పాడి బకాయిలు చెల్లించరేం?
• లక్ష కోట్ల బడ్జెట్‌లో ఈ చిన్న మొత్తం ఇవ్వలేరా?: కాంగ్రెస్
• తొమ్మిది నెలలుగా చెల్లించలేదంటూ విమర్శలు
• రాజకీయం చేస్తున్నారని తలసాని మండిపాటు.. కాంగ్రెస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: మూడ్రోజుల విరామం తర్వాత మంగళవారం ప్రారంభమైన శాసనసభ తొలిరోజే వాడివేడిగా సాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాయి. పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ఎంఎన్‌జే ఆస్పత్రిలో రేడియేషన్ పరికరాల కొనుగోలు, భద్రాద్రి రామాలయంలో నగల మాయం అంశాలపై విమర్శలు కురిపించగా... ప్రభుత్వం వాటిని తిప్పికొట్టింది. తొలుత కాంగ్రెస్ సభ్యులు టి.జీవన్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి పాడి బకాయిల అంశాన్ని లేవనెత్తారు. 2016 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.22.59 కోట్ల పాడి ప్రోత్సాహక బకాయిలు పేరుకుపోయాయని, డిసెంబర్ వరకు ఆ మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్‌లో పాడి రైతులకు చెందిన చిన్న మొత్తాలను విడుదల చేయలేదని విమర్శించారు.
ఇందుకు పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బదులిస్తూ.. ఇప్పటికే ఆగస్టు వరకు బకాయిలు చెల్లించామని తెలిపారు. దీనిపై జీవన్‌రెడ్డి ప్రతిస్పందిస్తూ.. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, లిఖిత పూర్వకంగా ఒకలా చెప్పి, సమాధానం మరోలా చెబుతున్నారన్నారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ... అది వాయిదా పడ్డ ప్రశ్న అని, ప్రశ్న తిరిగి వచ్చే సమయానికి బకాయిలు చెల్లింపు చేశామని వివరించారు. దీనిపై జీవన్‌రెడ్డి మళ్లీ మాట్లాడుతూ.. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇందుకు తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం తలసాని కల్పించుకొని.. పాడి రైతులను యాభై ఏళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారనడం, అధికార పక్ష సభ్యులు సైతం మంత్రికి మద్దతుగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. జీవన్‌రెడ్డి మైక్ ఇవ్వాలని కోరినా స్పీకర్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ సభ్యులంతా తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. దీంతో జీవన్‌రెడ్డికి స్పీకర్ మైక్ ఇచ్చారు. అనంతరం తొమ్మిది నెలల బకాయిలపై నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ సభ్యులు బయటకెళ్లిపోయారు.
రేడియేషన్ యంత్రాలపైనా మాటల మంట..
అంతకుముందు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో రేడియేషన్ యంత్రాల కొనుగోళ్లపైనా ఘాటు గా చర్చ జరిగింది. పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, దీనిపై కేంద్ర కమిటీ సైతం నివేదిక ఇచ్చిందని కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిస్తూ.. ఆస్పత్రిలో రాజకీయాలున్నాయని, అందునే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని, దాన్ని పట్టుకొనే ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేస్తున్నారన్నారు. రేడియేషన్ పరికరాల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని చిన్నారెడ్డి దుయ్యబట్టారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. అబద్ధాలు మాట్లాడితే కచ్చితంగా ఎదురుదాడి చేస్తామనడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు.
నగలపై విచారణ ఏమైంది?
భద్రాద్రి రామాలయంలో సీతమ్మ మంగళసూత్రం, లక్ష్మణుడి లాకెట్‌లు మాయమైన ఘటనపై విచారణ ఏమైందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నగలు ఎలా మాయమయ్యాయి? మళ్లీ ఎలా దొరికాయన్న అంశంపై విచారణ ఎక్కడి వరకు వచ్చిందన్నారు. దీనికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందిస్తూ.. మంగళసూత్రం పోలేదని, చిన్నచిన్న ఆభరణాలు మాత్రమే పోయాయని, తర్వాత దొరికాయని వివరించారు. కాగా ఈ నెల 9న ముక్కోటి ఏకాదశి కారణంగా సభకు సెలవు ప్రకటించాలని ఖమ్మం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కోరగా, ప్రతిపక్షాలతో మాట్లాడి దీనిపై నిర్ణయిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
సహకరిస్తే 6 నెలల్లో కాల్వల పనులు: హరీశ్
భూసేకరణ త్వరగా జరిగేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వల ఆధునీకరణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఈ కాల్వల ద్వారా 63,012 ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని, వీటికోసం ఇప్పటికే రూ.284.85 కోట్లు విడుదల చేశామన్నారు.