ఆ రైతులంతా దొంగలే
రూ.1.50 లక్షలకు పైబడి రుణం తీసుకున్నవారిపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య
అందుకే రుణం మొత్తం మాఫీ చేయలేదని యాగీ చేస్తున్నారు
దిష్టిబొమ్మలు తగలబెడితే నేను భయపడను
విభజన అనంతరం రాజధాని ఎక్కడుందో తెలీడంలేదు
మూడు, నాలుగు హైదరాబాద్‌లను నిర్మించే శక్తి నాకు ఉంది
ప్రతి గ్రామంలో గుడిలేకపోయినా బడి ఉండాలి
సాక్షి అనంతపురం: ‘‘నిజమైన రైతుల కష్టాలను తీర్చడానికే రుణమాఫీని ప్రకటించా. ఆరుగాలం శ్రమించి పంటలు సాగుచేసే రైతులకు రూ.1.5 లక్షల కన్నా ఎక్కువగా అప్పు ఉండదు. రాష్ట్రంలో రూ.1.5 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులు 96.4 శాతం మంది ఉండగా, అంతకు పైబడి పంట రుణాలు పొందిన రైతులు 3.6 శాతం మంది మాత్ర మే ఉన్నారు. రూ.1.5 లక్షల పైచిలుకు రుణాలు తీసుకున్నవారంతా దొంగలే. వారిలో వైఎస్సార్‌సీపీ వారే ఎక్కువ. అందుకే రుణాన్ని మొత్తం మాఫీ చేయలేదనే అక్కసుతో నానాయాగీ చేస్తూ నా దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. అలాంటివారి బెదిరింపులకు నేను భయపడను’’ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన రెండో రోజైన శుక్రవారం కదిరి పట్టణంలోని కుటాగుళ్ల మున్సిపల్ స్కూల్‌లో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ప్రారంభోత్సవం, ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి ఉరవకొండ నియోజకవర్గానికి చెం దిన అనంతయ్య అనే కార్యకర్త రూ.10 లక్షల చెక్కు, బుక్కరాయసముద్రం మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త మల్లికార్జునరెడ్డి రూ.50 వేల చెక్కును సీఎంకు అందజేశారు. సీఎం ప్రసంగాల్లో ఏం చెప్పారంటే...
దేశంలో ఏ పార్టీకీ లేని కార్యకర్తల బలం టీడీపీ కి ఉంది. గత పదేళ్లలో కాంగ్రెస్ దౌర్జన్యాలకు ఆస్తు లు, ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. పరిటాల రవీంద్రలాంటి నాయకులను పార్టీ పోగొట్టుకుంది. కార్యకర్తల రెక్కల కష్టంతోనే మళ్లీ అధికారంలోకి వచ్చాం. త్వరలోనే మార్కెట్ కమిటీలు, దేవాదాయ ట్రస్టు బోర్డులు, కార్పొరేషన్లలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తాం. అందులో కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం. నాకు కార్యకర్తల తర్వాతే ప్రజలు, నాయకులు.
అధికారంలోకి వచ్చాం కదా అని కార్యకర్తలు రిలాక్స్ కాకూడదు. అదే జరిగితే ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రతిపక్షంలోకి పోవడం ఖాయం.
అందుకే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించి గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కార్యకర్తలతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరూ కష్టపడితేనే పార్టీ మనుగడ సాధ్యం.
రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఎక్కడో ఎవరికీ తెలి యడం లేదు. అందరూ అసూయపడే విధంగా రాజధానిని నిర్మించుకుందాం. ఇందుకు ప్రతి ఒక్కరూ విరాళాలు ఇవ్వం డి. పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరి శక్తిమేర వారు విరాళాలు ఇచ్చి రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
ఏపీలో వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. విశాఖపట్నం, చెన్నై మధ్య ఉన్న తీర ప్రాంతంలో కారిడార్ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేనే. భవిష్యత్తులో ఏపీలో మూడు లేదా నాలుగు హైదరాబాద్‌లను నిర్మించే శక్తి నాకు ఉంది. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతా.
కాపు, బలిజ కులస్తులను బీసీల్లోకి చేరుస్తా. బీసీలకు నష్టం జరగకుండా రిజర్వేషన్ల మార్పునకు అధ్యయనం చేస్తాం. పేదరికం లేని రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం. బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తాం.
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గుడి లేకపోయినా ఫర్యాలేదు కానీ బడి ఉండాలి. 14 ఏళ్లలోపు పిల్లలంతా బడిలోనే ఉండాలి. ఆడపిల్లలు బాగా చదువుకుంటే సాంఘిక దురాచారాలు తగ్గుతాయి. ఐదేళ్లలో వంద శాతం అక్షరాస్యత సాధించడమే మా లక్ష్యం.
ఉద్యమాలకు బెదరను
సాక్షి, కదిరి: ‘‘అనవసరమైన ఆందోళనలతో సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడం మంచిది కాదు. ఎవరెంత అరిచి గీపెట్టినా నన్ను భయపెట్టలేరు. నాకు న్యాయం కాదనిపిస్తే ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదు. మీ వెనుక ఏదో దుష్ట శక్తి ఉండి మిమ్మల్ని నడిపిస్తోంది. రోడ్లపై ఆందోళనలు చేస్తే ఫలితం ఉండదు. ఇలా ఆందోళనలు చేయడం గత ప్రభుత్వాలు మీకు నేర్పాయి. ఇంటికెళ్లి బుద్ధిగా చదువుకోండి’’ అని విద్యార్థులు, నిరుద్యోగులను చంద్రబాబు హెచ్చరించారు. అనంతపురం జిల్లా కదిరిలో శుక్రవారం సీఎం పర్యటనలో.. ఎస్‌జీటీ పోస్టులకు తమను అనుమతించాలని బీఎడ్ అభ్యర్థులు, త్వరలో ప్రకటించబోయే డీఎస్సీలో అవకాశం కల్పించాలని డీఎడ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పలుచోట్ల ఆందోళనలు చేశారు. కదిరి సభలో చంద్రబాబు మాట్లాడుతుండగా విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పైవిధంగా స్పందించారు.