హామీయే మాఫీ!
శ్రీకాకుళం అగ్రికల్చర్, నరసన్నపేట రూరల్: ఖరీఫ్ సీజన్ ఇప్పటికే మొదలైంది. రైతులు ఒకపక్క పంట సాగుకు సిద్ధమవుతూనే.. మరోవైపు పంట రుణాల కోసం బ్యాంకుల వైపు, ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. టీడీపీ ఎన్నికల హామీగా తెరపైకి వచ్చిన రైతు రుణమాఫీ రైతులోకాన్ని ఆశలపల్లకిలో ఊరేగిం చింది. రుణ బకాయిలు చెల్లించకుండా చేసింది. ఎన్నికలు ముగిసినా ప్రభుత్వం కొలువుదీరడంలో జాప్యం జరిగింది. దాంతో రుణమాఫీపై క్లారిటీ రాలేదు. బ్యాంకులేమో పాత రుణాల చెల్లిస్తేనే కొత్త రుణాలని స్పష్టం చేస్తున్నాయి. ఈలోగా ఖరీఫ్ సీజన్ మొదలైంది. చేతిల్లో డబ్బుల్లేవు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ ఫైలుపైనే తొలి సంతకం చేస్తానన్న చంద్రబాబు.. తీరా ఇప్పుడు కమిటీ అంటున్నారు. దీంతో రైతులు బిత్తరపోయారు. ఒక్క పంటపైనే ఆధారపడిన జిల్లా రైతులు ఇప్పుడు తమ గతేంటని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో పరిస్థితి..
గత నాలుగు సీజన్లలో ప్రకృతి వైపరీత్యాలు పంటలను కబళించాయి. దిగుబడులు లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ తరుణంలో ఎన్నికలు రావడం.. రుణమాఫీ చేస్తామని టీడీపీ హామీ ఇవ్వడంతో సంబరపడ్డారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో రుణబాధలు తీరుతాయని ఆశపడ్డారు. కొత్త రుణాలు తీసుకోవచ్చన్న ఉద్దేశంతో ఖరీఫ్ సాగుకు మిగతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు చేసిన రుణమాఫీకి కమిటీ.. 45 రోజుల గడువు.. అన్న ప్రకటన రైతులను కుంగదీసింది. జిల్లాలో సుమారు సుమారు 6 లక్షల మందికిపైగా రైతులు 2.5 లక్షల హెక్టార్లలో పంటలు పండిస్తున్నారు. వీరిలో సుమారు 4.5 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరూ చంద్రబాబు ప్రకటనతో నీరుగారిపోయారు. పాత రుణాలు చెల్లించనిదే కొత్త రుణాలు ఇచ్చేది లేదని ఇప్పటికే బ్యాంకర్లు స్పష్టం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఇప్పటికిప్పుడు వాటిని చెల్లించే పరిస్థితిలో లేరు. చంద్రబాబేమో.. రుణమాఫీకి ప్రాతిపదిక నిర్దేశించేందుకు కమిటీ వేస్తామని.. అది 45 రోజుల్లో నివేదిక ఇస్తుందని.. దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు.
అప్పుడిస్తే ఏం ఉపయోగం?
మరో 45 రోజులు వేచి ఉంటే పుణ్యకాలం గడిచిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈలోగా వ్యవసాయ పనులకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో మెజార్టీ రైతులు రూ. 5 వేల నుంచి లక్షల వరకూ బ్యాంకుల్లో వివిద రకాల రుణాలు వాడుకున్నారు. ఏటా వాడుకున్న రుణం తిరిగి చెల్లించడం, మళ్లీ కొత్త రుణం పొందడం ఆనవాయితీ. ఈసారి కూడా రైతులు రుణాలను తీర్చేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ హామీ ఇచ్చిన ధీమాతో వాయిదాల చెల్లింపు నిలిపివేశారు. ఖరీఫ్ సీజను ముంచుకొచ్చిన సమయంలో చంద్రబాబు కమిటీ పేరుతో మెలిక పెట్టారు.
సాధారణంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ వ్యవసాయ పరపతి సంఘాలు, వాణిజ్య బ్యాంకులు పంట రుణాలు ఇస్తాయి. ఈసారి జూన్ వచ్చినా ఆ ఊసే లేదు. రుణ మాఫీ వ్యవహారం తేలనిదే రుణాలు ఇవ్వలేమని బ్యాంకర్లు అంటున్నారు. దీంతో రైతులకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. 45 రోజుల అందే నివేదిక పరిశీలించి .. ఒకవేళ రుణమాఫీ అమలు చేసినా దాని వల్ల ప్రయోజనం ఉండదని, అప్పటికే పంట సీజను దాదాపు చివరి దశకు వచ్చేస్తుందని రైతులు అంటున్నారు. కాగా రుణమాఫీపై ప్రభుత్వం కమిటీ వేయడాన్ని బ్యాంకర్లు కూడా అనుమానిస్తున్నారు. దీనివల్ల మరింత కాలయాపన జరుగుతుందని, అనుకున్న సమయానికి రైతులకు పంట రుణాలు ఇవ్వలేమని వారు అంటున్నారు. ఆగస్టు నెలలో రుణాలు ఇచ్చినా రైతులకు ఉపయోగపడవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కరువులో అధికమాసం
ఇప్పటికే నారుపోతకు రైతులు పొలం సిద్ధం చేశారు. మరికొందరు ఎద పద్ధతిలో వరి పండించేందుకు పొలాన్ని దుక్కి దున్ని తయారుగా ఉంచారు. మార్కెట్లోకి విత్తనాలు రావడంతో వాటి కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. గత సీజనులో ప్రభుత్వం సబ్సిడీ ధరలతో విత్తనాలు అమ్మడంతో రైతులకు కొంత కలసి వచ్చింది. ప్రస్తుతం సబ్సిడీ లేకపోవడంతో పూర్తి ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు రూ. 300 వరకూ అదనపు భారం పడుతుంది. మరోవైపు ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగాయి. ఇతర ఖర్చులు కూడా పెరిగిపోయాయి. పెట్టుబడి భారం పెరిగిన నేపథ్యంలో రుణాలపైనే ఆధారపడిన రైతులకు రుణమాఫీ అంశం తేలకపోవడం కుంగదీస్తోంది.
45 రోజుల్లో ఖరీఫ్ పనులే పూర్తి అయిపోతాయి
నేను ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. గత ఏడాది పంట రుణంగా రూ. లక్ష తీసుకున్నాను. వరుస విపత్తులతో పంట పోయింది. రుణంపై వడ్డీ కూడా చెల్లించే పరిస్థితుల్లో లేను. ఖరీఫ్ సాగుకు మళ్లీ మదుపులు కావాలి. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీతో రుణం మాఫీ అవుతుందని, కొత్త రుణం తీసుకొని సాగు చేయవచ్చని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు కమిటీ వేసి, రిపోర్టు ఇవ్వడానికి 45 రోజుల గడువు ఇచ్చారు. ఇప్పటికే సీజన్ మొదలైంది. మరో 45 రోజులంటే అప్పటికి ఖరీఫ్ పనులు దాదాపుగా పూర్తవుతాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం ఎలా చేయాలి?
- ముచ్చు జగదీష్,
రైతు, బావాజీపేట, శ్రీకాకుళం మండలం