జీఎస్టీపై ఎవరేమన్నారంటే..
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
‘‘ప్రస్తుతం 14.5 శాతం సేవా పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ 18 శాతం ఉండాలని.. 24 లేదా 25 శాతం దాకా ఉండాలని ప్రతిపాదనలు వస్తున్నా యి. పన్నును భారీగా పెంచితే ప్రజలు ఇబ్బంది పడతారు. జీఎస్టీ 18%గా ఉండాలని 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. 18 శాతమే ఖరారు చేస్తే మంచిది. 2001లో కెనడాలో జీఎస్టీని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓట మిపాలై రెండు ఎంపీ సీట్లకు పరిమితమైంది. దాంతో తర్వాతి ప్రభుత్వాలు జీఎస్టీని 5 శాతానికి మించి పెంచకుండా జాగ్రత్తపడుతున్నాయి. తేనెటీగలు పువ్వులకు నొప్పి కలిగించకుండానే తేనెను స్వీకరించినట్లు ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పన్నులు విధించాలని వేదవ్యాసుడు ఎప్పుడో సూచించాడు.
పన్నులు ప్రజలకు బాధ కలిగించవద్దని 2 వేల ఏళ్ల కిందే గొప్ప ఆర్థికవేత్తగా పేరొందిన చాణక్యుడు చెప్పాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. జీఎస్టీ ద్వారా కార్లు, విలాస వస్తువుల ధరలు తగ్గుతాయంటున్నారు. కానీ ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలి.. ధనికుల కోసం కాదు. పెట్రోల్, డీజిల్ రాష్ట్రాల పరిధిలో ఉంచినందున వాటిపై పన్నులు తగ్గించాలి. మద్యం, సిగరెట్లపై పన్నులు పెంచినా అభ్యంతరం లేదు. మొత్తంగా జీఎస్టీ బిల్లును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం..’’ - జి.చిన్నారెడ్డి, కాంగ్రెస్
ఆర్థిక సంస్కరణల్లో మైలురాయి
‘‘దేశ ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ బిల్లు ఓ మైలురాయి. పన్నుల వసూళ్లలో అవినీతిని అరికట్టడానికి, వినియోగదారులు, ఉత్పత్తిదారులు, వ్యాపారవేత్తలు, ఇతర అన్ని వర్గాలకు.. సామాజిక, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ప్రభుత్వాలకూ ఇది ఉపయోగపడుతుంది. జీఎస్టీతో అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కపెట్టి అన్ని రాజకీయపక్షాలు ముందుకు రావడం అభినందనీయం..’’ - కిషన్‌రెడ్డి, బీజేపీ
చిన్న పరిశ్రమలను కాపాడాలి
‘‘జీఎస్టీతో చిన్న పరిశ్రమల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాలి. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ ధరలు తగ్గేలా చూడాలి. టీడీపీ తరఫున జీఎస్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు జీఎస్టీ కౌన్సిల్‌లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు చోటు కల్పించడం అభినందనీయం..’’ - సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ
తెలంగాణ రాష్ట్రం నష్టపోకుండా చూడాలి
‘‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తే నష్టం జరుగుతుంది. జీఎస్టీతో తెలంగాణకు నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి..’’ - సున్నం రాజయ్య, సీపీఎం
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలి
‘‘రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3.25 శాతం నుంచి 3.5 శాతానికి పెంచే అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. దానికి తక్షణమే కేంద్రం అనుమతిచ్చేలా ఒత్తిడి తేవాలి. జీఎస్టీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం..’’ - మౌజం ఖాన్, ఎంఐఎం
టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు
‘‘దేశ ఆర్థికాభివృద్ధి కోసం రూపొందించిన జీఎస్టీ బిల్లుకు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. జీఎస్టీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుం దని భావిస్తున్నాం..’’ - చెన్నమనేని రమేశ్, వి.శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్