ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తాం..
ఎవ్వరూ రుణాలు కట్టొద్దు.. వ్యవసాయానికి9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చి.. పండుగలా మారుస్తాం.. స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.. అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు.. సీఎం అయ్యాక అన్నీ మరిచిపోయారు. వ్యవసాయ బడ్జెట్ పేరిట అంకెల గారడీ చేశారు. జిల్లాకు కొత్తగా ఒక్క కేటాయింపు జరగలేదు. రుణమాఫీకి కేటాయించిన నిధులు అన్నదాతను హతాశులను చేస్తున్నాయి.ఒక వైపు రుణం మాఫీ కాక.. కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాకతలలు పట్టుకు కూర్చుంటున్నారు.
మదుపులు లేక.. అప్పు దొరక్క సాగుకు దూరమవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గింది. పంటలతో కళక ళలాడాల్సిన పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో సుమారు ఐదున్నర లక్షల మంది రైతులు, 2,41,329 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా..ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు రుణమాఫీ హామీ..అన్నదాతలను నడి రోడ్డున పడేసింది. అధికారంలోకి వచ్చిన ఆయన..రుణమాఫీ చేయకపోగా..కనీసం స్పష్టత ఇవ్వకపోవడం..పాత రుణాలు తీర్చాలంటూ..బ్యాంకర్లు ఒత్తిడి తేవడంతో..మదుపులు దొర క్క చాలా ప్రాంతాల్లో రైతులు సాగుకు దూరంగా ఉండిపోయారు.
వేధిస్తున్న విద్యుత్ కష్టాలు
జిల్లాలో 26,085 విద్యుత్ మోటార్లున్నాయి. వీటిలో సుమారు 20వేలకు పైగా ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. విద్యుత్ సరఫరాాలో ఆటంకాలు ఎదురవుతుండడంతో అన్నదాతలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్ ఇస్తుండడంతో పాములు, విష కీటకాల కాటుకు గురై..మృత్యువాత పడుతున్నారు. ఎన్నికల సమయంలో 9 గంటల పాటు విద్యుత్ ఇస్తామన్న చంద్రబాబు..మోసం చేస్తున్నారు.
వడ్డీ రాయితీ పెంపుపై అసహనం
రుణమాఫీకి బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఎం దుకూ సరిపోవు. అలాగే..ఖరీఫ్ సీజన్ దాటుతున్నా.. రుణాల ఊసే లేదు. జిల్లాలో గత ఏడాది రూ.1200 కోట్ల పంట రుణాలు, రూ.700 కోట్ల వరకు బంగారం రుణాలు రైతులు తీసుకున్నారు. అయితే..వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాత్రం రుణమాఫీ కోసం గానీ..ప్రస్తుత సీజన్‌కు రైతులకు రుణాలు అందించేందుకు గానీ..ప్రయత్నించకుండా..వడ్డీ రాయితీ పెంచుతున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ధరల స్థిరీక రణ నిధి గాలికి..
రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రానప్పడు ప్రభుత్వం స్థిరీకరణ నిధి ద్వారా కొనుగోళ్లు జరుపుతామని టీడీపీ ప్రధాన హామీ ఇచ్చింది. కానీ బడ్జెట్‌లో ఆ విషయాన్ని మరిచిపోయింది.
ఆర్థిక బడ్జెట్‌లో అంకెలు మార్చారు..
సాధారణ బడ్జెట్‌నే అంకెలు మార్చి రైతులను ఏమార్చే ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఉచిత విద్యు త్ కేటాయింపులు ప్రతి బడ్జెట్‌లో ఉన్నవే. వాటిని గతంలో ఆర్థిక(సాధారణ) బడ్జెట్‌లోనే చూపేవారు. కానీ ప్రస్తుతం వ్యవసాయ బడ్జెట్‌లో చూపి..మాయ చేస్తున్నారు. మొత్తానికి..వ్యవసాయ బడ్జెట్‌లో జిల్లాకు మొండి చెయ్యి చూపుతున్నారు.
బీమా ఎలా..
కొత్త రుణాలు మంజూరు కాకపోతే..బీమా వర్తిం చదు.జిల్లాలో రైతులు పంటల బీమా ప్రత్యేకంగా చేయించే సాంప్రదాయం లేదు. ఇక బీమా ఎలా అని అన్నదాతలు సతమతవుతున్నారు.
మడ్డువలసకు రిక్తహస్తం
వంగర: మండలంలోని గొర్లె శ్రీరాములునాయుడు మడ్డువలస ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగింది. ప్రాజెక్టు ఆధునికీకరణ, మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ హయాంలో..
మహానేత వైఎస్ హయాంలో మడ్డువలస ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.47 కోట్లు కేటాయించారు.దశల వారీగా ఇప్పటి వరకు రూ.32 కోట్ల మేర నిధులు సమకూర్చడంతో..కుడి ప్రధాన కాలువ లైనింగ్ పనులు, అదనపు కాలవల తవ్వకం, తూముల ఏర్పాటు, కల్వర్టుల నిర్మాణం చేపట్టారు.
ప్రతిపాదనలు పంపినా..
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మిగులు పనులు చేపట్టేందుకు రూ.15 కోట్లు నిధులు కావాలని ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపారు.ప్రస్తుత బడ్జెట్‌లో నిధులు సమకూర్చకపోవడంతో లావేరు, రణస్థలం మండలాల్లో అదనపు కాలువ తవ్వకం పనులు నిలిచిపోయాయి. భూ సేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైంది. పలు చోట్ల కల్వర్టులు నిర్మించలేదు. అత్యవసర గేట్ల ఏర్పాటు నిలిచిపోయింది. కుడి ప్రధాన కాలువ హెడ్ స్లూయిస్ గేట్ల మరమ్మతులు నిలిచిపోయాయి. ఎంతో ఆశతో ఎదురు చూసినా..ప్రభుత్వం తమ ఆశలపై నీళ్లు చల్లిందని.. రైతులు మండిపడుతున్నారు.
పనులు ఫుల్..నిధులు నిల్
సంతకవిటి: అర్ధశతాబ్దం చ రిత్ర..39 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న నారాయణపురం ఆనకట్టకు సైతం బడ్జెట్‌లో ఒక్క పైసా కేటాయించలేదు. శిథిలావస్థలో..ఇసుక మూటల తాత్కాలిక అడ్డుతో ఎన్నాళ్లు నెట్టుకు రావాలని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రంగారాయపురం గ్రామం వద్ద ఉన్న ఈ ఆనకట్ట కుడికాలువ రెగ్యులేటర్ పూర్తిగా పాడైంది. దీని మరమ్మతులకు కనీసం రూ.50 లక్షల మేర అవసరం. వీటితో పాటు..గతంలో ఆనకట్టకు సంబంధించి ఎఫ్రాన్ నిర్మాణం కొంత మేర చేసి వదిలేశారు. దీంతో నది ప్రవాహం దిశ మారి పోతులు జగ్గుపేట గట్టు కోతకు గురవుతోంది.
ఈ ఎఫ్రాన్ నిర్మాణానికి కోటి రూపాయలు అవసరమని నిపుణులు తేల్చారు. వీటితో పాటు ఇక్కడ బ్యారేజీ ఏర్పాటుకు రూ.15 కోట్లు అవసరం ఉంది. ఇక ఆరుమాసాల క్రితం వచ్చిన రాష్ట్ర స్థాయి ఇంజినీరింగ్ అధికారులు..కుడికాలువను పరిశీలించి..కాలువ ఆధునికీకరణకు రూ.50 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. మరో వైపు జిల్లా ఇంజినీర్లు రూ.7.5కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వానిక ఇవేమీ కనబడలేదు. బడ్జెట్ పేరిట మోసం చేశారని, ఒక్క రూపాయి కూడా కేటాయించకపోతే ఎలా అంటూ..రైతులు ప్రశ్నిస్తున్నారు.