
అన్నదాతకు చంద్ర‘గ్రహణం’
పదునైన గొడ్డలి వేటు పడిన చెట్టు మళ్లీ చిగురించవచ్చు. కానీ ఈటెల్లాంటి మాటలతో గాయపడిన హృదయం తిరిగి కోలుకోవడానికి ఏ మందూ లేదు. చంద్రబాబు పాలనా కాలంలో రాష్ర్టం తీవ్ర కరువు కాటకాలతో అల్లాడింది. అటు వరుణుడి కరుణ లేక.. ఇటు చంద్రబాబు కనికరం లేక.. అన్నదాతలు అల్లాడిపోయారు. సాగు భారమైన వేళ.. అవసరమైన కరెంటు సరఫరా చేసి, ఆదుకోవాల్సిన చంద్రబాబు.. ‘వ్యవసాయం దండగ’ అంటూ పదునైన మాటలతో రైతు హృదయాలను గాయపరిచారు.
ఆ మాటలు గుర్తుకు వస్తే ఇప్పటికీ వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటూనే ఉంటోంది. పదిమందికి అన్నంపెట్టిన మట్టి మనుషులు.. ఆ మట్టిలోనే బలవంతంగా కలిసిపోతున్నా.. నిర్దయగా వ్యవహరించిన చంద్రబాబు కర్కశ పాలనను.. అందుకే వారు మళ్లీ వద్దంటున్నారు. రైతు బతుకులపై పట్టిన ఆ చంద్ర‘గ్రహణం’ తమ జీవితాల్లో మళ్లీ రాకూడదని కోరుకొంటున్నారు.
బాబు పాలన అంటేనే భయమేస్తోంది
చంద్రబాబు పాలనలో కరెంట్ లేక చేతికి వచ్చిన పంట దెబ్బ తినేది. కరెంట్ సరఫరా సక్రమంగా లేకపోయినా తడిసిమోపెడు బిల్లులు వచ్చేవి. వరి పంట పొట్ట దశలో నీరు లేక బాగా దెబ్బ తినేది. అప్పులు పాలైపోయాం. బాబు పాలన అంటేనే భయమేస్తోంది.
- పాలం నాగవిష్ణు, కౌలు రైతు, గాదరాడ, కోరుకొండ మండలం
కరెంట్ కష్టాలు వెన్నంటేవి
చంద్రబాబు పాలనలో రైతుల కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఏ సమయంలో కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది. పగలనక, రాత్రనక బోర్ల వద్దే పడిగాపులు కాసేవాళ్లం. ట్రాన్స్‌ఫార్మర్ పోతే నెలల తరబడి మార్చేవారు కాదు.
- నలరావుల శ్రీనివాస్, రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం
కరెంటు లేకపోయినా తప్పని బిల్లులు
చంద్రబాబు పాలనలో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేదికాదు. బిల్లులు మాత్రం తప్పేవికావు. వైఎస్సార్ పాలనలో ఉచిత కరెంటు, తొమ్మిది గంటల నిరంతర సరఫరా ఉండేది. దీంతో పంటలకు నీరందించడానికి ఎలాంటి ఢోకా ఉండేదికాదు. ప్రస్తుత పరిపాలనలో విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. - బచ్చల చిట్టిబాబు, గుమ్మరేగుల, రౌతులపూడి మండలం
బాబు హయాంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరమే
చంద్రబాబు హయాంలో రైతులు కరెంటు పోతే మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళంతో కొట్టుమిట్టాడేవారు. రాత్రిళ్లు వ్యవసాయబోర్ల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. కరెంటు సప్లై సక్రమంగా లేకున్నా బిల్లులు మాత్రం గుండె గుభిల్లుమనిపించే వి. బిల్లుల తగ్గింపునకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
- జట్లా సోమేశ్వరరావు, శంఖవరం
కరెంటు కష్టాలు పుట్టెడు
చంద్రబాబు నాయుడి పరిపాలనలో కరెంటు ఉందో లేదో తెలియని పరిస్థితులు అనుభవించాను. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక బోరు బావి వద్ద పడిగాపులు కాసేవాడిని. రాత్రంతా కాపలా కాసి విడతలవారీగా తడులు ఇచ్చినా ప్రయోజనం దక్కేది కాదు.
- మజ్జూరి అబ్బాయి, హంసవరం, తుని మండలం