ప్రజలకు విద్యుత్‌ చార్జీల షాక్‌ | Andhra Pradesh: Electricity charges increasing | Sakshi
Sakshi News home page

ప్రజలకు విద్యుత్‌ చార్జీల షాక్‌

Published Tue, Oct 1 2024 3:13 AM | Last Updated on Tue, Oct 1 2024 3:13 AM

Andhra Pradesh: Electricity charges increasing

టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన కానుక

సర్దుబాటు చార్జీల రూపంలో రూ.8,100 కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధం 

ఏపీ ఈఆర్‌సీకి ప్రతిపాదనలు సమర్పించిన డిస్కంలు 

ఈనెల 18న బహిరంగ విచారణ అనంతరం నిర్ణయం 

యూనిట్‌కు రూ.4.14 నుంచి రూ.6.69 వరకూ భారం  

సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి.. ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే మాట తప్పి రాష్ట్ర ప్రజలపై రూ.8,100 కోట్ల భారం మోపేందుకు సిద్ధమైంది. వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నందుకు కానుకగా ప్రజలపై విద్యుత్‌ చార్జీల పిడుగు వేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇంధన, విద్యుత్‌ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీల ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. వాటిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ)కి సమరి్పంచాయి. ఆ ప్రతిపాదనలపై ఈ నెల 18న బహిరంగ విచారణను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నట్లు ఏపీ ఈఆర్‌సీ సోమవారం వెల్లడించింది.

ఈ చార్జీలు, ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ  విచారణలో తెలపాలని కోరింది. అలాగే ఆన్‌లైన్‌ సూచనలు, అభ్యంతరాలను ఈనెల 14వ తేదీలోగా కమిషన్‌ చిరుమానాకు పోస్టు ద్వారాగానీ, ఈ–మెయిల్‌ ద్వారాగానీ పంపాలని కోరింది. అయితే.. ఈ విచారణ నామమాత్రమే. డిస్కంలు ప్రతిపాదించిన మేరకు చార్జీలు వసూలు చేసుకునేందుకు మండలి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఎఫ్‌పీపీసీఏ చార్జీలు ఒక్కో డిస్కంలోనూ ఒక్కో విధంగా ఉండనున్నాయి. వాటికి ప్రసార, పంపిణీ నష్టాలు(టీఆండ్‌డి)లను కూడా డిస్కంలు కలిపాయి. డిస్కంలలో ఈ నష్టాలు 7.99 శాతం నుంచి 10.90 వరకూ ఉన్నాయి. ఈ రెండూ కలిపి చార్జీల రూపంలో అమల్లోకి వస్తే ఒక్కో వినియోగదారునిపైనా నాలుగు త్రైమాసికాలకు కలిపి యూనిట్‌కు రూ.4.14 నుంచి రూ.6.69 వరకూ భారం పడనుంది.

చంద్రబాబు పచ్చి మోసం 
సూపర్‌ సిక్స్‌ హామీలను తుంగలో తొక్కి ఇప్పటికే ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మరో హామీని తుంగలో తొక్కారు. గత ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను పెంచకపోయినా పెంచేసినట్టు  తప్పుడు ప్రచారం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు  విద్యుత్‌ చార్జీలనూ పెంచబోమని ప్రకటించారు. చివరకు ఎప్పటిలాగానే ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా విద్యుత్‌ వినియోగదారులకు చార్జీలు పెంచుతున్నారు. ఇదే చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ఈఆర్‌సీని తప్పుదోవ పట్టించారు.

డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలను సమరి్పంచకుండా అడ్డుకున్నారు. దాంతో ఆ తరువాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆ భారం పడింది. అప్పటికే డిస్కంలు రూ.వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిపోయాయి. చంద్రబాబు హయాంలో వసూలు చేయని ట్రూ అప్‌ చార్జీలను డిస్కంలు వసూలు చేసుకుంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచేస్తోందంటూ  తప్పుడు ప్రచారం చేశారు. అదే చంద్రబాబు ఇప్పుడు ఇచ్చిన మాట తప్పి..  ప్రజలపై సర్దుబాటు పేరిట చార్జీల పిడుగు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement