సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /ముకరంపుర :జిల్లా కలెక్టర్‌గా జార్ఖండ్ డైనమైట్ నీతుకుమారి ప్రసాద్ నియమితులయ్యా రు. ముక్కుసూటితనం, సమర్థవంతమైన అధికారిగా పేరున్న ఆమె తూర్పు గోదావరి జిల్లా నుంచి బదిలీపై వస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ వీరబ్రహ్మయ్య హైదరాబాద్ నగరపాలక సంస్థ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ కాగా, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమితులయ్యారు. జేసీగా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.
జగిత్యాల సబ్ కలెక్టర్‌గా నియామకమైన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డి.కృష్ణభాస్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి డి.లక్ష్మీపార్థసారధి కుమారుడు. సోమవారం ఉదయం ప్రస్తుత కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో వీరబ్రహ్మయ్య సహా పలువురు అధికారులు నూతన కలెక్టర్ నీతుకుమారికి ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పండుగ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పినట్లు సమాచారం. మరోవైపు జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్, వరంగల్ మున్సిపల్ కమిషనర్‌లుగా నియమితులైన వీరబ్రహ్మయ్య, సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు.
ముక్కుసూటితనం నీతు నైజం
2001 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీతుకుమారి ప్రసాద్ స్వస్థలం జార్ఖండ్. ఆమె భర్త రాజేశ్‌కుమార్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్నారు. నీతుకుమారికి నిజాయితీ, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. మీడియాకు దూరంగా ఉండే ఆమె సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
మొన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లపాటు కొనసాగిన ఆమె ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా సమర్థంగా వ్యవహరించారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు. ఐఏఎస్ శిక్షణ పూర్తయిన అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ తొలి పోస్టింగ్ పొందిన ఆమె తర్వాత వరంగల్ నగర కమిషనర్‌గా, రాష్ట్ర, పర్యాటక, యువజన, క్రీడా వ్యవహారాలశాఖ అడిషనల్ చీఫ్‌గా కొనసాగారు.
అనంతరం నిజామాబాద్, నల్గొండ జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా, వాణిజ్య పన్నులశాఖ ఉప కమిషనర్‌గా, హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్ కేటాయింపుల్లో భాగంగా నీతుకుమారి తెలంగాణకు వెళ్లేందుకు మొగ్గు చూపినప్పటికీ ఆమె భర్త రాజేశ్‌ను ఏపీకి కేటాయించడంతో పునరాలోచనలో పడ్డారు. చివరకు ఆమెను తెలంగాణకు కేటాయించడంతో కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు.
సమస్యల స్వాగతం
కలెక్టర్‌గా వస్తున్న నీతుకుమారికి జిల్లాలో పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణలో మిగతా జిల్లాలతో పోల్చితే కరీంనగర్‌లో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువే. పైగా కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేక అభిమానం. అన్నింటినీ అధిగమించి ఆమె పాలన సాగించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతరం అధికార యంత్రాంగంలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని పారదోలి, అస్తవ్యస్తంగా మారిన పాలనను గాడిలో పెట్టమే కొత్త కలెక్టర్ ముందున్న ప్రథమ కర్తవ్యంగా చెప్పుకోవచ్చు.
ప్రభుత్వ విభాగాల్లో ఎటు చూసినా అవినీతి రాజ్యమేలుతుండగా రెవెన్యూ, వైద్య, విద్యాశాఖల్లో అవినీతి పతాకస్థాయికి చేరింది. పహణీలు, పాస్‌బుక్కుల కోసం ప్రజలనుంచి దోచుకుంటున్నారు. 2014లో ఏకంగా 27 మంది రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ విషయంలో ఆలస్యంగా స్పందించిన కలెక్టర్ వీరబ్రహ్మయ్య కలెక్టరేట్‌లో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయడంతో ప్రజలనుంచి విశేష స్పందన వచ్చింది.
మొదట్లో కొందరు వీఆర్వోలను సస్పెండ్ చేయడంతో అధికారుల్లో ఉలిక్కిపాటు మొదలైనా మళ్లీ షరా ‘మామూలే’ అయింది. సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వృధావాణిగా మారుతోంది. మూడేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ గ్రీవెన్స్ సెల్‌ను ప్రజావాణి కార్యక్రమంగా రూపురేఖలే మార్చారు. అన్నిశాఖల అధికారులను అందుబాటులో ఉంచి ప్రతీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. డివిజన్, మండలకేంద్రాల్లోనూ ప్రజావాణి ఏర్పాటు చేశారు. ఆమె కలెక్టర్‌గా ఉన్నంతకాలం ప్రత్యేక శ్రద్ధ వహించినా ఏడాదిగా అధికారులు అంతగా శ్రద్ధ చూడం లేదు. గ్రామసందర్శనతో క్షేత్రస్థాయిలో దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో ప్రజావాణి వృథావాణిగా అయిపోతోంది.
ప్రొఫైల్
పేరు : నీతుకుమారి ప్రసాద్
భర్త పేరు : రాజేశ్‌కుమార్
(ఐపీఎస్ అధికారి,
గుంటూర్ అర్బన్ ఎస్పీ)
ఐఏఎస్ బ్యాచ్ : 2001
తొలిపోస్టింగ్ : భద్రాచలం సబ్ కలెక్టర్
విధులు : వరంగల్ కమిషనర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల జేసీగా, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా, తూర్పు గోదావరి కలెక్టర్‌గా విధులు
జార్ఖండ్ డైనమైట్
Published Tue, Jan 13 2015 3:44 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement