నయా ‘ఆన్‌లైన్‌’ మోసం | Woman complained to cyber police online scam | Sakshi
Sakshi News home page

నయా ‘ఆన్‌లైన్‌’ మోసం

Sep 15 2022 3:57 AM | Updated on Sep 15 2022 4:37 AM

Woman complained to cyber police online scam - Sakshi

దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘హలో సర్‌.. ఆన్‌లైన్‌లో మీరు పెట్టిన ఆర్డర్‌ వచ్చింది. కేవలం రూ.270 చెల్లించండి’ అంటూ విశాఖపట్నం ఉషోదయ జంక్షన్‌లో నివాసముంటున్న ఒక మహిళకు ఫోన్‌ వచ్చింది. ఆర్డర్‌ ఇవ్వలేదని చెప్పినా.. తక్కువ ధరకు ప్రొడక్ట్‌ వచ్చిందని చెప్పడంతో ఆమె కొరియర్‌ను తీసుకున్నారు. డబ్బులు చెల్లించాక కొరియర్‌ను తెరిచి చేస్తే అందులో పాత డ్రెస్‌ ఉంది.

వెంటనే బిల్‌పై ఉన్న కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేయగా.. విషయం చెప్పకముందే ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి మాట్లాడుతూ.. ‘మీ ఐటెమ్‌ను తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారా? మీ ఫోన్‌ నంబర్‌కు లింక్‌ పంపిస్తున్నాం. అది ఓకే చేస్తే అమౌంట్‌ మీకు తిరిగొస్తుంది’ అని చెప్పాడు. అసలు విషయం చెప్పకముందే సదరు వ్యక్తి అలా చెప్పే సరికి ఆమెకు అనుమానం వచ్చింది. లింక్‌ క్లిక్‌ చేస్తే ఫోన్‌ హ్యాక్‌ అవుతుందని భావించి వెంటనే ఆమె సోమవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నగరంలోకి బిహార్‌ గ్యాంగ్‌!
ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, డేటింగ్‌ యాప్‌ల ద్వారా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ లింక్‌లు.. ఇలా అనేక మార్గాల్లో దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఆన్‌లైన్‌ కేటుగాళ్లు ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తరహాలో ఆన్‌లైన్‌ ఆర్డర్, కొరియర్‌ పేరుతో ప్రజలను దోచుకోడానికి కొత్త పంథాను ఎంచుకున్నారు.

బిహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గ్యాంగ్‌ నగరంలోనే తిష్టవేసి.. ఆన్‌లైన్‌లో ఆర్డర్స్‌ పేరుతో బుక్‌ చేసుకోకపోయినా ఫోన్లు చేసి కొరియర్‌ను అందిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు విశాఖ నగరంలో ఒక ప్లాట్‌లో ఉంటున్న ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉందని.. ఈ ఆరుగురికి కొరియర్‌ మోసాలతో సంబంధం ఉందో, లేదో విచారణలో తేలుతుందని అంటున్నారు. 

కొరియర్‌లో పనికిరాని వస్తువులు
కొరియర్‌ను తెరిచి చూస్తే అందులో వాడేసిన బట్టలు, పగిలిపోయిన చిన్న చిన్న వస్తువులు ఉంటున్నాయి. ఇటువంటివి డెలివరీ అయితే డబ్బులు చెల్లించిన వారు తప్పకుండా కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేయడం సర్వసాధారణం. ఆ గ్యాంగ్‌కు కావాల్సింది కూడా ఇదే. అలా కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసిన వెంటనే.. ఎటువంటి సమాచారం అడగకుండానే.. ‘మీ ఆర్డర్‌ను రిటర్న్‌ ఇచ్చేస్తున్నారా? మీకు లింక్‌ పంపిస్తాం.

దాన్ని క్లిక్‌ చేస్తే మీ డబ్బులు రిఫండ్‌ అయిపోతాయి’ అని సమాధానమిస్తున్నారు. ఒకవేళ ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే బ్యాంక్‌ ఖాతా ఖాళీ అయిపోతుంది. ఆన్‌లైన్‌ మోసాలతో పాటు ఆర్డర్‌ చేయకుండా వచ్చే కొరియర్ల విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ భవానీ ప్రసాద్‌ సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement