గురువారం విజయవాడ బెంజిసర్కిల్ నాలుగురోడ్ల కూడలిలో నవనిర్మాణదీక్షకు హాజరైన జనం
* హైదరాబాద్‌లో పదేళ్లు అవకాశం ఉన్నా.. విజయవాడకు వచ్చేశా
* అడ్డగోలుగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారు..
* ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే..
సాక్షి, విజయవాడ బ్యూరో: పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ ఉండటం సరికాదని ఏడాదిలోనే క్లారిటీ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అందుకే విజయవాడ వచ్చేశానన్నారు. విభజనతో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకే నవ నిర్మాణ దీక్ష నిర్వహిస్తున్నామని, తెలుగు జాతి ఉన్నంత కాలం ఇది కొనసాగుతుందని తెలిపారు.
రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని, ఇంత అన్యాయం, అవమానం మరొకటి ఉండదని, అందుకే ఈ రోజును పండుగలా నిర్వహించుకోలేకపోతున్నామని అన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. ప్రపంచమంతా తిరిగి హైదరాబాద్‌కు ఒక గుర్తింపు తెచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు కట్టుబట్టలతో రోడ్డున పడేశారని విమర్శించారు. ఆస్తులు రాలేదని, అప్పులు మిగిలాయని చెప్పారు. గురువారం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద నవనిర్మాణ దీక్ష సభలో ప్రతిజ్ఞ చేయించిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు.
సమస్యల సుడిగుండంలో రాష్ట్రం
విభజన సమయంలో పార్లమెంటు లాబీలో ఉన్న తాను.. మీరైనా సహకరించి, విభజనను ఆపాలని అద్వానీని కోరానని, ఇంతలోనే అంతా జరిగిపోయిందని సీఎం చెప్పారు. లోటు బడ్జెట్ భర్తీ, ప్రత్యేక హోదా వంటి అనేక హామీలను అప్పుడు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. హోదా విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించి బిల్లులో పెట్టలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం సమస్యల సుడిగుండంలో ఉందని, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ పైకి వచ్చేవరకు ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. మిత్రపక్షమైన బీజేపీ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు.
బీజేపీ అడిగినందుకు ఒక రాజ్యసభ సీటు ఇచ్చానని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు కొనసాగించాలని పిలుపునిచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజైన 8వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మహాసంకల్ప దీక్ష చేపడతామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సభకు అధ్యక్షత వహించారు.
దీక్ష ప్రతిజ్ఞ ఇదీ..
అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సిద్ధంగా ఉన్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరుగని శ్రమజీవులం మనం. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాం. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమ శిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే అత్యుత్తమ రాష్ర్టంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమనే పవిత్ర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.
అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్టతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాం.