బాబూ.. బేల మాటలేల? | Vizag Steel Plant Workers Serious on CM Chandrababu | Sakshi
Sakshi News home page

బాబూ.. బేల మాటలేల?

Published Mon, Nov 4 2024 12:19 PM | Last Updated on Mon, Nov 4 2024 12:28 PM

Vizag Steel Plant Workers Serious on CM Chandrababu

సెయిల్‌ మాదిరిగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించాలన్న సీఎం

మరోవైపు నష్టాల బాటలో ఉన్న  ఉక్కును వదిలేసి ప్రైవేట్‌కి  కొమ్ముకాస్తున్న ప్రభుత్వం 

మండిపడుతున్న స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలు

‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గురించి నేను ఒకటే చెబుతున్నాను.. ఇది ఆంధ్రుల మనోభావాలకు చెందిన ప్రాజెక్టు. ఉద్యోగులు, యాజమాన్యం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మంచి మేనేజ్‌మెంట్‌ ఏర్పాటు చేసుకోవాలి. సమర్థవంతంగా ప్లాంట్‌ని నడిపించాలి. సెయిల్‌ మాదిరిగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించాలి?   ఇవీ.. పరవాడ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.  
స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయింపులో చొరవ తీసుకోవల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడంపై స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

సాక్షి, విశాఖపట్నం: ఇటీవల పరవాడ పర్యటనలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెయిల్‌కు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న తేడా తెలియదా అంటూ కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి. సెయిల్‌కు సొంత గనులు ఉండటం వల్లే లాభాల బాటలో పయనిస్తోంది. సెయిల్‌కు, స్టీల్‌ప్లాంట్‌కు ఉత్పత్తి వ్యయంలో చాలా తేడా ఉంది. సెయిల్‌తో పోలిస్తే స్టీల్‌ప్లాంట్‌కు మూడు రెట్లు ఉత్పత్తి వ్యయం అవుతోంది. సొంత గనులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్లాంట్‌కు గనులు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మిక సంఘాలు చంద్రబాబు, పవన్‌ దృష్టికి సొంతగనుల కేటాయింపు విషయాన్ని పలుమార్లు విన్నవించినా.. కేంద్రంతో ఒక్కసారి కూడా సంప్రదింపులు జరపలేదు. ఇప్పుడు మాత్రం.. లాభాల బాట నడిపించాల్సిన బాధ్యత ఉద్యోగులు, కార్మికులదే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటంపై ఉక్కు పోరాట కమిటీ నాయకులు మండిపడుతున్నారు. 

మేనేజ్‌మెంట్‌ బాధ్యత ఎవరిది బాబూ.? 
స్టీల్‌ప్లాంట్‌కు మంచి మేనేజ్‌మెంట్‌ ఏర్పాటు చేసుకోవాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా కార్మికులు మండిపడుతున్నారు. ప్లాంట్‌కు ఉన్నతాధికారుల నియామకం, సీఎండీ నియామకం మొదలైన బాధ్యతలన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో జతకట్టిన టీడీపీ, జనసేన ఈ విషయంపై ఎప్పుడూ చర్చించిన పాపానపోలేదు. అలాంటిది.. మంచి మేనేజ్‌మెంట్‌ను ఉద్యోగులు ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు అనడమేంటని ప్రశి్నస్తున్నారు. 

ఐదు నెలల్లో ఉక్కు కోసం ఏం చేశారు.? 
ప్లాంట్‌ను కాపాడుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఈ ఐదు నెలల్లో పట్టించుకున్న పాపానపోలేదు. ఉద్యోగులు, కార్మికులకు ఉన్న సదుపాయాల్ని యాజమాన్యం కోత విధించినా స్పందించలేదు. ఉద్యోగుల వీఆర్‌ఎస్, మరో ప్లాంట్‌కు బదిలీలకు పూనుకున్నా.. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ తొలగించినా నోరెత్తిలేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్టీల్‌ప్లాంట్‌ క్వార్టర్స్‌లో యూనిట్‌కి రూ.8 చొప్పున విద్యుత్‌ చార్జీలు పెంచి వసూలు చేసినా మాట్లాడలేదు. లీవ్‌ ఎన్‌క్యా‹మెంట్, ఎల్‌టీఏ(లాంగ్‌ ట్రావెల్‌ అలవెన్స్‌), లాంగ్‌లీవ్‌ ట్రావెల్‌ కన్‌సెషన్‌(ఎల్‌ఎల్‌టీసీ), ఎల్‌టీసీ(లీవ్‌ ట్రావెల్‌ కన్‌సెషన్‌) కూడా నిలిపేశారు. 

దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వం గోరుచుట్టుపై రోకలిపోటులా రూ.80 కోట్ల విద్యుత్‌ బిల్లుల బకాయిల చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామంటూ నోటీసులు జారీ చేసింది. అలాగే స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మొదట ఇచ్చిన రూ.500 కోట్లలో రూ.237 కోట్లు జీఎస్టీకి చెల్లించగా మిగిలిన ధనంతో ముడి పదార్థాలు కొనుగోలు చేశారు. రెండోసారి ప్యాకేజీ పేరుతో రూ.1140 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి.. బ్యాంకులకు రుణాల పేరిట తిరిగి తీసేసుకుంది. ఇలా ప్రతి విషయంలోనూ ప్లాంట్‌ని నిర్వీర్యం చేసేందుకు యతి్నస్తుంటే కూటమి నేతలు నోరుమెదపకపోవడం ఏంటని కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి.

నక్కపల్లిలో ప్రైవేట్‌ ప్లాంట్‌కు సొంత గనులా?   
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్‌ ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పైగా దానికి సొంత గనుల కేటాయింపులోనూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా ప్రైవేట్‌కు కొమ్ము కాస్తుండడం చూస్తే.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు విశాఖ ఉక్కుపై ఉన్నది కపట ప్రేమ అని తేటతెల్లమవుతోందంటూ ఉద్యోగ సంఘ ప్రతినిధులు విమర్శిస్తున్నారు.

గనుల కేటాయింపులో వివక్ష కారణంగా..? 
గతంలో వరుసగా సాధించిన లాభాలతో 6.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి, ఆ తర్వాత 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికిప్లాంట్‌ విస్తరణ జరిగింది. ఒక రకంగా విస్తరణ స్టీల్‌ప్లాంట్‌కు నష్టం తెచ్చిందని చెప్పవచ్చు. విస్తరణ పూర్తయ్యే నాటికి ఉన్న వనరులన్నీ కరిగిపోగా రుణాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా దేశంలోని ప్రైవేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించడంలో వివక్ష చూపుతూ వస్తుంది. 

దీని వల్ల ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయం అవుతుండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 65 శాతం వ్యయం అవుతోంది. కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను స్టీల్‌ప్లాంట్‌ అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో గత నాలుగున్నరేళ్ల కాలంలో మూడేళ్ల పాటు నష్టాలను చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్‌ రుణాలు రూ.20 వేల కోట్లకు మించిపోయాయి. అయితే స్టీల్‌ప్లాంట్‌ ఈ 30 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ. 40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం. వీటిని వద్దని చెప్పినా ప్లాంట్‌ సజీవంగా బతికేది.

ఉద్యోగులపై నిందలు వేయడం సరికాదు 
స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఉంటే సెయిల్‌ కంటే ఎక్కువ లాభాలు సాధించేది. ఉక్కు యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కానీ ఉద్యోగులు కాదు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలో చేస్తున్న సహాయ నిరాకరణ వల్ల స్టీల్‌ప్లాంట్‌ ఈ పరిస్థితికి చేరింది.. తప్ప ఉద్యోగుల వల్ల కాదు. సీఎం చంద్రబాబుకి అందిన తప్పుడు సమాచారం వల్లే ఆయన అలా మాట్లాడుతున్నారేమో.      
– మంత్రి రాజశేఖర్, స్టీల్‌ ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement