విద్యుత్ వ్యవస్త అస్తవ్యస్తం | Electrical System Derangement in srikakulam | Sakshi
Sakshi News home page

విద్యుత్ వ్యవస్త అస్తవ్యస్తం

Published Tue, Oct 14 2014 4:04 AM | Last Updated on Wed, Sep 5 2018 4:17 PM

Electrical System Derangement in srikakulam

పలాస: తుపాను ప్రభావంతో పలాస విద్యుత్ సబస్టేషన్ పరిధిలోని పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలతో పాటు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో విద్యుత్ కష్టాలు ఇంకా తీరలేదు.  తుపాను ఫలితంగా స్తంభాలు కూలిపోవడం, తీగలు తెగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పాడవడం వంటి చర్యలతో విద్యుత్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.  శనివారం అర్థరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు పలు గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. పట్టణంలో కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.   పునరుద్ధరణ చర్యలు నామమాత్రంగా చేపడుతున్నారు.  పలాస సబ్‌డివిజన్‌లో మొత్తం 120 స్తంభాలు పడిపోయాయి.  విద్యుత్ వైర్లు ఎక్కడికక్కడే తెగి రోడ్లపైనే కనిపిస్తున్నాయి.  30 మంది సిబ్బంది ఉండగా శ్రీకాకుళం నుంచి అదనంగా 80 మందిని తీసుకొచ్చారు. వీరంతా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని  ఏడీఈ ఏవీ రామారావు చెప్పారు. అయితే ఫలితం మాత్రం కనిపించడం లేదు. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తారనేది కూడా  చెప్పలేకపోతున్నారు.
 
 రాత్రంతా జాగారమే...
 పలాస రూరల్:  కంబిరిగాం జంక్షన్ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ వరదనీటితో నిండిపోయింది.  అలాగే కంబిరిగాం జంక్షన్ నుంచి పలాసకు వెళ్లే రహదారిలో రోడ్డుపై నుంచి వరదనీరు ప్రవహించింది. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులకు పలాస మండలంలోని గ్రామీణ ప్రాంతాలు అంధకారంగా తయారయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్నలు, పెద్దలు, వృద్ధులు రాత్రి సమయాల్లో నిద్రపోయేందుకు నానా అవస్థలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రాత్రి నిద్రలేకుండా జాగారాలు ఉన్నామని  ఆవేదన వ్యక్తం చేశారు.  బ్రాహ్మణతర్లా, బంజీరుపేట తదితర ప్రాంతాల్లో కూలిన విద్యుత్ స్తంభాలను విద్యుత్ అధికారులు సరిచేశారు.
 
 శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు
 కవిటి: మండలంలో తుపాను ధాటికి అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.   విద్యుత్ పునరుద్ధరణ పనులు సోమవారం శరవేగంగా చేపట్టారు.  నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను మార్చడం, తీగలను బిగించడం వంటి పనులను స్థానికుల సాయంతో చేపడుతున్నారు.
 
 తుపాను దెబ్బకు విద్యుత్ కష్టాలు
 టెక్కలి: అతలాకుతలం చేసిన తుపాను దెబ్బకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.  సోమవారం నాటికి విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. దీంతో పట్టణంతో పాటు గ్రామాలన్నీ అంధకారంలో కొట్టిమిట్టాడుతున్నాయి.  తొలుసూరుపల్లిలో రహదారికి అడ్డంగా భారీ మర్రిచెట్టు వేళ్లతో సహా కూలిపోయింది. వీటితో పాటు అదే గ్రామంలో 3 విద్యుత్ స్తంభాలు,  ఒక ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా చెరువులో పడిపోయింది. రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడం,  మోటార్లు పనిచేయకపోవడంతో ప్రజలు నీటి కోసం అనేక అవస్థలు పడ్డారు.
 
 అంధకారంలో గ్రామాలు  
 జి.సిగడాం:  హూదూద్ బీభత్సంతో మండలంలో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది.  వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పొగిరి, మర్రివలస, టిడివలస, మండాకురిటి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిద్దాం, పాలకండ్యాం ప్రధాన రహదారుల కొట్టుకుపోయాయి. యువకులు, విద్యార్ధులు, స్వచ్చంధ సంస్ధలు ప్రతినిధలు సహకారంతో పొందూరు-రాజాం ప్రధాన రహదారుల్లో వక్షాలు తొలగించారు. రాకపోకలుకు అవకాశం కలిగించారు. మండలంలో 31 పంచాయితీల్లో 500 విద్యుత్ స్తంభాలు, వేలసంఖ్యలో వక్షాలు కూలిపోయాయి.
 
 మండలంలో 40 స్తంభాలకు నష్టం
 ఆమదాలవలస రూరల్: మండలంలో తుపాను ప్రభావం వల్ల సుమారు 40 స్తంభాలు కూలిపోయాయి. ఈదురుగాలుల ధాటికి చెట్లు పడిపోయి స్తంభాలు పాడయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపోయి విద్యుత్ అంతరాయం కలిగింది.  పునరుద్ధరణకు మరో 24 గంటలు పడే అవకాశం ఉందని విద్యుత్ శాఖాధికారులు తెలిపారు.
 
 నేలకూలిన 300 స్తంభాలు
 లావేరు: హూదూద్ తుపాను ప్రభావంతో మండలంలో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు 300 స్తంభాలు నేలకూలాయి.  భారీ చెట్లు విద్యుత్ వైర్లపై పడడంతో స్తంభాలతో పాటు వైర్లు తెగిపోయాయి.  11 కేవీ, ఎల్‌టీ లైన్లపై చెట్ల కొమ్మలు పడడంతో  లావేరు, బుడుమూరు, అదపాక, కేశవరాయునిపాలేం గ్రామాల్లో  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేక గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.  గ్రామాల్లో మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
 కొనసాగుతున్న అంధకారం
 నరసన్నపేట, నరసన్నపేట రూరల్: నరసన్నపేట నియోజకవర్గంలో హుదూద్ తుపాను ప్రళయానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. సోమవారం కూడా విద్యుత్ పునరుద్ధరణ పనులు జరగకపోవడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది.  గ్రామాల్లో వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో స్తంభాలు ఎత్తి వైర్లు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతోంది.  నరసన్నపేట సబ్‌స్టేషన్ పరిధిలో సుమారు 120 మంది అదనపు కార్మికులు విద్యుత్ పునరుద్దరణ చర్యలు చేపట్టారు. ఇదే విధంగా మిగతా నాలుగు మండలాల్లో కూడా  అదనపు సిబ్బందితో పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. కంప్యూటర్ సేవలపై ఆధారపడ్డ రెవెన్యూ, ఎంపీడీవో, సబ్ రిజిస్ట్రార్, తపాలా శాఖ వంటి పలు కార్యాలయాల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.   ఉర్లాం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అయినా విద్యుత్ సరఫరా మెరుగుపర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా ఉండగా చిక్కాలవలస, బాడాం, కిళ్లాం, కోమర్తి, యారబాడు, జమ్ము  తదితర గ్రామాల్లో  స్తంభాలు విరిగిపోయాయి.
 
 నందిగాంలో 45...
 నందిగాం:  హుదూద్ తుపాను ప్రభావంతో మండలంలో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి.  టెక్కలి, పలాస నుంచి వచ్చే మెయిన్ లైన్‌ను నిలుపుదల చేసినట్లు విద్యుత్ శాఖ ఏఈ నారాయణరావు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు త్వరితగతిన చేపడుతున్నామన్నారు. మండలంలో  మండలంలో సుమారు 45 స్తంభాలు నేలకొరిగాయి.  బోరుభద్ర సమీపంలో క్రాకర్స్ పాడయ్యాయి. వైరు పూర్తిగా పాడైంది.  పీవీపురం వద్ద భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో లట్టిగాం-పూండి రోడ్డులో ప్రయాణికులకు అంతరాయం కలిగింది. కవిటిఅగ్రహారం వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో కుంకుడు చెట్టు నేలమట్టమైంది
 
 పొందూరులో 50...
 పొందూరు:  హూదూద్ ప్రభావం వల్ల మండలంలో  సుమారు 50 వరకు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.
 పొందూరు,
 జోగన్నపేట, తండ్యాం, శ్రీరాంనగర్ కాలనీ, మొదలవలస, తోలాపి, తాడివలస తదితర గ్రామాలన్నీ రాకపోకలకు దూరంగా ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్లపై పడడంతో ఈ పరిస్థితి నెలకొంది. చెరువులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చెరువులకు ఉన్న మదుములు ద్వారా నీటిని విడిపెట్టడంతో ప్రజలు చేపలు పడుతున్నారు.
 
 150 స్తంభాలు, 30 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం
 శ్రీకాకుళం రూరల్ : తుపాను ప్రభావంతో మండలంలో 150 స్తంభాలు, 30 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. దీంతో విద్యుత్  సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి.  అధికారులు కేవలం మత్స్యకార గ్రామాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో అధికార యంత్రాంగమంతా ఇక్కడే ఉండిపోవడంతో మిగిని గ్రామాలకు కనీస సహాయక చర్యలు చేపట్టేనాధుడే  కరువయ్యారు.  వాకలవలస సమీపంలో కూలిన చెట్లను తొలగించేందు సోమవారం నాటికి కూడా ఎవరూ రాలేదు.   చివరకు గ్రామస్తులకే ముందుకు వచ్చి చెట్లను తొలగించి రాకపోకలకు వీలు కలిగించారు.  
 
 నేలకొరిగిన స్తంభాలు
 రాజాం:  రాజాం పట్టణంలో తుపాను ప్రభావంతో విద్యుత్‌స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి.  30 చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సబ్ రిజిస్ట్రార్, ట్రాన్స్‌కో కార్యాలయం, మాధవబజార్ ప్రాంతాల్లో వృక్షాలు, కొమ్మలు, హోర్డింగ్‌లు పడిపోయి   తృటిలో ప్రమాదం తప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement