G. Chinna Reddy
-
పాడి బకాయిలు చెల్లించరేం?
• లక్ష కోట్ల బడ్జెట్లో ఈ చిన్న మొత్తం ఇవ్వలేరా?: కాంగ్రెస్ • తొమ్మిది నెలలుగా చెల్లించలేదంటూ విమర్శలు • రాజకీయం చేస్తున్నారని తలసాని మండిపాటు.. కాంగ్రెస్ వాకౌట్ సాక్షి, హైదరాబాద్: మూడ్రోజుల విరామం తర్వాత మంగళవారం ప్రారంభమైన శాసనసభ తొలిరోజే వాడివేడిగా సాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాయి. పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ఎంఎన్‌జే ఆస్పత్రిలో రేడియేషన్ పరికరాల కొనుగోలు, భద్రాద్రి రామాలయంలో నగల మాయం అంశాలపై విమర్శలు కురిపించగా... ప్రభుత్వం వాటిని తిప్పికొట్టింది. తొలుత కాంగ్రెస్ సభ్యులు టి.జీవన్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి పాడి బకాయిల అంశాన్ని లేవనెత్తారు. 2016 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.22.59 కోట్ల పాడి ప్రోత్సాహక బకాయిలు పేరుకుపోయాయని, డిసెంబర్ వరకు ఆ మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్లో పాడి రైతులకు చెందిన చిన్న మొత్తాలను విడుదల చేయలేదని విమర్శించారు. ఇందుకు పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బదులిస్తూ.. ఇప్పటికే ఆగస్టు వరకు బకాయిలు చెల్లించామని తెలిపారు. దీనిపై జీవన్‌రెడ్డి ప్రతిస్పందిస్తూ.. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, లిఖిత పూర్వకంగా ఒకలా చెప్పి, సమాధానం మరోలా చెబుతున్నారన్నారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ... అది వాయిదా పడ్డ ప్రశ్న అని, ప్రశ్న తిరిగి వచ్చే సమయానికి బకాయిలు చెల్లింపు చేశామని వివరించారు. దీనిపై జీవన్‌రెడ్డి మళ్లీ మాట్లాడుతూ.. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇందుకు తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం తలసాని కల్పించుకొని.. పాడి రైతులను యాభై ఏళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారనడం, అధికార పక్ష సభ్యులు సైతం మంత్రికి మద్దతుగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. జీవన్‌రెడ్డి మైక్ ఇవ్వాలని కోరినా స్పీకర్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ సభ్యులంతా తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. దీంతో జీవన్‌రెడ్డికి స్పీకర్ మైక్ ఇచ్చారు. అనంతరం తొమ్మిది నెలల బకాయిలపై నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ సభ్యులు బయటకెళ్లిపోయారు. రేడియేషన్ యంత్రాలపైనా మాటల మంట.. అంతకుముందు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో రేడియేషన్ యంత్రాల కొనుగోళ్లపైనా ఘాటు గా చర్చ జరిగింది. పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, దీనిపై కేంద్ర కమిటీ సైతం నివేదిక ఇచ్చిందని కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిస్తూ.. ఆస్పత్రిలో రాజకీయాలున్నాయని, అందునే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని, దాన్ని పట్టుకొనే ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేస్తున్నారన్నారు. రేడియేషన్ పరికరాల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని చిన్నారెడ్డి దుయ్యబట్టారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. అబద్ధాలు మాట్లాడితే కచ్చితంగా ఎదురుదాడి చేస్తామనడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. నగలపై విచారణ ఏమైంది? భద్రాద్రి రామాలయంలో సీతమ్మ మంగళసూత్రం, లక్ష్మణుడి లాకెట్లు మాయమైన ఘటనపై విచారణ ఏమైందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నగలు ఎలా మాయమయ్యాయి? మళ్లీ ఎలా దొరికాయన్న అంశంపై విచారణ ఎక్కడి వరకు వచ్చిందన్నారు. దీనికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందిస్తూ.. మంగళసూత్రం పోలేదని, చిన్నచిన్న ఆభరణాలు మాత్రమే పోయాయని, తర్వాత దొరికాయని వివరించారు. కాగా ఈ నెల 9న ముక్కోటి ఏకాదశి కారణంగా సభకు సెలవు ప్రకటించాలని ఖమ్మం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కోరగా, ప్రతిపక్షాలతో మాట్లాడి దీనిపై నిర్ణయిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సహకరిస్తే 6 నెలల్లో కాల్వల పనులు: హరీశ్ భూసేకరణ త్వరగా జరిగేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వల ఆధునీకరణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఈ కాల్వల ద్వారా 63,012 ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని, వీటికోసం ఇప్పటికే రూ.284.85 కోట్లు విడుదల చేశామన్నారు. -
జీఎస్టీపై ఎవరేమన్నారంటే..
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు ‘‘ప్రస్తుతం 14.5 శాతం సేవా పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ 18 శాతం ఉండాలని.. 24 లేదా 25 శాతం దాకా ఉండాలని ప్రతిపాదనలు వస్తున్నా యి. పన్నును భారీగా పెంచితే ప్రజలు ఇబ్బంది పడతారు. జీఎస్టీ 18%గా ఉండాలని 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. 18 శాతమే ఖరారు చేస్తే మంచిది. 2001లో కెనడాలో జీఎస్టీని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓట మిపాలై రెండు ఎంపీ సీట్లకు పరిమితమైంది. దాంతో తర్వాతి ప్రభుత్వాలు జీఎస్టీని 5 శాతానికి మించి పెంచకుండా జాగ్రత్తపడుతున్నాయి. తేనెటీగలు పువ్వులకు నొప్పి కలిగించకుండానే తేనెను స్వీకరించినట్లు ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పన్నులు విధించాలని వేదవ్యాసుడు ఎప్పుడో సూచించాడు. పన్నులు ప్రజలకు బాధ కలిగించవద్దని 2 వేల ఏళ్ల కిందే గొప్ప ఆర్థికవేత్తగా పేరొందిన చాణక్యుడు చెప్పాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. జీఎస్టీ ద్వారా కార్లు, విలాస వస్తువుల ధరలు తగ్గుతాయంటున్నారు. కానీ ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలి.. ధనికుల కోసం కాదు. పెట్రోల్, డీజిల్ రాష్ట్రాల పరిధిలో ఉంచినందున వాటిపై పన్నులు తగ్గించాలి. మద్యం, సిగరెట్లపై పన్నులు పెంచినా అభ్యంతరం లేదు. మొత్తంగా జీఎస్టీ బిల్లును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం..’’ - జి.చిన్నారెడ్డి, కాంగ్రెస్ ఆర్థిక సంస్కరణల్లో మైలురాయి ‘‘దేశ ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ బిల్లు ఓ మైలురాయి. పన్నుల వసూళ్లలో అవినీతిని అరికట్టడానికి, వినియోగదారులు, ఉత్పత్తిదారులు, వ్యాపారవేత్తలు, ఇతర అన్ని వర్గాలకు.. సామాజిక, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ప్రభుత్వాలకూ ఇది ఉపయోగపడుతుంది. జీఎస్టీతో అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కపెట్టి అన్ని రాజకీయపక్షాలు ముందుకు రావడం అభినందనీయం..’’ - కిషన్‌రెడ్డి, బీజేపీ చిన్న పరిశ్రమలను కాపాడాలి ‘‘జీఎస్టీతో చిన్న పరిశ్రమల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాలి. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ ధరలు తగ్గేలా చూడాలి. టీడీపీ తరఫున జీఎస్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు జీఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు చోటు కల్పించడం అభినందనీయం..’’ - సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ తెలంగాణ రాష్ట్రం నష్టపోకుండా చూడాలి ‘‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తే నష్టం జరుగుతుంది. జీఎస్టీతో తెలంగాణకు నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి..’’ - సున్నం రాజయ్య, సీపీఎం ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలి ‘‘రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 3.25 శాతం నుంచి 3.5 శాతానికి పెంచే అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. దానికి తక్షణమే కేంద్రం అనుమతిచ్చేలా ఒత్తిడి తేవాలి. జీఎస్టీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం..’’ - మౌజం ఖాన్, ఎంఐఎం టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ‘‘దేశ ఆర్థికాభివృద్ధి కోసం రూపొందించిన జీఎస్టీ బిల్లుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. జీఎస్టీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుం దని భావిస్తున్నాం..’’ - చెన్నమనేని రమేశ్, వి.శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ -
'తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ నిలబడలేదు'
హైదరాబాద్: తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ నిలబడలేకపోయిందనే బాధ పార్టీ కేడర్‌లో ఉందని మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీతో కలిసి పనిచేయకపోవడం, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వ్యూహం ఫలించకపోవడం వల్లే పార్టీ ఓటమి పాలైందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సులో మాట్లాడుతూ... పార్టీ సంస్థాగత పదవుల్లో మహిళలు, యువతకు పెద్దపీఠ వేయాలని సూచించారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలే ఆ పార్టీని గెలిపించాయని మరో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పార్టీ బలోపేతమవ్వలంటే నేతలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. -
‘తమ్ముళ్ల’తో దోస్తీ కడదాం.. ‘కారు’కు బ్రేకులేద్దాం..
* మండల, జిల్లా పరిషత్‌లను దక్కించుకుందాం * స్థానిక సంస్థల్లో పాగాకు కాంగ్రెస్ తాజా వ్యూహం * మద్దతు కూడగట్టే బాధ్యత సబిత, చిన్నారెడ్డిలదే.. * గెలుపు అవకాశాలను సమీక్షించిన టీపీసీసీ చీఫ్ పొన్నాల సాక్షి,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చిరకాల ప్రత్యర్థి తెలుగుదేశంతో జతకట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అనూహ్యంగా ఎదిగిన టీఆర్ఎస్ను నిలువరించేందుకు రాజకీయ వైరాన్ని పక్కనపెట్టాలనే అభిప్రాయానికొచ్చింది. అత్యధిక స్థానిక సంస్థలను చేజిక్కించుకునేందుకు టీడీపీతో దోస్తీ కట్టడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు అవకాశాలు, క్యాంపుల నిర్వహణ, ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా పరిషత్‌లో స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ, అత్యధిక స్థానాలు గెలుచుకున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ జెడ్పీని చేజార్చుకోకూడదని పొన్నాల స్పష్టం చేశారు. జెడ్పీలో 33 సీట్లకుగాను కాంగ్రెస్‌కు 14, టీఆర్ఎస్ 12, టీడీపీకి 7 జెడ్పీటీసీలు దక్కాయి. ఈ నేపథ్యంలో మేజిక్ నంబర్‌కు సరిపడా సభ్యులను సమకూర్చుకునేందుకు టీడీపీ మద్దతు కోరాలని ఆయన సూచించారు. కారు జోరుకు బ్రేకులు వేయాలంటే ‘దేశం’తో సర్దుబాటు చేసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. 12 చోట్ల గెలిచిన టీఆర్ఎస్.. కాంగ్రెస్, టీడీపీ సభ్యులకు వల వేయడం ద్వారా మేజిక్ సంఖ్య(17)ను చేరుకునే దిశగా పావులు కదుపుతోందని సమావేశంలో పాల్గొన్న నేతలు టీపీసీసీ అధ్యక్షుడి దృష్టికి తెచ్చారు. ‘టీఆర్ఎస్ను నియంత్రించేందుకు మనకు మద్దతిచ్చేందుకు టీడీపీ సంసిద్ధత తెలిపింది. అయితే నేతల మధ్య కొరవడిన సమన్వయమే ఒకింత ఇబ్బందిగా మారింద’ని అన్నారు. విజయావకాశాలు మెండుగా ఉన్న జిల్లా పరిషత్ సహా మండల పరిషత్‌లను కై వసం చేసుకునేందుకు వ్యూహరచన చేయాలని, ఇతర పార్టీలు, సొంత పార్టీ నేతలను సమన్వయ పరిచే బాధ్యతను మాజీ మంత్రులు జి.చిన్నారెడ్డి, సబితా ఇంద్రారెడ్డికి అప్పగిస్తున్నట్లు పొన్నాల స్పష్టం చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా టీడీపీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబించాలని అన్నారు. ‘దేశం’ నేతలను కలుపుకొనిపోవడం ద్వారా టీఆర్ఎస్ ఎత్తులకు చెక్ పెట్టాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు యాదయ్య, రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, పార్టీ నేతలు నాగయ్య, సుధీర్‌రెడ్డి, కోదండరెడ్డి, క్యామ మల్లేశ్, కూన శ్రీశైలంగౌడ్, కార్తీక్‌రెడ్డి, ఉద్దెమర్రి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల పర్వం
మహబూబ్‌నగర్ అర్బన్/వనపర్తి/ కొల్లాపూర్, న్యూస్‌లైన్: నాలుగోరోజు శనివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పా ర్లమెంట్ స్థానాలు, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలుకాలేదు. స్థానిక అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన శంకర్‌రాథోడ్ బ్యాంకు జీరోఖాతాతో పాటు మరికొన్ని పత్రాలను పూర్తిస్థాయిలో తీసుకురాలేదని సిబ్బంది సూచించడంతో వెనుదిరిగారు. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నామినేషన్ల పర్వం కోలాహలంగా సాగింది. మాజీమంత్రి, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జి.చిన్నారెడ్డి శనివారం వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను సమర్పించారు. మధ్యాహ్నం 2.49గంటలకు ఓ నామినేషన్ సెట్టు, 2.59 గంటలకు మరో సెట్టు నామినేషన్‌ను ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లుకు అందజేశారు. ఎప్పటిలాగే ఆయన నమ్మే ముస్లిం మతగురువు మౌలాలీబాబాను వెంట తెచ్చుకున్నారు. నామినేషన్ వేసి బయటకు రాగానే ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వచనం పొందారు. కొల్లాపూర్ పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఇరగదిండ్ల శ్రీనివాస్ వైఎస్ఆర్ సీపీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌ను పార్టీకి చెందిన యువజన నాయకులు ప్రమోద్ ముది రాజ్ బలపర్చారు. దేవరకద్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దూర్ జగన్మోహన్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మరోసెట్టు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి స్వతంత్య్ర అభ్యర్థిగా చంద్రునాయక్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నారాయణపేట నుంచి టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా నామినేషన్ వేశారు. కొడంగల్ నుంచి టీఆర్ఎస్ తరఫున పున్నంచంద్ లాహోటీ తన నామినేషన్‌పత్రాలు దాఖలుచేశారు. మక్తల్ నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా వర్కటం జగన్నాథ్‌రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండయ్య నామినేషన్ వేశారు.