
ఎన్నాళ్లీ..అమావాస్య
- మెరుపువేగంతో పనిచేసినా వెన్నాడుతున్న కరెంటు కష్టాలు
- విశాఖ వన్‌టౌన్‌లో మెరుగైన పరిస్థితి
- గ్రామీణ జిల్లాలో ఘోరం
విశాఖపట్నం సిటీ : దీపావళి వేళ కూడా విశాఖ నగరంతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం రాత్రికి ఇంకా వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదు. జిల్లాలో పరిస్థితి మరీ ఘోరం గా వుంది. గిరిజన మైదాన ప్రాంతాల్లోనూ చీకట్లే రాజ్యమేలుతున్నాయి. పది శాతం కూడా విద్యుత్ దీపాలు వెలగడం లేదు. నత్తనడకన పునరుద్ధరణ పనులతో మండల కేంద్రాలు కూడా ఇంకా చీకట్లోనే ఉన్నాయి.
హుదూద్ బీభత్సం తర్వాత విద్యుత్ శాఖ మెరుపు వేగంతో పునరుద్ధరణ చేపట్టింది. విశాఖలో 6.78 సర్వీసులకు గత బుధవారం నుంచీ విద్యుత్ సరఫరా బాధ్యతను ఏపీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్ సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పటివరకూ 6.19 లక్షల వినియోగదారులకు విద్యుత్‌ను అందించగలిగారు. వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన విద్యుత్ జోన్-1 డివిజన్‌లో 2.29 కనెక్షన్లకు వెయ్యింటికి మినహా అన్నింటికీ సరఫరా ఇచ్చారు.
ఈ డివిజన్‌లో వెయ్యి ఇళ్లల్లో కరెంట్ కాంతులు నెలాఖరు వరకూ కనిపించే అవకాశాలు లేవు. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు వుండే అవకాశం వుంది. ఇప్పటికే 12 రోజులుగా విద్యుత్ లేని వీరంతా ఆందోళన చెందుతున్నారు. దీపావళి పండుగ పూటా అంధకారంలో మగ్గాల్సిందేనా అని కలవరపడుతున్నారు.