ఖమ్మం: ‘మిస్టర్ చంద్రబాబునాయుడు...పొన్నాల లక్ష్మయ్య... తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కరెంట్ కష్టాలు పడుతున్నారంటే మీ పాపం కాదా..? బొగ్గు సమృద్ధిగా ఉండే ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలను వదిలేసి, మీ స్వార్థం కోసం తట్టెడు బొగ్గులేని విజయవాడ, సింహాద్రి, రాయలసీమ ప్రాంతాల్లో థర్మల్‌పవర్ స్టేషన్లు నిర్మించింది మీరూ.. మీ ప్రభుత్వాలు కాదా..? దమ్మూదైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి... నేను నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తా..’ అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు సవాల్ విసిరారు. ఖమ్మం నియోజకవర్గంలోని రిక్కాబజార్, నయాబజార్, శాంతినగర్, రఘునాథపాలెం మండలం మంచుకొండ ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 1.6 కోట్లతో నిర్మించే అదనపు తరగతి గదులకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు.
ఖమ్మం నయాబజార్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి ప్రసంగించారు. విద్యుత్ సమస్యతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో బొగ్గు ఉన్నా విద్యుత్ ప్రాజెక్టులు ఇక్కడ పెట్టలేదన్నారు. అప్పుడు మౌనంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. ప్రాజెక్టులు అన్ని ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి కాబట్టే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. జిల్లాలోని మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
2017 నాటికి కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మిగులు విద్యుత్ ఉత్పత్తి అయ్యేవరకు కష్టాలు తప్పవన్నారు. 1964లో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వ పనులు నేటికీ కొనసాగుతున్నాయన్నారు. చుక్కనీరు రాక కాల్వల్లో తుమ్మలు మొలిచాయన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు తనకు రెండుకళ్లలాంటి వారని చెప్పే చంద్రబాబుకు తెలంగాణలో కరెంట్ కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
పేద విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతివిద్యార్థి గర్వపడేలా చేస్తామన్నారు. బడ్జెట్‌లో విద్యకోసం వెచ్చించే డబ్బులు ఖర్చు కింద జమ చేయకుండా విలువైన మాన వ వనరులను వెలికితీసే పెట్టుబడిగా భావిస్తామన్నారు. పెన్షన్ పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్స్‌పై కేబినెట్ సమావేశాల్లో చర్చించామన్నారు. అదే చంద్రబాబు అధికారంలో ఉంటే భార్యభర్తల మధ్య కూడా కాంట్రాక్టు విధానం ప్రవేశపెట్టేవారని ఎద్దేవా చేశారు.
* టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందనే నమ్మకం ఉందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సమగ్రకుటుంబ సర్వే నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించటంపై పలు అనుమానాలు నెలకొన్నాయన్నారు. రేషన్‌కార్డులు, పెన్షన్లు కోతపెడతారని ప్రజలు భయపడుతున్నారన్నారు. వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ సమస్యతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
* తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నాయకులు బస్సుయాత్రలు చేస్తున్నారని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ విమర్శించారు. వారి దగాకోరు మాటలు వినిమోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలంబరితి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్వీఎం పీవో శ్రీనివాస్, ఈడబ్ల్యూఐసీ ఈఈ రఘురామరాజు, అర్బన్ ఎంఈవో శ్రీనివాస్, రఘునాథపాలెం ఎంపీపీ, జడ్పీటీసీ, పాఠశాలల హెచ్‌ఎంలు, విద్యాకమిటీ చైర్మన్లు, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ తోట రామారావు, నాయకులు బొర్రా రాజశేఖర్, సూతగాని జయపాల్, టీఆర్‌ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, దిండిగల రాజేందర్ పాల్గొన్నారు.
కరెంట్ పాపం మీది కాదా..?
Published Thu, Oct 16 2014 4:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement