హామీలపై సంజాయిషీ ఇవ్వను | dont't give to guarantees on the explanation | Sakshi
Sakshi News home page

హామీలపై సంజాయిషీ ఇవ్వను

Published Sat, May 30 2015 2:20 AM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM

హామీలపై సంజాయిషీ ఇవ్వను - Sakshi

హామీలపై సంజాయిషీ ఇవ్వను

టీడీపీ మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు
 
హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో రాష్ట్రంలో ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరంలేదని ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు, నేతలు మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎవరైనా రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే.. మీరు ప్రభుత్వం నుం చి పొందిన రుణమాఫీ లబ్ధిని తిరిగి చెల్లించి మాట్లాడమని డిమాండ్ చేయాలన్నారు. శుక్రవారం మహానాడు చివరిరోజు ఆయన కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, అంతకుముందు పలు దఫాలుగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలపైన, తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైన తీవ్రంగా ధ్వజమెత్తారు. పలు ఆరోపణలు చేశారు. ఇంకా పలు ఇతర అంశాలను ప్రస్తావించారు. అందులోని ప్రధానాంశాలు ఆయన మాటల్లోనే..  

ఆ పార్టీలకు విశ్వసనీయత లేదు..

రాష్ట్రానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరొకటి అవినీతి పార్టీ. ఈ రెండు పార్టీలకు ప్రజల్లో విశ్వసనీయత లేదు. టీడీపీ అంటే కాంగ్రెస్‌కు భయం. ఆ పార్టీ జాతీయ స్థాయిలో కూడా ప్రాంతీయపార్టీ స్థాయికి కుదించుకుపోయింది.
 
మోదీ కార్యక్రమాలను స్వాగతిస్తున్నాం


ఏడాదికాలంగా ప్రధాని మోదీ ఎన్నో కార్యక్రమాలు చేశారు. కేంద్రసర్కారులో భాగస్వామ్య పార్టీగా వారు చేసిన కార్యక్రమాలను స్వాగతి స్తున్నాం. రాష్ట్ర విభజనతో ఏపీ, తెలంగాణలకు కొన్ని సమస్యలొచ్చాయి. వాటి పరిష్కారానికి కేంద్రం సహకరించాలి. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలుచేయాలి. ఉభయ రాష్ట్రాలమధ్య నెలకొన్న సమస్యలపై జూన్ రెండులోగా పరిష్కరించుకోవాలి. కానిపక్షంలో కేంద్రంతో సంప్రదించి న్యాయం చేసుకుందాం.

జప్తు చేసిన ఆస్తులు ప్రభుత్వానికి..

వివిధ కేసుల్లో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ జప్తు చేసిన ఆస్తులు ప్రభుత్వానికి దక్కాలి. విదేశాలకు తరలిస్తుండగా పట్టుబడ్డ ఎర్రచందనం సెంట్రల్ ఎక్సైజ్‌శాఖ వద్ద ఉంది. అదీ రాష్ట్రానికే చెందాలి. ఇలా స్వాధీనం చేసుకున్న ఆస్తులను రాష్ట్రానికి అప్పగించాలని ప్రత్యేకచట్టం తెస్తాం.

రెండు రాష్ట్రాలు రెండు కళ్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు. రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. కొందరు జూన్ రెండు నుంచి ఏపీలో చేపట్టే నవ నిర్మాణ దీక్షను కూడా వక్రీకరిస్తున్నారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు ఈ దీక్ష చేస్తున్నాం. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకు దీక్షను ఉపయోగించుకుంటాం. జూన్ 3 నుంచి ఏడోతేదీ వరకూ ప్రభుత్వం గత ఏడాదికాలంగా అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. 8న గతేడాది ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతంలోనే ప్రగతి నివేదిక ప్రవేశపెడతాం. రాష్ర్ట రాజధానికి సింగపూర్ ప్రభుత్వం సహకరించకుండా ఉండాలని కాంగ్రెస్ వాళ్లు టెలిగ్రామ్‌లు పంపారు. నా కుటుంబంపైనా విమర్శలు చేస్తున్నారు. 30 ఏళ్లక్రితం ఒక చిన్న పరిశ్రమను ఏర్పాటుచేసి కష్టపడి పైకి తీసుకొచ్చా.  బంగారు తెలంగాణ కావాలి. అందుకు 2019లో టీడీపీ అధికారంలోకి రావాలి. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలుగువారికి న్యాయం చేసేశక్తి, సామర్ధ్యం టీడీపీకే ఉం ది. ఈ వేదిక నుంచి తొమ్మిది అంశాలతో కూడిన డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం. అందరూ దానికనుగుణంగా పనిచేయాలి.’ అని అన్నారు.
 
కేసీఆర్... ఖబడ్దార్
 
‘టీడీపీని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తక్కువగా అంచనా వేశారు. మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఖబడ్దార్. జాగ్రత్త, మీ గుండెల్లో నిద్రపోతా. నాది ఉడుంపట్టు, వదిలేది లేదు. తెలంగాణలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారు. పశువులను కొన్నట్టు కొన్నారు. ఒక్కరు పోతే వందమంది నేతలను తయారుచేస్తాం. తెలంగాణలో 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. ఓయూ భూముల్ని అమ్ముతామంటే ఖబడ్దార్’. అని చంద్రబాబు హెచ్చరించారు.

టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు

 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ఏపీ సీఎం చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక ను ఏపీ పార్టీ సంస్థాగత ఎన్నికల కమిటీ కన్వీన ర్ కిమిడి కళా వెంకట్రావు శుక్రవారం మహానాడు ప్రతినిధుల సభలో ప్రకటించారు. పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్ష పదవికి చంద్రబాబు పేరును 30 మంది నేతలు నామినేషన్లు దాఖలు చేయగా, మరో 30 మంది బలపరిచారని వెంకట్రావు తెలిపారు. చంద్రబాబుతో పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ కన్వీనర్ ఇనుగాల పెద్దిరెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం మహానాడుకు హాజరైన ప్రతినిధులు చంద్రబాబును బొకేలు, పచ్చ కండువాలు, కిరీటాలతో సత్కరించారు. తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు కాకతీయ శిలాతోరణాన్ని చంద్రబాబుకు బహుకరించారు.

కేంద్ర క మిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబును తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఉప ముఖ్యమంత్రి  కేఈ కృష్ణమూర్తి, సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ,  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు అభినందిస్తూ ప్రసంగించారు. టీడీపీని జాతీయ పార్టీగా మారుస్తూ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై యనమల రామకృష్ణుడు, రావుల చంద్రశేఖరరెడ్డి ప్రసంగించారు. పార్టీని తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, మహారాష్ర్టలతో పాటు తెలుగు వారుండే ఇతర రాష్ట్రాలు, టీడీపీని అభిమానించే ఇతర భాషల ప్రజలున్న ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. పార్టీ జెండా, ఎన్నికల గుర్తులో మార్పు ఉండదని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement