మూడు రోజుల నిరసన
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి విరుద్ధంగా రైతు రుణమాఫీ విషయంలో పూటకోమాట చెబుతున్న చంద్రబాబు తీరును నిరసిస్తూ గురువారం నుంచి మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ పనులు ఊపందుకున్నా రైతులకు మేలు చేకూరేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈనెల 24, 25, 26 తేదీల్లో గ్రామస్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేస్తామన్నారు. తాను అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన రుణమాఫీ అమలులో చంద్రబాబు మాట తప్పినందునే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేపడుతోందని వివరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జీ ఆధ్వర్యంలో సంబంధిత మండల నాయకులకు ఈ మేరకు సమాచారం పంపించామన్నారు. అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి కొత్తగా ఆంక్షలు విధించడం, అది కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని కృష్ణదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రుణమాఫీ అమలు కానందున ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, డ్వాక్రా మహిళలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసనను ప్రకటించాలని కృష్ణదాస్ కోరారు. కాగా, ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి శాంతి పిలుపునిచ్చారు.