నామినేషన్ల పర్వం
మహబూబ్‌నగర్ అర్బన్/వనపర్తి/ కొల్లాపూర్, న్యూస్‌లైన్: నాలుగోరోజు శనివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పా ర్లమెంట్ స్థానాలు, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలుకాలేదు.
స్థానిక అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన శంకర్‌రాథోడ్ బ్యాంకు జీరోఖాతాతో పాటు మరికొన్ని పత్రాలను పూర్తిస్థాయిలో తీసుకురాలేదని సిబ్బంది సూచించడంతో వెనుదిరిగారు. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నామినేషన్ల పర్వం కోలాహలంగా సాగింది.
మాజీమంత్రి, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జి.చిన్నారెడ్డి శనివారం వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను సమర్పించారు. మధ్యాహ్నం 2.49గంటలకు ఓ నామినేషన్ సెట్టు, 2.59 గంటలకు మరో సెట్టు నామినేషన్‌ను ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లుకు అందజేశారు.
ఎప్పటిలాగే ఆయన నమ్మే ముస్లిం మతగురువు మౌలాలీబాబాను వెంట తెచ్చుకున్నారు. నామినేషన్ వేసి బయటకు రాగానే ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వచనం పొందారు.
కొల్లాపూర్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఇరగదిండ్ల శ్రీనివాస్ వైఎస్‌ఆర్ సీపీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌ను పార్టీకి చెందిన యువజన నాయకులు ప్రమోద్ ముది రాజ్ బలపర్చారు.
దేవరకద్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దూర్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మరోసెట్టు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా చంద్రునాయక్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
నారాయణపేట నుంచి టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా నామినేషన్ వేశారు.
కొడంగల్ నుంచి టీఆర్‌ఎస్ తరఫున పున్నంచంద్ లాహోటీ తన నామినేషన్‌పత్రాలు దాఖలుచేశారు.
మక్తల్ నుంచి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థిగా వర్కటం జగన్నాథ్‌రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండయ్య నామినేషన్ వేశారు.