలు తెలుపగా, ధ్రువపత్రాలు లేకున్నా పరిశీలన కొనసాగించాలని సీఈవో సూచించారు. పింఛన్ల మంజూరు నాటికి సదరం సర్టిఫికెట్లు సమర్పిస్తామని ఆయా దరఖాస్తుదారుల నుంచి హామీ పత్రాలు తీసుకోవాలని పీడీలను సీఈవో ఆదేశించారు. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన డేటాఎంట్రీని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఈవో తెలిపారు.
పింఛన్ టెన్షన్
దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచుతుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులతో అధికారులు సతమతమవుతున్నారు. సమయం తక్కువగా ఉండడం, సరిపడా సిబ్బంది లేకపోవడం, అర్హుల ఎంపికలో తేడా వస్తే సదరు అధికారులనే బాధ్యులుగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో మండల స్థాయి అధికారులు టెన్షన్‌కు లోనవుతున్నారు.
నిరుపేదలు నష్టపోవద్దు
Published Sat, Oct 25 2014 2:17 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement