Current difficulties
-
రబీ గయా..
గణనీయంగా తగ్గిన రబీ సాగు 81657 హెక్టార్ల భూములు బీళ్లు 9 మీటర్ల లోతులో భూగర్భజలం వెంటాడుతున్న కరెంట్ కష్టాలు ఆరుతడి పంటలకూ కష్టకాలం పెట్టుబడులు రాని గడ్డు పరిస్థితి జిల్లాలో రబీ రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటివనరులు వట్టిపోయి భూగర్భజాలు అడు గంటాయి. బావుల్లో నీళ్లున్నా.. కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలు పంటల సాగుకు ప్రతిబంధకంగా మారాయి. వెరసి జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దాదాపు 81,657 హెక్టార్ల సాగు భూములు బీడువోతున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే లక్ష హెక్టార్లు సాగు విస్తీర్ణం తగ్గడం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను కళ్లకు కడుతోంది. - కరీంనగర్ అగ్రికల్చర్ కరీంనగర్ అగ్రికల్చర్ : రబీ సీజన్ ప్రారంభమై నాలుగు నెలలవుతోంది. జిల్లాలో బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల ఆధారంగా రబీ పంటలు సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీరు ఇవ్వలేమని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని నీటిపారుదల, వ్యవసాయ అధికారులు సూచించినప్పటికీ పలువురు రైతులు బోర్లు, బావులను నమ్ముకొని వరిసాగు చేపట్టారు. జిల్లాకు ప్రధాన సాగునీటి వనరు అయిన ఎస్సారెస్పీ నుంచి పంటలకు నీరివ్వలేమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. జిల్లాలోని దిగువ మానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టులతో పాటు శనిగరం, బొగ్గులవాగు తదితర చిన్నతరహా జలాశాలు, చెరువులు, కుంటల్లో నీటిమట్టం అడుగంటింది. ఈ నేపథ్యంలో సాగునీరు, కరెంటు కొరతతో పంటల సాగు గణనీయంగా తగ్గింది. రబీలో సాధారణ విస్తీర్ణం 2.38 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 1.64 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది రబీ సీజన్లో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ చేసిన ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించలేదు. వరి సాగును వేసుకోకుండా ప్రత్యామ్నాయంగా ఆరుతడిని ప్రోత్సహించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఆరుతడి పంటల కోసం రూ.2.15 కోట్లతో 10,461 క్వింటాళ్ల ఆరుతడి విత్తనాలను రైతులకు 50 శాతం రాయితీపై సరఫరా చేసినట్లు చెబుతున్నా మండలస్థాయిలో ఎక్కువ మొత్తంలో మిగిలిపోయాయి. సాధారణ విస్తీర్ణం 1.55 హెక్టార్లకు 78 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. వరి తర్వాత రైతులు మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. 56,004 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఇతర పంటల సాగు నామమాత్రమే. పాతాళంలో జలం గతేడాది 32శాతం అధిక వర్షపాతం ఉంటే.. ఈ ఏడాది 32 శాతం లోటు ఏర్పడడం అన్నదాతలకు శాపంగా మారింది. జిల్లాలోని 57 మండలాల్లో ఎనిమిది మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. బోయినపల్లి మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో భూగర్భజలాలు గతేడాదికంటే సగటున 9మీటర్ల లోతుకు పడిపోయాయి. మెట్టప్రాంతమైన వేములవాడలో 18.17 మీటర్ల లోతుకు దిగజారాయి. బోయినపల్లిలో 14.07, ఎల్లారెడ్డిపేట 17.89, చిగురుమామిడి 15.79, గంగాధర 16.91, కొడిమ్యాల 14.65, మల్యాల 13.45, సైదాపూర్ 11.73, హుస్నాబాద్‌లో 11.71, తిమ్మాపూర్‌లో 11.46, చొప్పదండిలో 11.43, బెజ్జంకి11.01, కోనరావుపేటలో 12.97, గంభీరావుపేటలో 11.81, మహదేవపూర్‌లో 11.55 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. కరెంటు కట్‌కట.. కరెంటు కొరతకు తోడు అనధికార కోతలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జిల్లాలో ట్రాన్స్‌కో పరిధిలో 2.85 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. వీటికి 795 ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి రోజుకు 7గంటలు బదులు 6గంటల విద్యుత్‌ను విడతలవారీగా కాకుండా నిరంతరంగా సరఫరా చేస్తున్నారు. నిరంతరంగా సరఫరా చేయడం వల్ల బావుల్లో ఊట తగ్గుతోంది. బావుల్లో 4గంటల విద్యుత్‌కు కూడా నీళ్లు సరిపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం తగ్గడంతో కోటా కుదించి కరెంటు కోతలు విధిస్తున్నారు. వినియోగం పెరుగుతుండడంతో కోటా దాటుతోందనే కారణంతో అనధికారికంగా మరో రెండు గంటల పాటు కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో నెలవారీ కోటా 239.070 మిలియన్ యూనిట్లు కేటాయించారు. ప్రతిరోజు 7.969 మిలియన్ యూనిట్లకు ప్రస్తుతం 10 మిలియన్ యూనిట్లు వినియోగమవుతుండడంతో కోటా దాటుతోందని విద్యుత్ అధికారులు కోతలకు దిగుతున్నారు. -
సమస్యలు తీరేనా?
జిల్లాలోని పేద రోగులకు అనంతపురం సర్వజనాస్పత్రే పెద్దదిక్కు. వేలకు వేలు వెచ్చించి ప్రైవేటు వైద్యం చేయించుకోలేని వారు ఈ ఆస్పత్రినే నమ్ముకుంటున్నారు. నిత్యం వందలాది మంది ఇక్కడికొచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. సిబ్బంది, పడకల కొరత, కరెటు కష్టాలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. చాలా సమస్యలు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. వాటిని పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశాల్లో చర్చించడం మినహా శాశ్వత పరిష్కారాన్ని చూపడం లేదు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అధ్యక్షతన జరిగే సమావేశంలోనైనా తగిన పరిష్కారం లభిస్తుందేమోనని ప్రజలు వేచిచూస్తున్నారు. ఈ సమావేశం కోసం పది అంశాలతో అజెండా సిద్ధం చేశారు. కనీసం మూడింటిని నెరవేర్చినా కాస్త ఊరట లభిస్తుందని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. కలగా 124 జీఓ నాలుగేళ్ల క్రితం 124 జీఓ విడుదలైంది. అప్పటి నుంచి జీఓ ఆచరణ అంగులం కూడా ముందుకు కదల్లేదు. ఆస్పత్రిలో ప్రధానంగా నెలకొన్న సమస్యలు జీఓ అమలుతో తీరుతాయని యాజమాన్యం గొంతెత్తి చెబుతున్నా...పాలక వర్గం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అమలు జరిగితే సిబ్బంది కొరత తీరి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతాయి. ఇందులోని 510 పోస్టుల్లో 134 స్టాఫ్‌నర్సు పోస్టులుకాగా, మిగితావి పారామెడికల్ పోస్టులు. ఈ పోస్టుల భర్తీ జరిగితే పేద ప్రజలకు వైద్యం ఆలస్యం కాదు. అటువంటిది ఈ జీఓ కలగానే మిగులుతోంది. కరెంటు కష్టాలు.. ఇటీవల ఆస్పత్రిని కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. తరచూ విద్యుత్ సమస్యలతో రోగులు అల్లాడిపోతున్నారు. వెంటిలేటర్లపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల పరిస్థితి అంతా ఇంతా కాదు. కరెంటు తరచూ షార్ట సర్క్యూట్ గురికావడంతో ఏకంగా ఆర్థో ఓటీ థియేటర్‌నే మూసేశారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రం ఎదురుగా ఉన్న ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు కాలిపోయింది. ఫలితంగా గైనిక్, చిన్నపిల్లల విభాగం, రేడియాలజీ విభాగంలో కరెంటు లేకుండా పోయింది. కరెంటు సరఫరాకి ఆటంకం కల్గకుండా శాశ్వత పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుతం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు మాత్రమే ఉన్నారు. షాట్ సర్క్యూట్‌తో రోగులు ప్రాణాలకే ప్రమాదం లేకపోలేదు. దీనిని ఏవిధంగా గట్టెక్కుతారో చూడాలి. మరమ్మతుకి నోచుకోని టాయిలెట్స్ ఆస్పత్రిలోని నాలుగు వార్డులలో టాయిలెట్స్ మరమ్మతుకు నోచుకోవడం లేదు. 23 మరుగుదొడ్లు అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. దీంతో వాటికి తాళం వేశారు. రోగులు, వారి సహాయకులు సులభ్ కాంప్లెక్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆస్పత్రికి అధిక సంఖ్యలో పేద వారే వస్తుంటారు. అటువంటిది వారికి కనీస సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. స్వచ్చభారత్ పేరిటి అన్ని చోట్ల పనులు చేస్తున్నారు కానీ, ఆస్పత్రిలో మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. 500 పడకలు 700 రోగులు ఆస్పత్రిని ప్రధానంగా పీడిస్తున్న సమస్యల్లో పడకల కొరత ఒకటి. 500 పడకల సామర్థ్యం కల్గిన ఆస్పత్రిలో 700 మంది ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. వీరికి అడ్మిషన్ ఇస్తున్నారు కానీ మంచాలు మాత్రం చూపడం లేదు. దీంతో చాలా మంది రోగులు కటిక నేలపై పడుకున్న సందర్భాలు కోకొల్లలు. బాలింతలు, గర్భిణీలు నేలపై పడుకుని నానా అవస్థలు పడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తే తప్ప రోగుల కష్టాలు తీరవని చెబుతున్నారు. వైద్య సేవల్లో జాప్యం జరుగుతుండడంతో రోగులు ప్రైవేట్ బాట పడుతున్నారు. ఏదిఏమైనా ఈ హెచ్‌డీఎస్ సమావేశంలోనైనా...ఆస్పత్రి మెరుగుపడుతుందో లేదో వేచి చూద్దాం. నిద్రమత్తులో ఏపీఎంఎస్‌ఐడీ అధికారులు ఆస్పత్రిలో ఏ పనులు చేయాలన్నా ఏపీఎంఎస్ఐడీసీ అధికారులే చేయాలి. అటువంటిది వీరు ఏమాత్రం ముందడుగు వేయడం లేదు. కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడిన అనేక సందర్భాలున్నా స్పందించడం లేదు. ఊరు బయట తమ కార్యాలయం ఉందని తప్పించుకుని తిరుగుతున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. ఆస్పత్రిని డీఈ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అలాంటిది ఎవరూ పట్టించుకోవడం లేదు. వీరి కింది స్థాయి సిబ్బంది డీఎంహెచ్ఓ కార్యాలయం పక్కన ఉన్న టీ కొట్టులో మాత్రం దర్శనమిస్తుంటారు. కరెంటు కాలిపోతోందంటే అటువైపు తొంగి చూడని అధికారులు పిచ్చాపాటి మాట్లాడుకునేందుకు వస్తున్నారు. ఈ శాఖ నిద్రమత్తులో ఉందని వీరిని మేలుకొలిపేలా జిల్లా కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
చంద్రబాబు కుట్ర వల్లే కరెంట్ కష్టాలు
పిట్టలగూడెం (గుర్రంపోడు) : టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పన్నుతున్న కుట్ర వల్లే తెలంగాణలో కరెంట్ కష్టాలు దాపురిం చాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పిట్టలగూడెం గ్రామంలో రూ.కోటిన్నర నిధులతో నిర్మించిన 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి చేస్తున్న కుట్రను తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ ప్రాంతంతో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిం చకుండా ఇక్కడి బొగ్గుతో అక్కడ కరెంట్ ఉత్పత్తి చేసిన గత పాలకుల పాపం వల్లే రైతులకు నేడు కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఆంధ్రా విద్యార్థులకు పదేళ్లపా టు ఇక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇదే చట్టంలో పేర్కొన్న మాదిరిగా ఏపీ సర్కార్ నుంచి 54 శాతం కరెంట్ మన రాష్ట్రానికి రావాల్సి ఉన్నా చంద్రబాబు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో కరెంట్ కొరత ఉన్నా ఎకరం పొలాన్ని కూడా ఎండిపోకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఎంత ఖరీదైనా కాని కరెంట్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు తొత్తులుగా మాట్లాడుతున్న ఇక్కడి నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, జెడ్పీ మాజీ చైర్మన్ చింతారెడ్డి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మరెడ్డి రఘుమారెడ్డి, పల్లె ప్రవీణ్‌రెడ్డి, సర్పంచ్ పోలె సుజాత, అధికారులు పాల్గొన్నారు. -
పంటనష్టం గణనకు విద్యుత్ కష్టాలు
గడువు ముగిసినా సిద్ధం కాని జాబితా విద్యుత్ లేక వ్యవసాయ కార్యాలయంలో అవస్థలు నష్టం వివరాలను ఆన్లైన్లో పొందుపరచలేని పరిస్థితి విద్యుత్ వస్తేనే ప్రభుత్వానికి నివేదిక పంట నష్టం గణనకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. రైతులకే కాదు..వ్యవసాయ శాఖాధికారులనూ విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. మైదానంలో ఎన్యూమరేషన్ పూర్తయినప్పటికీ.. ఆ వివరాలు ఆన్లైన్లో పొందుపరచలేని పరిస్థితి. దీంతో పంట నష్టం జాబితా రూపకల్పనకు జాప్యం జరుగుతోంది. వ్యవసాయ శాఖ కార్యాలయానికి విద్యుత్ పునరుద్ధరణ జరిగితేగాని జాబితాను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం లేదని అధికారులే పేర్కొంటున్నారు. విశాఖ రూరల్: హుదూద్‌కు జిల్లాలో ఆహార పంటలు 62,709 హెక్టార్లలోను, ఉద్యాన పంటలు 51,688 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆహార పంటల ఎన్యూమరేషన్ కోసం పది రోజుల క్రితం 145 బృందాలు, హార్టికల్చర్‌కు 53 టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఉద్యాన పంటలకు సంబంధించి ఈ బృందాల సంఖ్య సరిపోకపోవడంతో ఇతర జిల్లా నుంచి అధికారులను రప్పించి మరో 37 టీమ్‌లు వేశారు. గత నెల 31వ తేదీకి ఎన్యూమరేషన్ పూర్తి చేయాని అధికారులు నిర్ణయించారు. అయితే అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వర కు మైదానంలోని ఏడు వ్యవసాయ డివిజన్లలో క్షేత్ర స్థాయిలో పంట నష్టం గణన పూర్తయింది. ఏజె న్సీలో 11 మండలాల్లో పూర్తికి మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ కష్టాలు నష్టం వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం అంచనా బృందాలకు ట్యాబ్లెట్లను కూడా అందజేసింది. తుపానుకు సమాచార వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక ఇంటర్నెట్ పూర్తిగా పడకేసింది. ఫలితంగా నష్టం వివరాలను ట్యాబ్లెట్ల ద్వారా ఆన్లైన్లో పొందుపర్చలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం ఆఫ్‌లైన్‌లో జాబితాను సిద్ధం చేయడానికి కూడా విద్యుత్ కూడా లేకపోవడంతో బృందాలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. కనీసం ఆ వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి తీసుకువచ్చి ఇక్కడ అప్లోడ్ చేద్దామన్నా అవకాశం లేకుండా పోతోంది. వ్యవసాయ శాఖ కార్యాలయానికి కూడా విద్యుత్ లేదు. అత్యవసర కార్యకలాపాలకు మాత్రం జనరేటర్‌ను గంట పాటు వినియోగిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం ఉన్న మండల కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌లో జాబితాను రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నప్పటికీ అక్కడ కూడా విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో నష్టం జాబితా సిద్ధమైనా ప్రభుత్వానికి నివేదించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రైతులకు పరిహారం మంజూరుకు మరింత జాప్యం జరగనుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టిసారించకుంటే అంచనాల జాబితా రూపకల్పన ఇప్పట్లో పూర్తయ్యే అవకాశముండదు. -
విద్యుత్ కష్టాలకు బాబే కారణం
రఘునాథపల్లి : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కష్టాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రఘునాథపల్లి మండలంలోని శ్రీమన్నారాయణపురంలో శనివారం ఆయన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యమ నేత కాసం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలు ఎలాం టి స్ఫూర్తి చూపారో... అభివృద్ధిలో ముం దుకు సాగకుండా అడ్డుకుంటున్న శక్తులపైనా అదే స్ఫూర్తి చాటాలన్నారు. తెలంగాణ అమరవీరుల రుణం తీర్చుకోనిదని, వారి కుటుంబాలకు ఎంత చేసినా తక్కువేనన్నారు. అమరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారంతో పాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఉద్ఘాటిం చారు. అమరులెందరున్నా... ఆదుకుంటామన్నారు. అమరుల జ్ఙాపకార్థం స్థూపం నిర్మించిన సత్యనారాయణ, చింత స్వామి అభినందనీయులన్నారు. డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ప్రజ ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నారన్నారు. అనంతరం మంత్రులను టీఆర్ఎస్ నేతలు గజమాలతో సత్కరించారు. సమావేశంలో ఎంపీ కడియం శ్రీహరి, జిల్లాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, జనగామ, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, వినయ్‌బాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్‌నాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, రాజలింగం, జనగామ మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఎంపీపీ దాసరి అనిత, జెడ్పీటీసీ సభ్యులు బానోతు శారద, రంజిత్‌రెడ్డి, సర్పంచ్ మాచర్ల సోమలక్ష్మి, నాయకులు గొరిగ రవి, నామాల బుచ్చయ్య, మారుజోడు రాంబాబు, గోపాల్‌నాయక్, దాసరి బుగ్గయ్య, శేరి లక్ష్మారెడ్డి, గైని శ్రీనివాస్ పాల్గొన్నారు. -
తక్షణం రైతులను ఆదుకోవాలి
ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ డిమాండ్ హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, విద్యుత్ కష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంక్షోభంలో ఉన్న తెలంగాణకు విద్యుత్ ఇచ్చి ఆదుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు రాలేదని, విద్యుత్ ఇప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని రాజకీయ లబ్ధికోసం ప్రయత్నిస్తున్నారే తప్ప.. సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని విమర్శించింది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడాన్ని నివారించేందుకు పార్టీపరంగా వ్యూహాన్ని రూపొందించాలని నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్మ కిష్టారెడ్డి, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాష్, జనక్ ప్రసాద్, గట్టు రామచంద్రరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, హెచ్ఏ రెహ్మాన్ పాల్గొన్నారు. ఆదుకోకపోవడం దురదృష్టకరం:పొంగులేటి విద్యుత్ కష్టాల్లో ఉన్న తెలంగాణను కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఆదుకోకపోవడం దురదృష్టకరమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కృష్ణా బేసిన్ నీటిని విద్యుత్ కోసం -
ఎన్నాళ్లీ..అమావాస్య
మెరుపువేగంతో పనిచేసినా వెన్నాడుతున్న కరెంటు కష్టాలు విశాఖ వన్‌టౌన్‌లో మెరుగైన పరిస్థితి గ్రామీణ జిల్లాలో ఘోరం విశాఖపట్నం సిటీ : దీపావళి వేళ కూడా విశాఖ నగరంతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం రాత్రికి ఇంకా వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదు. జిల్లాలో పరిస్థితి మరీ ఘోరం గా వుంది. గిరిజన మైదాన ప్రాంతాల్లోనూ చీకట్లే రాజ్యమేలుతున్నాయి. పది శాతం కూడా విద్యుత్ దీపాలు వెలగడం లేదు. నత్తనడకన పునరుద్ధరణ పనులతో మండల కేంద్రాలు కూడా ఇంకా చీకట్లోనే ఉన్నాయి. హుదూద్ బీభత్సం తర్వాత విద్యుత్ శాఖ మెరుపు వేగంతో పునరుద్ధరణ చేపట్టింది. విశాఖలో 6.78 సర్వీసులకు గత బుధవారం నుంచీ విద్యుత్ సరఫరా బాధ్యతను ఏపీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్ సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పటివరకూ 6.19 లక్షల వినియోగదారులకు విద్యుత్‌ను అందించగలిగారు. వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన విద్యుత్ జోన్-1 డివిజన్లో 2.29 కనెక్షన్లకు వెయ్యింటికి మినహా అన్నింటికీ సరఫరా ఇచ్చారు. ఈ డివిజన్లో వెయ్యి ఇళ్లల్లో కరెంట్ కాంతులు నెలాఖరు వరకూ కనిపించే అవకాశాలు లేవు. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు వుండే అవకాశం వుంది. ఇప్పటికే 12 రోజులుగా విద్యుత్ లేని వీరంతా ఆందోళన చెందుతున్నారు. దీపావళి పండుగ పూటా అంధకారంలో మగ్గాల్సిందేనా అని కలవరపడుతున్నారు. -
కడతేరని విద్యుత్ కష్టాలు
శ్రీకాకుళం:జిల్లాలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు కలుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి శ్రీకాకుళం పట్టణానికి విద్యుత్ సరఫరా కాగా ఇప్పటి వరకు పట్టణం అంతటికీ కాకుండా కొన్ని ప్రాంతాలకు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. ఆయా ప్రాంతాలకు కూడా తరచూ సరఫరా నిలిచిపోతోంది. మరమ్మతులు చేసి తిరిగి సరఫరా చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. జిల్లాకు తక్కువగా విద్యుత్ సరఫరా అవుతున్నట్టు సమాచారం. జిల్లాకు 50 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారు. ఇందులో శ్రీకాకుళం పట్టణానికే 30 మెగావాట్లు సరిపోతోంది. శనివారం వరకు శ్రీకాకుళం పట్టణానికి మాత్రమే విద్యుత్ సరఫ రా ఉండడం వల్ల సమస్య తలెత్తలేదు. శనివారం మధ్యాహ్నం నుంచి అన్ని మున్సిపాలిటీలకు, కొన్ని మండల కేంద్రాలకు సరఫరా పునరుద్ధరించడంతో లోడ్ పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా లోడ్‌రిలీఫ్ పేరిట శ్రీకాకుళం పట్టణానికి సాయంత్రం నుంచి సుమారు ఐదు గంటల పాటు సరఫరా నిలిపివేశారు. ఎప్పటికి పునరుద్ధరిస్తారో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే జిల్లాలోని పంచాయతీలన్నీ ఇప్పటికీ అంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యుత్ సరఫరా అవుతున్న ప్రాంతాల్లో ఇన్వర్టర్లు చార్జ్ అవుతుండడం, మోటార్లు విపరీతంగా వినియోగిస్తుండడంతో కరెం ట్ కొరత ఏర్పడుతోంది. ఈ కారణం గా మరో రెండు, మూడు రోజులు గ్రామస్థాయికి కరెంట్ సరఫరా సాధ్యం కాకపోవచ్చని విద్యుత్‌శాఖలోని దిగువ స్థాయి సిబ్బందే అభిప్రాయపడుతున్నారు. అలాగే పట్టణంలో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిరాటంకంగా చేయలేక పోవడానికి కారణం సిబ్బంది కొరత కారణమని తెలిసిం ది. మొత్తం మీద జిల్లా ప్రజలకు విద్యు త్ సమస్య ఇప్పట్లో తీరేటట్లు కన్పించడం లేదు. కాగా కొందరు ప్రజాప్రతినిధులు తమ ప్రాంతానికే ముందుగా సరఫరాను పునరుద్ధరించాలని తెస్తున్న ఒత్తిడి వల్ల మరమ్మతులపై దృష్టి సారించలేకపోతున్నట్టు ట్రాన్స్‌కో సిబ్బందే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. -
సింహాద్రి విద్యుత్ రాకనే ఇక్కట్లు
త్వరలోనే సర్దుకుంటుంది: సీఎం కేసీఆర్ గతంలో కంటే 32.54 శాతం డిమాండ్ పెరిగింది తుపాను కారణంగా విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గింది జల విద్యుత్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడి హైదరాబాద్: తుపాను కారణంగా విశాఖపట్నంలోని రెండు వేల మెగావాట్ల సింహాద్రి విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన ఆగిపోవడంతో తెలంగాణకు విద్యుత్ ఇబ్బందులు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోవడం మరింత ఇబ్బందికరంగా మారిందని ఆయన చెప్పారు. విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో గురువారం సమీక్షించారు. గత ఏడాది కంటే ఈ సారి విద్యుత్ డిమాండ్ 32.54 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. 143 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఇదే సమయంలో డిమాండ్ 126 మిలి యన్ యూనిట్లు ఉంటే.. 122 మిలియన్ యూనిట్లు సరఫరా చేశారని తెలిపారు. తుపాను రావడానికి ముందు 10 నుంచి 16 మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేసేవారమని.. కానీ తుపాను కారణంగా జైపూర్-గాజువాక లైనులో అంతరాయం ఏర్పడిందని చెప్పారు. దీంతో విద్యుత్ ఎక్కువగా కొనుగోలు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్పందిస్తూ.. జల విద్యుత్ ఉత్పత్తిని సాధ్యమైనంత మేరకు పెంచి, పంటలను ఆదుకునే యత్నం చేస్తున్నామని చెప్పారు. సింహాద్రి ప్రాజెక్టులో గురువారం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని, మిగతా ఉత్పత్తి ప్రారంభమైతే పరిస్థితి మెరుగుపడుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధరతో సంబంధం లేకుండా ఎక్కడ విద్యుత్ లభిస్తే.. అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా ఇస్తే.. తెలంగాణలో వ్యవసాయానికి మరికొంత విద్యుత్ ఇవ్వడం సాధ్యమవుతుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. పక్కా ప్రణాళికతో వెళుతున్నాం.. ►తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని మెరుగుపర్చడానికి పక్కాగా స్పల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళిక లతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన పలు వివరాలు.. ► 2015 మే 9వ తేదీ నుంచి పెన్నా, థర్మల్ పవర్‌టెక్, శ్రీ సిమెంట్స్ సంస్థల నుంచి రెండు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ► 500 మెగావాట్ల సౌర విద్యుత్ కోసం టెండర్లు పిలిస్తే.. అనూహ్య స్పందన వచ్చింది. ఈ ప్లాంట్ల ఏర్పాటు నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ► 2015 మే నుంచి పది సంస్థలు విద్యుత్ సరఫరా చేయడానికి ముందుకు వచ్చాయి. వాటి తో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ► తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా పవర్ ఎక్స్ఛేంజీ నుంచి 539 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రూ. 310 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశాం. ► ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లను ఈఆర్సీ నిర్ణయించిన ధర మేరకు కొనుగోలు చేస్తాం. అయితే ఆ లైను అందుబాటులోకి వచ్చిన తరువాతే ఇది సాధ్యమవుతుంది. ► జెన్కో నుంచి 6వేల మెగావాట్లు, ఎన్టీపీసీ నుంచి 4వేల మెగావాట్ల సామర్థ్యమున్న వి ద్యుత్ప్లాంట్లు భవిష్యత్‌లో నెలకొల్పనున్నాం. -
కరెంట్ పాపం మీది కాదా..?
ఖమ్మం: ‘మిస్టర్ చంద్రబాబునాయుడు...పొన్నాల లక్ష్మయ్య... తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కరెంట్ కష్టాలు పడుతున్నారంటే మీ పాపం కాదా..? బొగ్గు సమృద్ధిగా ఉండే ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలను వదిలేసి, మీ స్వార్థం కోసం తట్టెడు బొగ్గులేని విజయవాడ, సింహాద్రి, రాయలసీమ ప్రాంతాల్లో థర్మల్‌పవర్ స్టేషన్లు నిర్మించింది మీరూ.. మీ ప్రభుత్వాలు కాదా..? దమ్మూదైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి... నేను నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తా..’ అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు సవాల్ విసిరారు. ఖమ్మం నియోజకవర్గంలోని రిక్కాబజార్, నయాబజార్, శాంతినగర్, రఘునాథపాలెం మండలం మంచుకొండ ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 1.6 కోట్లతో నిర్మించే అదనపు తరగతి గదులకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఖమ్మం నయాబజార్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి ప్రసంగించారు. విద్యుత్ సమస్యతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో బొగ్గు ఉన్నా విద్యుత్ ప్రాజెక్టులు ఇక్కడ పెట్టలేదన్నారు. అప్పుడు మౌనంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. ప్రాజెక్టులు అన్ని ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి కాబట్టే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. జిల్లాలోని మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 2017 నాటికి కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మిగులు విద్యుత్ ఉత్పత్తి అయ్యేవరకు కష్టాలు తప్పవన్నారు. 1964లో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వ పనులు నేటికీ కొనసాగుతున్నాయన్నారు. చుక్కనీరు రాక కాల్వల్లో తుమ్మలు మొలిచాయన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు తనకు రెండుకళ్లలాంటి వారని చెప్పే చంద్రబాబుకు తెలంగాణలో కరెంట్ కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతివిద్యార్థి గర్వపడేలా చేస్తామన్నారు. బడ్జెట్లో విద్యకోసం వెచ్చించే డబ్బులు ఖర్చు కింద జమ చేయకుండా విలువైన మాన వ వనరులను వెలికితీసే పెట్టుబడిగా భావిస్తామన్నారు. పెన్షన్ పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్స్‌పై కేబినెట్ సమావేశాల్లో చర్చించామన్నారు. అదే చంద్రబాబు అధికారంలో ఉంటే భార్యభర్తల మధ్య కూడా కాంట్రాక్టు విధానం ప్రవేశపెట్టేవారని ఎద్దేవా చేశారు. * టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందనే నమ్మకం ఉందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సమగ్రకుటుంబ సర్వే నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించటంపై పలు అనుమానాలు నెలకొన్నాయన్నారు. రేషన్‌కార్డులు, పెన్షన్లు కోతపెడతారని ప్రజలు భయపడుతున్నారన్నారు. వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ సమస్యతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. * తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నాయకులు బస్సుయాత్రలు చేస్తున్నారని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ విమర్శించారు. వారి దగాకోరు మాటలు వినిమోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలంబరితి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్వీఎం పీవో శ్రీనివాస్, ఈడబ్ల్యూఐసీ ఈఈ రఘురామరాజు, అర్బన్ ఎంఈవో శ్రీనివాస్, రఘునాథపాలెం ఎంపీపీ, జడ్పీటీసీ, పాఠశాలల హెచ్ఎంలు, విద్యాకమిటీ చైర్మన్లు, వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ తోట రామారావు, నాయకులు బొర్రా రాజశేఖర్, సూతగాని జయపాల్, టీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, దిండిగల రాజేందర్ పాల్గొన్నారు. -
విద్యుత్ వ్యవస్త అస్తవ్యస్తం
పలాస: తుపాను ప్రభావంతో పలాస విద్యుత్ సబస్టేషన్ పరిధిలోని పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలతో పాటు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో విద్యుత్ కష్టాలు ఇంకా తీరలేదు. తుపాను ఫలితంగా స్తంభాలు కూలిపోవడం, తీగలు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పాడవడం వంటి చర్యలతో విద్యుత్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. శనివారం అర్థరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు పలు గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. పట్టణంలో కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పునరుద్ధరణ చర్యలు నామమాత్రంగా చేపడుతున్నారు. పలాస సబ్‌డివిజన్‌లో మొత్తం 120 స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ వైర్లు ఎక్కడికక్కడే తెగి రోడ్లపైనే కనిపిస్తున్నాయి. 30 మంది సిబ్బంది ఉండగా శ్రీకాకుళం నుంచి అదనంగా 80 మందిని తీసుకొచ్చారు. వీరంతా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని ఏడీఈ ఏవీ రామారావు చెప్పారు. అయితే ఫలితం మాత్రం కనిపించడం లేదు. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తారనేది కూడా చెప్పలేకపోతున్నారు. రాత్రంతా జాగారమే... పలాస రూరల్: కంబిరిగాం జంక్షన్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ వరదనీటితో నిండిపోయింది. అలాగే కంబిరిగాం జంక్షన్ నుంచి పలాసకు వెళ్లే రహదారిలో రోడ్డుపై నుంచి వరదనీరు ప్రవహించింది. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులకు పలాస మండలంలోని గ్రామీణ ప్రాంతాలు అంధకారంగా తయారయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్నలు, పెద్దలు, వృద్ధులు రాత్రి సమయాల్లో నిద్రపోయేందుకు నానా అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రాత్రి నిద్రలేకుండా జాగారాలు ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణతర్లా, బంజీరుపేట తదితర ప్రాంతాల్లో కూలిన విద్యుత్ స్తంభాలను విద్యుత్ అధికారులు సరిచేశారు. శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు కవిటి: మండలంలో తుపాను ధాటికి అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు సోమవారం శరవేగంగా చేపట్టారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను మార్చడం, తీగలను బిగించడం వంటి పనులను స్థానికుల సాయంతో చేపడుతున్నారు. తుపాను దెబ్బకు విద్యుత్ కష్టాలు టెక్కలి: అతలాకుతలం చేసిన తుపాను దెబ్బకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సోమవారం నాటికి విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. దీంతో పట్టణంతో పాటు గ్రామాలన్నీ అంధకారంలో కొట్టిమిట్టాడుతున్నాయి. తొలుసూరుపల్లిలో రహదారికి అడ్డంగా భారీ మర్రిచెట్టు వేళ్లతో సహా కూలిపోయింది. వీటితో పాటు అదే గ్రామంలో 3 విద్యుత్ స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా చెరువులో పడిపోయింది. రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడం, మోటార్లు పనిచేయకపోవడంతో ప్రజలు నీటి కోసం అనేక అవస్థలు పడ్డారు. అంధకారంలో గ్రామాలు జి.సిగడాం: హూదూద్ బీభత్సంతో మండలంలో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పొగిరి, మర్రివలస, టిడివలస, మండాకురిటి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిద్దాం, పాలకండ్యాం ప్రధాన రహదారుల కొట్టుకుపోయాయి. యువకులు, విద్యార్ధులు, స్వచ్చంధ సంస్ధలు ప్రతినిధలు సహకారంతో పొందూరు-రాజాం ప్రధాన రహదారుల్లో వక్షాలు తొలగించారు. రాకపోకలుకు అవకాశం కలిగించారు. మండలంలో 31 పంచాయితీల్లో 500 విద్యుత్ స్తంభాలు, వేలసంఖ్యలో వక్షాలు కూలిపోయాయి. మండలంలో 40 స్తంభాలకు నష్టం ఆమదాలవలస రూరల్: మండలంలో తుపాను ప్రభావం వల్ల సుమారు 40 స్తంభాలు కూలిపోయాయి. ఈదురుగాలుల ధాటికి చెట్లు పడిపోయి స్తంభాలు పాడయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపోయి విద్యుత్ అంతరాయం కలిగింది. పునరుద్ధరణకు మరో 24 గంటలు పడే అవకాశం ఉందని విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. నేలకూలిన 300 స్తంభాలు లావేరు: హూదూద్ తుపాను ప్రభావంతో మండలంలో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు 300 స్తంభాలు నేలకూలాయి. భారీ చెట్లు విద్యుత్ వైర్లపై పడడంతో స్తంభాలతో పాటు వైర్లు తెగిపోయాయి. 11 కేవీ, ఎల్టీ లైన్లపై చెట్ల కొమ్మలు పడడంతో లావేరు, బుడుమూరు, అదపాక, కేశవరాయునిపాలేం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేక గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. గ్రామాల్లో మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనసాగుతున్న అంధకారం నరసన్నపేట, నరసన్నపేట రూరల్: నరసన్నపేట నియోజకవర్గంలో హుదూద్ తుపాను ప్రళయానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. సోమవారం కూడా విద్యుత్ పునరుద్ధరణ పనులు జరగకపోవడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. గ్రామాల్లో వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో స్తంభాలు ఎత్తి వైర్లు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతోంది. నరసన్నపేట సబ్‌స్టేషన్ పరిధిలో సుమారు 120 మంది అదనపు కార్మికులు విద్యుత్ పునరుద్దరణ చర్యలు చేపట్టారు. ఇదే విధంగా మిగతా నాలుగు మండలాల్లో కూడా అదనపు సిబ్బందితో పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. కంప్యూటర్ సేవలపై ఆధారపడ్డ రెవెన్యూ, ఎంపీడీవో, సబ్ రిజిస్ట్రార్, తపాలా శాఖ వంటి పలు కార్యాలయాల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉర్లాం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అయినా విద్యుత్ సరఫరా మెరుగుపర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా ఉండగా చిక్కాలవలస, బాడాం, కిళ్లాం, కోమర్తి, యారబాడు, జమ్ము తదితర గ్రామాల్లో స్తంభాలు విరిగిపోయాయి. నందిగాంలో 45... నందిగాం: హుదూద్ తుపాను ప్రభావంతో మండలంలో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. టెక్కలి, పలాస నుంచి వచ్చే మెయిన్ లైన్‌ను నిలుపుదల చేసినట్లు విద్యుత్ శాఖ ఏఈ నారాయణరావు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు త్వరితగతిన చేపడుతున్నామన్నారు. మండలంలో మండలంలో సుమారు 45 స్తంభాలు నేలకొరిగాయి. బోరుభద్ర సమీపంలో క్రాకర్స్ పాడయ్యాయి. వైరు పూర్తిగా పాడైంది. పీవీపురం వద్ద భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో లట్టిగాం-పూండి రోడ్డులో ప్రయాణికులకు అంతరాయం కలిగింది. కవిటిఅగ్రహారం వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో కుంకుడు చెట్టు నేలమట్టమైంది పొందూరులో 50... పొందూరు: హూదూద్ ప్రభావం వల్ల మండలంలో సుమారు 50 వరకు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పొందూరు, జోగన్నపేట, తండ్యాం, శ్రీరాంనగర్ కాలనీ, మొదలవలస, తోలాపి, తాడివలస తదితర గ్రామాలన్నీ రాకపోకలకు దూరంగా ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్లపై పడడంతో ఈ పరిస్థితి నెలకొంది. చెరువులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చెరువులకు ఉన్న మదుములు ద్వారా నీటిని విడిపెట్టడంతో ప్రజలు చేపలు పడుతున్నారు. 150 స్తంభాలు, 30 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం శ్రీకాకుళం రూరల్ : తుపాను ప్రభావంతో మండలంలో 150 స్తంభాలు, 30 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. అధికారులు కేవలం మత్స్యకార గ్రామాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో అధికార యంత్రాంగమంతా ఇక్కడే ఉండిపోవడంతో మిగిని గ్రామాలకు కనీస సహాయక చర్యలు చేపట్టేనాధుడే కరువయ్యారు. వాకలవలస సమీపంలో కూలిన చెట్లను తొలగించేందు సోమవారం నాటికి కూడా ఎవరూ రాలేదు. చివరకు గ్రామస్తులకే ముందుకు వచ్చి చెట్లను తొలగించి రాకపోకలకు వీలు కలిగించారు. నేలకొరిగిన స్తంభాలు రాజాం: రాజాం పట్టణంలో తుపాను ప్రభావంతో విద్యుత్‌స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. 30 చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సబ్ రిజిస్ట్రార్, ట్రాన్స్‌కో కార్యాలయం, మాధవబజార్ ప్రాంతాల్లో వృక్షాలు, కొమ్మలు, హోర్డింగ్‌లు పడిపోయి తృటిలో ప్రమాదం తప్పింది. -
పరిశ్రమలకు కోతలు పెంపు
రెండు రోజులు పవర్‌హాలిడే ఈ నెల 9 నుంచి అమలు ఎన్పీడీసీఎల్ ప్రకటన వరంగల్ : కరెంటు కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఖరీఫ్ పంటలు చేతికి వచ్చే సమయంలో కోతలు పెరగడంలో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఇదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఇంకా ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌లో కోత మరింత పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపి ణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) నిర్ణయించింది. పరిశ్రమలకు ఇప్పటికే వారంలో ఒక రోజు పూర్తిగా కరెంటు కోతలు విధిస్తున్నారు. ఈ నెల 9 నుం చి దీన్ని రెండు రోజులకు పెంచనున్నారు. పరి శ్రమలకు రెండు రోజులపాటు విధించే కరెంటు కోతలను అధికారికంగా పేర్కొంటూ ఎన్పీడీసీఎల్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాల మేరకు పరిశ్రమలకు విద్యుత్ కోతలపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో డివిజన్ల వారీగా కోతలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. ఐదు జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించి ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో వారంలో రెండు రోజులు పరిశ్రమలకు కరెంటు కోతలు విధించనున్నారు. వరంగల్ సర్కిల్లో ప్రస్తుతం బుధవారంపవర్ హాలిడే ఉండగా... ఈ నెల 9వ తేదీ నుంచి బుధవారంతోపాటు గురువారం కూడా పరిశ్రమలకు విద్యుత్ కోత అమలు కానుంది. -
కరెంటు కష్టాలకు ఢిల్లీ పరిష్కారం!
గ్యాస్ పూలింగ్ విధానంపై కేంద్రం కసరత్తు అన్ని గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తికి కార్యాచరణ దేశీయ, విదేశీ గ్యాస్‌తో కొరత తీర్చే యోచన రూ. 5.50కే యూనిట్ విద్యుత్ దక్కే అవకాశం తెలంగాణకు తక్షణ ఉపశమనం హైదరాబాద్: విద్యుత్ కష్టాలతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి ఉపశమనం లభించేలా ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) కేంద్రంగా రూపొందుతున్న గ్యాస్ పూలింగ్ ధరల విధానంతో తక్కువ ధరకే విద్యుత్ లభించనుంది. గ్యాస్‌తో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రూ. 5.50కే యూనిట్ చొప్పున అందించేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం గ్యాస్ కొరతతో నిరుపయోగంగా ఉన్న విద్యుత్ ప్లాంట్లలో కనీసం 50 నుంచి 60 శాతం ప్లాంట్ లోడు ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్)తో ఉత్పత్తిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. దేశీయంగా లభించే గ్యాసుకు తోడు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుని తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందుకయ్యే అదనపు భారాన్ని వయబులిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్-వ్యత్యాస నిధి)గా భరించాలని కూడా యోచిస్తోంది. ఈ గ్యాస్ పూలింగ్ విధానం అమల్లోకి వస్తే తెలంగాణకు 23 నుంచి 28 మిలియన్ యూనిట్ల(ఎంయూ) మేర విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీంతో విద్యుత్ కష్టాలు కొంత తీరుతాయన్న ఆశాభావం ఇంధన శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలా మొదలైంది.. దేశీయ, విదేశీ గ్యాస్‌ను రెండింటినీ కలిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి తక్కువ ధరకే విద్యుత్‌ను అందించేందుకు ఉద్దేశించిందే గ్యాస్ పూలింగ్ విధానం. ఈ విధానంపై కేంద్ర విద్యుత్, ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో గత ఆగస్టు 19న పీఎంవో అంతర్గతంగా సమావేశమైంది. యూనిట్ విద్యుత్‌ను రూ. 5.50 కే అందించాలంటే ఏం చేయాలనే కార్యాచరణను తమకు సమర్పించాలని ఈ మూడు శాఖలను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఆ శాఖలు పీఎంవో ముందు తాజాగా ఓ నివేదికను ఉంచాయి. దీని ప్రతిని ‘సాక్షి’ సంపాదించింది. దీని ప్రకారం గ్యాసు పూలింగ్ విధానం అమలు చేసేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలను తీసుకోవాలని ఆ శాఖలు స్పష్టం చేశాయి. దేశంలోని గ్యాస్ ప్లాంట్లను 50 నుంచి 60 పీఎల్‌ఎఫ్‌తో నడిపితే తక్షణ విద్యుత్ కష్టాలు తీర్చవచ్చునని తెలిపాయి. దీనికి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, గ్యాస్ సరఫరా సంస్థలు, ప్లాంట్ల యాజమాన్యాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించాయి. అంద రూ చేతులు కలిపితేనే..! గ్యాసు పూలింగ్ విధానాన్ని అమలు చేసేందుకు అన్ని వర్గాలూ చేయూతనివ్వాల్సి ఉంటుంది. పీఎంవోకి ఇచ్చిన నివేదిక ప్రకారం.. ► రాష్ట్ర ప్రభుత్వం సహజగ్యాస్పై ఎటువంటి వ్యాట్ వసూలు చేయరాదు. ప్రస్తుతం ఇది 14 శాతం వరకూ ఉంది. ► గ్యాస్ ప్లాంట్ల యాజమాన్యాలు కూడా తమ స్థిర చార్జీలను యూనిట్‌కు 85 పైసలకే పరిమితం చేసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ చార్జీలు రూపాయి నుంచి రూ. 1.10 వరకూ ఉన్నాయి. ► ప్రజలు కూడా గ్రీన్ఎనర్జీ సెస్ కింద కొంత చెల్లించాల్సి ఉంటుంది. ► రిలయన్స్ సంస్థ గ్యాస్ సరఫరా చార్జీలను సుమారు 20 శాతం మేర తగ్గించుకోవాలి. ► కేంద్రం వీజీఎఫ్ కింద 2015-16లో సుమారు రూ. 3027 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ మన ప్లాంట్ల పరిస్థితి! కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్లో గ్యాస్ ఉత్పత్తిని రిలయన్స్ రోజురోజుకీ తగ్గించడంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కష్టాలు వచ్చిపడ్డాయి. వాస్తవానికి రిలయన్స్ షెడ్యూల్ మేరకు 2015 నాటికి రోజుకు 120 ఎంఎంఎస్‌సీఎం (మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల) గ్యాస్ ఉత్పత్తి కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం కేవలం రోజుకు 30 ఎంఎంఎస్సీఎంలే ఉత్పత్తవుతోంది. ఫలితంగా ఏకంగా 2233 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. అదేవిధంగా నిర్మాణం పూర్తయి, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 4061 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో నాలుగు ప్లాంట్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం ఓఎన్జీసీ, రవ్వ క్షేత్రాల నుంచి వస్తున్న గ్యాసుతో పాత విద్యుత్ ప్లాంట్లు ఆరు మాత్రమే(1285 మెగావాట్లు) నడుస్తున్నాయి. ఇవి కూడా కేవలం సగటున 32 శాతం ప్లాంటు లోడు ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో మాత్రమే నడుస్తున్నాయి. ఈ గ్యాసు ప్లాంట్లతో తెలంగాణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ పూలింగ్ విధానం అమల్లోకి వస్తే 7579 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లలో కనీసం 50 నుంచి 60 శాతం పీఎల్‌ఎఫ్‌తో 3,789 మెగావాట్ల నుంచి 4,547 మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఇందులో తెలంగాణకు సగం విద్యుత్ అందినా ప్రస్తుత కొరత తీరిపోతుంది. ఇక దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ప్లాంట్ల సామర్థ్యం 24,149 మెగావాట్లు. ఈ ప్లాంట్లకు రోజుకు 41.7 ఎంఎంఎస్‌సీఎం గ్యాస్ అవసరం కాగా కేవలం 18.8 ఎంఎంఎస్‌సీఎం గ్యాస్ మాత్రమే సరఫరా అవుతోంది. గ్యాస్ దిగుమతి చేసుకుని వీటిని కనీసం 50 శాతం పీఎల్‌ఎఫ్‌తో నడిపితే అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కష్టాలు తీరుతాయని కేంద్రం భావిస్తోంది. -
నడిగడ్డకు మహర్దశ
- కరెంట్ కష్టాలు తీర్చే భారీ విద్యుత్ ప్రాజెక్టులు - సాగునీటి, ప్రాజెక్టుల కేంద్రంగా గద్వాల - ‘జూరాల- పాకాల’ ఇక్కడి నుంచే ప్రారంభం - రైల్వే, జాతీయ రహదారులతో రవాణా వ్యవస్థ - తాగునీరు ఇచ్చేందుకు తాగునీటి పథకాలు గద్వాల: కృష్ణా, తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతమైన నడిగడ్డకు ఇక మహర్దశ కలుగనుంది. ఇప్పటికే విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు నిలయంగా మారిన ఈ ప్రాంతం ఇక రాష్ట్రానికి వె లుగులు పంచే ముఖ్యకేంద్రంగా కూడా మారనుంది. తాజాగా గద్వాలలో సోలార్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నడిగడ్డ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచేయాలని సంకల్పించిన తరుణంలో ఈ ప్రాంత అభివృద్ధి మరింత ఊపందుకోనుంది. దాదాపు 2500 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు, 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు ప్రాజెక్టులతో పాటు కొత్తగా ప్రతిపాదించిన పాలమూరు ఎత్తిపోతల పథకం, జూరాల- పాకాల వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు గద్వాల కేంద్రంగానే ప్రారంభం కానున్నాయి. దీనికితోడు జూరాల రిజర్వాయర్ ఆధారంగా భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. జిల్లాలో సగం ప్రాంతానికి సాగునీటిని అందించే పథకాలు జూరాల రిజర్వాయర్ ఆధారంగానే పనిచేస్తున్నాయి. జూరాలతో జలకళ.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా కృష్ణానదిపై ధరూరు మండలం వద్ద ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును 1981లో నిర్మాణం ప్రారంభించి, 1996లో ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. జిల్లాకు అవసరమైన పెండింగ్ ప్రాజెక్టులను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంజూరి ఇచ్చింది. దీంతో గద్వాల అభివృద్ధి వేగవంతం కావడానికి మరింత తోడైంది. జూరాల ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, భీమా ప్రాజెక్టులు ఈ ఖరీఫ్ నుంచి సాగునీటిని అందించేందుకు పూర్తయ్యాయి. ఆర్డీఎస్ ఇప్పటికే అలంపూర్ నియోజకవర్గంలో సాగునీటిని అందిస్తూనే ఉంది. విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో.. జూరాల ప్రాజెక్టు వద్ద 240 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి ప్రారంభమైంది. లోయర్ జూరాల వద్ద మరో 240 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం మరో ఏడాదిలోగా అందుబాటులోకి రానుంది. గట్టు మండలంలో నాలుగేళ్ల క్రితమే ప్రైవేట్‌రంగంలో 35 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు భూ సేకరణ జరిగింది. జూరాల వద్ద జెన్కో ఆధ్వర్యంలో ఒక మెగావాట్ సోలార్ విద్యుదుత్పత్తి విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి విద్యుత్ లోటును భర్తీచేసేందుకు గద్వాల ప్రాంతంలో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, గద్వాల రైల్వే జంక్షన్, జూరాల రిజర్వాయర్ ఆధారంగా వెయ్యి మెగావాట్ల మరో సూపర్ థర్మల్ కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రతిపాదన చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. గద్వాలలో రైల్వే జంక్షన్ ఏర్పాటుతో... నిజాం నవాబు కాలంలోనే గద్వాల రైల్వే స్టేషన్‌ను జంక్షన్‌గా మార్చేం దుకు భూమిని కేటాయించారు. రాయిచూర్- మాచర్ల రైల్వేలైన్ ప్రతి పాదనలో ప్రస్తుతం గద్వాల - రాయిచూర్ మధ్య పనులు పూర్తయ్యాయి. దీంతో గద్వాల రైల్వేస్టేషన్ జంక్షన్‌గా అవతరించింది. రవాణారంగానికి అవసరమైన అన్ని సౌకర్యాలు గద్వాలకు కొత్త రైల్వేలైన్ ద్వారా మెరుగుపడ్డాయి. దీనికితోడు జూరాల ప్రాజెక్టుకు దిగువన డబుల్‌లైన్ బ్రిడ్జి నిర్మాణానికి నీటిపారుదల శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇవి పూర్తయితే రోడ్డు రవాణా సౌకర్యాలు మరింత పెరుగుతాయి. గద్వాల డివి జన్‌లో జాతీయ రహదారులు ఉండడం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి తోడయ్యాయి. ఇప్పటికే దేశంలోనే అతి పొడవైన 44వ జాతీయ రహదారి ఉండగా, నాగల్‌దిన్నె, జూరాల ప్రాజెక్టు బ్రిడ్జి ద్వారా మరో రాష్ట్ర రహదారి గద్వాల డివిజన్ అంతట అభివృద్ధికి తోడయ్యే అవకాశం ఉంది. ఇలా గద్వాల అన్నిరంగాల్లో వేగవంతంగా అభివృద్ధి చెందడం జిల్లా కేంద్రానికి అవసరమైన అర్హతలు సాధించినట్లయింది. -
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే కరెంట్ కష్టాలు
నల్లగొండ రూరల్ : గత కాంగ్రెస్, టీడీపీ పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు వస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. బుధవారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కేవలం హైడల్ థర్మల్ పవర్‌పైనే ఆధారపడాల్సి వస్తుందన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు నార్త్ కారిడార్ నుంచి సౌత్వరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేయలేదన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల సభలోనే తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉంటుందని ప్రజలకు వివరించామన్నారు. విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలోనే ఉన్నాయని, ఇందుకు కారణం గత టీడీపీ, కాంగ్రెస్ నాయకుల వైఖరేనని తెలిపారు. అలాంటి వారు నేడు ఫ్యాషన్ కోసం టీఆర్ఎస్ను విమర్శిస్తున్నారన్నారు. సీఎం మొదటి కేబినెట్లోనే 40 అంశాలమీద నిర్ణయం తీసుకుని చరిత్ర సృష్టించారన్నారు. వెయ్యిమంది అమరత్వంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్ అంటే మలినం లేని, మలినమంటని పార్టీ అన్నారు. పార్టీలో పనిచేసిన వారికి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో చకిలం అనిల్‌కుమార్, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, జి. వెంకటాచారి, ఫరీద్, పున్న గణేష్, షేక్ కరీంపాష, బోయపల్లి జానయ్య, చింత శివరామకృష్ణ, సాయి, జమాల్‌ఖాద్రి, శ్రీను, సురేందర్, అరుణాకర్ పాల్గొన్నారు. -
రెండేళ్లలో పవర్ ప్లాంట్లు సిద్ధం!
270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్ల ఏర్పాటు బీహెచ్ఈఎల్తో టీజెన్‌కో చర్చలు హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ జెన్కో కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. అత్యంత వేగంగా విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నడుం బిగిం చింది. ఇందులో భాగంగా కేవలం రెండేళ్లలో నిర్ధేశిత లక్ష్యం మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)తో చర్చల ప్రక్రియు ప్రారంభించింది. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లను (మొత్తం 1,080 మెగావాట్లు) రెండేళ్లలో పూర్తి చేసేందుకు బీహెచ్ఈఎల్ చైర్మన్ బీపీ రావుతో ఇప్పటికే తెలంగాణ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) దేవులపల్లి ప్రభాకర్‌రావు చర్చలు జరిపారు. కాగా, బీహెచ్ఈఎల్ వద్ద 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు విద్యుత్ ప్లాంటుకు చెందిన బాయిలర్లు, టర్బైన్లు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యూనిట్ల ఏర్పాటుకు అనువైన భూమి ఉంటే... ఆ ప్రాంతంలో నేరుగా ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభించవచ్చని టీజెన్‌కో భావిస్తోంది. వాస్తవానికి కొత్త విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే ముందు బీహెచ్ఈఎల్కు వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లాంటుకు అవసరమైన బాయిలర్లు, టర్బైన్లను బీహెచ్ఈఎల్ తయారుచేస్తుంది. ఇందుకు ఏడాది, ఏడాదిన్నర సమయం పడుతుంది. అయితే, ఇప్పటికే 270 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బాయిలర్లు, టర్బైన్లు సిద్ధంగా ఉండటం వల్ల ఈ సమయం కలిసి వస్తుందని టీజెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే బీహెచ్ఈఎల్ చైర్మన్‌తో చర్చలు జరిపాం. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. సానుకూలత వ్యక్తం చేస్తూ నాకు ఆ సంస్థ చైర్మన్ లేఖ కూడా రాశారు. ఈ విషయూన్ని ముఖ్యమంత్రితో చర్చించి ఓ నిర్ణయూనికి వస్తాం’ అని ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ సంక్షోభంపై నేడు సీఎం సమీక్ష రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. విద్యు త్ సరఫరా పరిస్థితిపై గురువారం ఆయన సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు. భూ గర్భజలాలు అడుగంటిపోవడం, విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతుండటం, రైతు లు సబ్స్టేషన్ల వద్ద ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ డిమాండ్, సరఫరా, లోటు వివరాలను అధికారులు సీఎంకు వివరించనున్నారు. మూడు రోజుల క్రితం వరకూ రాష్ట్రంలో ఎండవేడిమికి డిమాండ్ 160 మిలియన్ యూనిట్లు (ఎంయుూ) దాటడం వల్ల లోటు 24 ఎంయుూల మేరకు ఏర్పడింది. దీంతో భారీగా కోతలు విధించకతప్పలేదని ఇందనశాఖ వర్గాలు తెలిపాయి. అయితే, వర్షాలు కురవడంతో మంగళ, బుధవారాల్లో పరిస్థితి మెరుగుపడిందని, డిమాండ్ 148 ఎంయుూలకు తగ్గిందని, లోటు కేవలం 8 ఎంయుూలకే పరిమితమైందని ఆ వర్గాలు పేర్కొన్నారుు. ఈ వివరాలన్నీ వుుఖ్యవుంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు ఇంధనశాఖ వర్గాలు వివరించారుు. -
ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తాం..
ఎవ్వరూ రుణాలు కట్టొద్దు.. వ్యవసాయానికి9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చి.. పండుగలా మారుస్తాం.. స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.. అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు.. సీఎం అయ్యాక అన్నీ మరిచిపోయారు. వ్యవసాయ బడ్జెట్ పేరిట అంకెల గారడీ చేశారు. జిల్లాకు కొత్తగా ఒక్క కేటాయింపు జరగలేదు. రుణమాఫీకి కేటాయించిన నిధులు అన్నదాతను హతాశులను చేస్తున్నాయి.ఒక వైపు రుణం మాఫీ కాక.. కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాకతలలు పట్టుకు కూర్చుంటున్నారు. మదుపులు లేక.. అప్పు దొరక్క సాగుకు దూరమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గింది. పంటలతో కళక ళలాడాల్సిన పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సుమారు ఐదున్నర లక్షల మంది రైతులు, 2,41,329 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా..ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు రుణమాఫీ హామీ..అన్నదాతలను నడి రోడ్డున పడేసింది. అధికారంలోకి వచ్చిన ఆయన..రుణమాఫీ చేయకపోగా..కనీసం స్పష్టత ఇవ్వకపోవడం..పాత రుణాలు తీర్చాలంటూ..బ్యాంకర్లు ఒత్తిడి తేవడంతో..మదుపులు దొర క్క చాలా ప్రాంతాల్లో రైతులు సాగుకు దూరంగా ఉండిపోయారు. వేధిస్తున్న విద్యుత్ కష్టాలు జిల్లాలో 26,085 విద్యుత్ మోటార్లున్నాయి. వీటిలో సుమారు 20వేలకు పైగా ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. విద్యుత్ సరఫరాాలో ఆటంకాలు ఎదురవుతుండడంతో అన్నదాతలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్ ఇస్తుండడంతో పాములు, విష కీటకాల కాటుకు గురై..మృత్యువాత పడుతున్నారు. ఎన్నికల సమయంలో 9 గంటల పాటు విద్యుత్ ఇస్తామన్న చంద్రబాబు..మోసం చేస్తున్నారు. వడ్డీ రాయితీ పెంపుపై అసహనం రుణమాఫీకి బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎం దుకూ సరిపోవు. అలాగే..ఖరీఫ్ సీజన్ దాటుతున్నా.. రుణాల ఊసే లేదు. జిల్లాలో గత ఏడాది రూ.1200 కోట్ల పంట రుణాలు, రూ.700 కోట్ల వరకు బంగారం రుణాలు రైతులు తీసుకున్నారు. అయితే..వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాత్రం రుణమాఫీ కోసం గానీ..ప్రస్తుత సీజన్‌కు రైతులకు రుణాలు అందించేందుకు గానీ..ప్రయత్నించకుండా..వడ్డీ రాయితీ పెంచుతున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధరల స్థిరీక రణ నిధి గాలికి.. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రానప్పడు ప్రభుత్వం స్థిరీకరణ నిధి ద్వారా కొనుగోళ్లు జరుపుతామని టీడీపీ ప్రధాన హామీ ఇచ్చింది. కానీ బడ్జెట్లో ఆ విషయాన్ని మరిచిపోయింది. ఆర్థిక బడ్జెట్లో అంకెలు మార్చారు.. సాధారణ బడ్జెట్‌నే అంకెలు మార్చి రైతులను ఏమార్చే ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఉచిత విద్యు త్ కేటాయింపులు ప్రతి బడ్జెట్లో ఉన్నవే. వాటిని గతంలో ఆర్థిక(సాధారణ) బడ్జెట్లోనే చూపేవారు. కానీ ప్రస్తుతం వ్యవసాయ బడ్జెట్లో చూపి..మాయ చేస్తున్నారు. మొత్తానికి..వ్యవసాయ బడ్జెట్లో జిల్లాకు మొండి చెయ్యి చూపుతున్నారు. బీమా ఎలా.. కొత్త రుణాలు మంజూరు కాకపోతే..బీమా వర్తిం చదు.జిల్లాలో రైతులు పంటల బీమా ప్రత్యేకంగా చేయించే సాంప్రదాయం లేదు. ఇక బీమా ఎలా అని అన్నదాతలు సతమతవుతున్నారు. మడ్డువలసకు రిక్తహస్తం వంగర: మండలంలోని గొర్లె శ్రీరాములునాయుడు మడ్డువలస ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది. ప్రాజెక్టు ఆధునికీకరణ, మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ హయాంలో.. మహానేత వైఎస్ హయాంలో మడ్డువలస ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.47 కోట్లు కేటాయించారు.దశల వారీగా ఇప్పటి వరకు రూ.32 కోట్ల మేర నిధులు సమకూర్చడంతో..కుడి ప్రధాన కాలువ లైనింగ్ పనులు, అదనపు కాలవల తవ్వకం, తూముల ఏర్పాటు, కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. ప్రతిపాదనలు పంపినా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మిగులు పనులు చేపట్టేందుకు రూ.15 కోట్లు నిధులు కావాలని ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపారు.ప్రస్తుత బడ్జెట్లో నిధులు సమకూర్చకపోవడంతో లావేరు, రణస్థలం మండలాల్లో అదనపు కాలువ తవ్వకం పనులు నిలిచిపోయాయి. భూ సేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైంది. పలు చోట్ల కల్వర్టులు నిర్మించలేదు. అత్యవసర గేట్ల ఏర్పాటు నిలిచిపోయింది. కుడి ప్రధాన కాలువ హెడ్ స్లూయిస్ గేట్ల మరమ్మతులు నిలిచిపోయాయి. ఎంతో ఆశతో ఎదురు చూసినా..ప్రభుత్వం తమ ఆశలపై నీళ్లు చల్లిందని.. రైతులు మండిపడుతున్నారు. పనులు ఫుల్..నిధులు నిల్ సంతకవిటి: అర్ధశతాబ్దం చ రిత్ర..39 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న నారాయణపురం ఆనకట్టకు సైతం బడ్జెట్లో ఒక్క పైసా కేటాయించలేదు. శిథిలావస్థలో..ఇసుక మూటల తాత్కాలిక అడ్డుతో ఎన్నాళ్లు నెట్టుకు రావాలని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రంగారాయపురం గ్రామం వద్ద ఉన్న ఈ ఆనకట్ట కుడికాలువ రెగ్యులేటర్ పూర్తిగా పాడైంది. దీని మరమ్మతులకు కనీసం రూ.50 లక్షల మేర అవసరం. వీటితో పాటు..గతంలో ఆనకట్టకు సంబంధించి ఎఫ్రాన్ నిర్మాణం కొంత మేర చేసి వదిలేశారు. దీంతో నది ప్రవాహం దిశ మారి పోతులు జగ్గుపేట గట్టు కోతకు గురవుతోంది. ఈ ఎఫ్రాన్ నిర్మాణానికి కోటి రూపాయలు అవసరమని నిపుణులు తేల్చారు. వీటితో పాటు ఇక్కడ బ్యారేజీ ఏర్పాటుకు రూ.15 కోట్లు అవసరం ఉంది. ఇక ఆరుమాసాల క్రితం వచ్చిన రాష్ట్ర స్థాయి ఇంజినీరింగ్ అధికారులు..కుడికాలువను పరిశీలించి..కాలువ ఆధునికీకరణకు రూ.50 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. మరో వైపు జిల్లా ఇంజినీర్లు రూ.7.5కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వానిక ఇవేమీ కనబడలేదు. బడ్జెట్ పేరిట మోసం చేశారని, ఒక్క రూపాయి కూడా కేటాయించకపోతే ఎలా అంటూ..రైతులు ప్రశ్నిస్తున్నారు. -
తాగునీటి పథకాలకు సౌర‘శక్తి’
- కరెంట్ కష్టాలకు ప్రత్యామ్నాయం - తొలి యూనిట్ పొన్నాలపల్లెలో ఏర్పాటు - త్వరలో మంత్రిచేతుల మీదుగా ప్రారంభం గంభీరావుపేట : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఎదురవుతున్న కరెంట్ కష్టాలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించింది. సౌర‘శక్తి’తో పల్లె ప్రజల గొంతు తడిపే పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొదటి యూనిట్‌ను గంభీరావుపేట మండలం దమ్మన్నపేట పంచాయతీ పరిధిలోని పొన్నాలపల్లెలో సౌరశక్తి ఆధారిత తాగునీరు సరఫరా పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకాన్ని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ప్రారంభించాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. జిల్లాకు మొదటి విడతగా ఆరు యూనిట్లు మంజూరు చేసినా ప్రారంభమైన యూనిట్ మాత్రం ఇదే కావడం గమనార్హం. సౌరశక్తి ఆధారిత తాగునీటి పథకం కింద పొన్నాలపల్లెతోపాటు జిల్లెల్లపల్లె, మహదేవ్పూర్ మండలం బొడాయిగూడెం, ఒడెడ్, మంథని మండలం మహబూబ్‌పల్లి, ముత్తారం మండలం పోచంపల్లికి యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్‌కు ఎన్‌ఆర్‌డబ్ల్యూపీ పథకం కింద రూ.4.50 లక్షలు వెచ్చించనున్నారు. జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ (హైదరాబాద్) కంపెనీ పథకం పనులు చేపట్టింది. ప్రొడక్ట్ మేనేజర్ ప్రదీప్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇదీ ఎంపిక విధానం * సోలార్ ఆధారిత తాగునీటి సరఫరా కోసం చిన్న పల్లెలను (హాబిటేషన్)లను అధికారులు ఎంపిక చేశారు. * గతంలో ఆర్డబ్ల్యూఎస్ విభాగం అధికారులు వేసిన బోరుబావులను పథకానికి వినియోగిస్తున్నారు. * చేతిపంపును ఏర్పాటు చేసి, సోలార్‌తో నడిచే సింగిల్‌ఫేజ్ మోటార్‌ను బోరుబావిలో దింపుతారు. * వంద మీటర్ల లోతు నుంచి నీటిని పైకి తీసుకురాగల సామర్థ్యం మోటారుకు ఉంటుంది. * కొద్ది ఎత్తులో ఐదువేల లీటర్ల సామర్థ్యం గల ప్లాస్టిక్ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తారు. * ట్యాంక్‌పై 740వాల్ట్స్ సామర్థ్యం గల మూడు సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేస్తారు. * ట్యాంక్ నిండిపోయినా.. బోరులో మోటారుకు నీరు అందకపోయినా మోటారు దానంతట అదే ఆగిపోతుంది. * బోరుబావికి 150మీటర్ల దూరం చొప్పున మూడు పబ్లిక్ నల్లాలు ఏర్పాటు చేస్తారు. * వీటితోపాటు చేతి పంపు కూడా పనిచేస్తుంది. * ఏ కారణంగానైనా సోలార్ సిస్టం పనిచేయకుంటే యథావిధిగా చేతిపంపు పనిచేస్తుంది. -
తిరువళ్లూరులో మరో జలాశయం
కొరుక్కుపేట: చెన్నై నగరంలో ఓ వైపు విద్యుత్ కష్టాలు విలయతాండం చేస్తుంటే మరో వైపు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందుఆల ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చెన్నై నగర వాసుల తాగునీటి కొరతను తీర్చే విధంగా ప్రభుత్వం మరో కొత్త రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భూసేకరణను సైతం ప్రారంభించింది. చెన్నై నగరానికి సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటికే పూండి రిజర్వాయర్ ఉండగా, దీని నుంచి నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. తిరువళ్లూరు జిల్లా రిజర్వాయర్ నిర్మాణానికి అనువైనదిగా గుర్తిం చగా, 90 శాతం భూసేకరణ పనులను సైతం అధికారులు సిద్ధం చేశారు. *330 కోట్లతో వాటర్ రిసోర్సెస్ విభా గం ఈ పనులను చేపట్టనుంది. తిరువళ్లూరు జిల్లాలోని కన్నన్‌కోటై గ్రామం, తెరవైకండిగై ప్రాంతాల మధ్య ఈ రిజ ర్వాయర్‌ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. 500 క్యూబిక్ ఫీట్ల నీటిని నిల్వ చేసి సామర్థ్యంతో ఈ రిజ ర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఇందు లో భాగంగా రిజర్వాయర్ నిర్మాణానికి 1500 ఎకరాల భూమి అవసరం కాగా, 1350 ఎకరాల భూసేకరణ పనులను పూర్తి చేశారు. ఈ విషయంగా డబ్ల్యూఆర్చగ అధికారులు మాట్లాడుతూ చెన్నై మహానగర పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పూండి జలాశయం సహా నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయన్నారు. వీటితో పాటు అదనంగా ఐదో రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే చెన్నై నగర ప్రజలు తాగునీటి కష్టాలు పూర్తిగా సమసిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రిజర్వాయర్ 2015 ఏడాది మధ్య నాటికి అందుబాటులోకి రానుం దని వెల్లడించారు. -
అన్నదాతకు చంద్ర‘గ్రహణం’
పదునైన గొడ్డలి వేటు పడిన చెట్టు మళ్లీ చిగురించవచ్చు. కానీ ఈటెల్లాంటి మాటలతో గాయపడిన హృదయం తిరిగి కోలుకోవడానికి ఏ మందూ లేదు. చంద్రబాబు పాలనా కాలంలో రాష్ర్టం తీవ్ర కరువు కాటకాలతో అల్లాడింది. అటు వరుణుడి కరుణ లేక.. ఇటు చంద్రబాబు కనికరం లేక.. అన్నదాతలు అల్లాడిపోయారు. సాగు భారమైన వేళ.. అవసరమైన కరెంటు సరఫరా చేసి, ఆదుకోవాల్సిన చంద్రబాబు.. ‘వ్యవసాయం దండగ’ అంటూ పదునైన మాటలతో రైతు హృదయాలను గాయపరిచారు. ఆ మాటలు గుర్తుకు వస్తే ఇప్పటికీ వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటూనే ఉంటోంది. పదిమందికి అన్నంపెట్టిన మట్టి మనుషులు.. ఆ మట్టిలోనే బలవంతంగా కలిసిపోతున్నా.. నిర్దయగా వ్యవహరించిన చంద్రబాబు కర్కశ పాలనను.. అందుకే వారు మళ్లీ వద్దంటున్నారు. రైతు బతుకులపై పట్టిన ఆ చంద్ర‘గ్రహణం’ తమ జీవితాల్లో మళ్లీ రాకూడదని కోరుకొంటున్నారు. బాబు పాలన అంటేనే భయమేస్తోంది చంద్రబాబు పాలనలో కరెంట్ లేక చేతికి వచ్చిన పంట దెబ్బ తినేది. కరెంట్ సరఫరా సక్రమంగా లేకపోయినా తడిసిమోపెడు బిల్లులు వచ్చేవి. వరి పంట పొట్ట దశలో నీరు లేక బాగా దెబ్బ తినేది. అప్పులు పాలైపోయాం. బాబు పాలన అంటేనే భయమేస్తోంది. - పాలం నాగవిష్ణు, కౌలు రైతు, గాదరాడ, కోరుకొండ మండలం కరెంట్ కష్టాలు వెన్నంటేవి చంద్రబాబు పాలనలో రైతుల కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఏ సమయంలో కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది. పగలనక, రాత్రనక బోర్ల వద్దే పడిగాపులు కాసేవాళ్లం. ట్రాన్స్ఫార్మర్ పోతే నెలల తరబడి మార్చేవారు కాదు. - నలరావుల శ్రీనివాస్, రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం కరెంటు లేకపోయినా తప్పని బిల్లులు చంద్రబాబు పాలనలో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేదికాదు. బిల్లులు మాత్రం తప్పేవికావు. వైఎస్సార్ పాలనలో ఉచిత కరెంటు, తొమ్మిది గంటల నిరంతర సరఫరా ఉండేది. దీంతో పంటలకు నీరందించడానికి ఎలాంటి ఢోకా ఉండేదికాదు. ప్రస్తుత పరిపాలనలో విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. - బచ్చల చిట్టిబాబు, గుమ్మరేగుల, రౌతులపూడి మండలం బాబు హయాంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరమే చంద్రబాబు హయాంలో రైతులు కరెంటు పోతే మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళంతో కొట్టుమిట్టాడేవారు. రాత్రిళ్లు వ్యవసాయబోర్ల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. కరెంటు సప్లై సక్రమంగా లేకున్నా బిల్లులు మాత్రం గుండె గుభిల్లుమనిపించే వి. బిల్లుల తగ్గింపునకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. - జట్లా సోమేశ్వరరావు, శంఖవరం కరెంటు కష్టాలు పుట్టెడు చంద్రబాబు నాయుడి పరిపాలనలో కరెంటు ఉందో లేదో తెలియని పరిస్థితులు అనుభవించాను. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక బోరు బావి వద్ద పడిగాపులు కాసేవాడిని. రాత్రంతా కాపలా కాసి విడతలవారీగా తడులు ఇచ్చినా ప్రయోజనం దక్కేది కాదు. - మజ్జూరి అబ్బాయి, హంసవరం, తుని మండలం -
తెలంగాణకు పొంచి ఉన్న కరెంట్ కష్టాలు
-
కొనసాగుతున్న కరెంట్ కష్టాలు
= తిరుమల మినహా, అన్నిచోట్లా సరఫరా బంద్ = తీరని ప్రాంతీయ ఆస్పత్రుల కష్టాలు = సమ్మెలో పాల్గొన్న 2,200 మంది ఉద్యోగ, కార్మికులు = కార్పొరేట్ ఆఫీసు ఎదుట మహిళా ఉద్యోగుల దీక్షలు = పడకేసిన ఐస్‌క్రీం తయారీ పరిశ్రమలు సాక్షి, చిత్తూరు: విద్యుత్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుండటంతో జిల్లాలో బుధవారం కూడా ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పలేదు. విద్యుత్ ఉద్యోగులందరూ నాల్గవ రోజు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంతో సహా పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంలో కూడా పూర్తిగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. తిరుమలకు, ప్రధాన ఆస్పత్రులకు మాత్రమే విద్యుత్ ఇచ్చారు. 4వ రోజు తిరుపతి ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని 2,200 మంది ఉద్యోగులు విధులకు గైర్హాజరయ్యారు. సీఎండీ హెచ్‌వై.దొర, ఎస్ఈలు మాత్రం విధుల్లో ఉన్నారు. తిరుపతి, మదనపల్లి, చిత్తూరులో విద్యుత్ ఉద్యోగ, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఎస్పీడీసీఎల్ తిరుపతి కార్పొరేట్ కార్యాలయం ఎదుట మహిళా ఉద్యోగులు రిలే దీక్షల్లో కూర్చున్నారు. రైల్వేట్రాక్షన్ లైన్లకు కూడా విద్యుత్ పునరుద్ధరించకపోవడంతో కాట్పాడి(తమిళనాడు) నుంచి తీసుకున్న విద్యుత్‌తోనే రైళ్లు నడుస్తున్నాయి. రైల్వేస్టేషన్లల్లో సిగ్నల్స్, ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు, రైళ్ల మైక్ అనౌన్స్మెంట్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. జిల్లాలో పరిశ్రమలు, విద్యుత్ అధారితంగా నడిచే వ్యాపారాలన్నీ పగటి పూట బంద్ అయ్యాయి. కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు ఆగిపోయాయి. దీంతో చాలా వ్యాపారసంస్థలు తమ కార్యకలాపాలను రాత్రిపూటకు మార్చుకుంటున్నాయి. ఏరియా ఆస్పత్రులకు విద్యుత్ నిల్ ప్రభుత్వ వైద్య, విధాన పరిషత్ అధికారులు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలకు ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. తిరుపతిలోని స్విమ్స్, బర్డ్, రుయా, చిత్తూరు జిల్లా ప్రధాన ఆస్పత్రి మినహా మిగిలిన ఆస్పత్రుల్లో విద్యుత్ లేదు. వైద్యులు కూడా వెలుతురు లేక చీకట్లో అరకొరగా విధులు నిర్వర్తిస్తున్నారు. చీకటి, ఉక్కపోతలో ఎక్కువసేపు ఉండలేక వైద్యులు త్వరగా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పడకేసిన ఐస్‌క్రీం కంపెనీలు పూర్తిగా విద్యుత్‌పై అధారపడి నడిచే ఐస్‌క్రీం తయారీ కంపెనీలు జిల్లాలో చిన్నా పెద్దా కలిపి 100కు పైగా ఉన్నాయి. రోజుకు నిరంతరాయంగా 13గంటలు విద్యుత్ లేకపోవడంతో ఐస్ తయారీ నిలిచిపోయింది. రాత్రి ఐస్ తయారు చేసినా పగలంతా నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. దీంతో చిన్నతరహా ఐస్‌క్రీం తయారీ ఫ్యాక్టరీలు ఉత్పత్తిని పూర్తిగా నిలిపేశాయి. పట్టణాల నుంచి మండల కేంద్రాల వరకు జ్యూస్ దుకాణాలు, కూల్‌డ్రింక్‌ల వ్యాపారం పడిపోయింది. జ్యూస్ సెంటర్లన్నీ విద్యుత్ అధారంగానే నడవాల్సి ఉంది. దీంతో రాత్రి ఏడు నుంచి 10 గంటల వరకు కొద్దిసేపు వ్యాపారం చేసుకుంటున్నారు. పెట్రోల్ బంకుల్లో సమస్యలు జిల్లాలోని 500కు పైగా పెట్రోల్ బంకుల్లో విద్యుత్ బంద్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ లేకపోవడంతో ఎలక్ట్రానిక్ పంపులు పని చేయడం లేదు. కొన్ని పెద్ద పెట్రోల్ బంకుల్లో జనటరేటర్లతో పెట్రోల్ పడ్తున్నారు. ఈ జనరేటర్లు కూడా ఎక్కువసేపు పని చేయడం లేదు. రాత్రి 7 గంటల తరువాత విద్యుత్ రాగానే వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూకడుతున్నారు. వందల సంఖ్యలో వాహనాలకు ఒక్కసారిగా పెట్రోల్ పట్టలేక బంకు సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు.