ఈవీఎంలు భద్రం... అభ్యర్థులు ఆందోళన వద్దు
కాకినాడ జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఈవీఎంలు మాత్రం వర్షపు నీటిలో తడవలేదని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూంను నీతూ ప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఈవీఎంల విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.
కాకినాడ పార్లమెంట్, ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం బాక్స్ల కిందకి వర్షపు నీరు చేరిందన్నారు. అయితే ఈవీఎంలను క్షుణ్ణంగా పరిశీలించగా సదరు ఈవీఎంలు తడవలేదని చెప్పారు. కాకినాడ లోక్సభ, ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ వెల్లడించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అందులోభాగంగా కాకినాడ జేఎన్టీయూలోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దాంతో భద్రత సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు శనివారం స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు.