తాగునీటి పథకాలకు సౌర‘శక్తి’ | Solar power to drinking water schemes | Sakshi
Sakshi News home page

తాగునీటి పథకాలకు సౌర‘శక్తి’

Published Fri, Aug 22 2014 3:21 AM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM

తాగునీటి పథకాలకు  సౌర‘శక్తి’ - Sakshi

తాగునీటి పథకాలకు సౌర‘శక్తి’

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఎదురవుతున్న కరెంట్ కష్టాలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించింది.

- కరెంట్ కష్టాలకు ప్రత్యామ్నాయం
- తొలి యూనిట్ పొన్నాలపల్లెలో ఏర్పాటు
- త్వరలో మంత్రిచేతుల మీదుగా ప్రారంభం
 గంభీరావుపేట : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఎదురవుతున్న కరెంట్ కష్టాలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించింది. సౌర‘శక్తి’తో పల్లె ప్రజల గొంతు తడిపే పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొదటి యూనిట్‌ను గంభీరావుపేట మండలం దమ్మన్నపేట పంచాయతీ పరిధిలోని పొన్నాలపల్లెలో సౌరశక్తి ఆధారిత తాగునీరు సరఫరా పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకాన్ని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ప్రారంభించాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. జిల్లాకు మొదటి విడతగా ఆరు యూనిట్లు మంజూరు చేసినా ప్రారంభమైన యూనిట్ మాత్రం ఇదే కావడం గమనార్హం.
 
సౌరశక్తి ఆధారిత తాగునీటి పథకం కింద పొన్నాలపల్లెతోపాటు జిల్లెల్లపల్లె, మహదేవ్‌పూర్ మండలం బొడాయిగూడెం, ఒడెడ్, మంథని మండలం మహబూబ్‌పల్లి, ముత్తారం మండలం పోచంపల్లికి యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్‌కు ఎన్‌ఆర్‌డబ్ల్యూపీ పథకం కింద రూ.4.50 లక్షలు వెచ్చించనున్నారు. జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ (హైదరాబాద్) కంపెనీ పథకం పనులు చేపట్టింది. ప్రొడక్ట్ మేనేజర్ ప్రదీప్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ ఎంపిక విధానం
* సోలార్ ఆధారిత తాగునీటి సరఫరా కోసం చిన్న పల్లెలను (హాబిటేషన్)లను అధికారులు ఎంపిక చేశారు.
* గతంలో ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం అధికారులు వేసిన బోరుబావులను పథకానికి వినియోగిస్తున్నారు.
* చేతిపంపును ఏర్పాటు చేసి, సోలార్‌తో నడిచే సింగిల్‌ఫేజ్ మోటార్‌ను బోరుబావిలో దింపుతారు.
* వంద మీటర్ల లోతు నుంచి నీటిని పైకి తీసుకురాగల సామర్థ్యం మోటారుకు ఉంటుంది.
* కొద్ది ఎత్తులో ఐదువేల లీటర్ల సామర్థ్యం గల ప్లాస్టిక్ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తారు.
* ట్యాంక్‌పై 740వాల్ట్స్ సామర్థ్యం గల మూడు సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేస్తారు.
* ట్యాంక్ నిండిపోయినా.. బోరులో మోటారుకు నీరు అందకపోయినా మోటారు దానంతట అదే ఆగిపోతుంది.
* బోరుబావికి 150మీటర్ల దూరం చొప్పున మూడు పబ్లిక్ నల్లాలు ఏర్పాటు చేస్తారు. * వీటితోపాటు చేతి పంపు కూడా పనిచేస్తుంది.
* ఏ కారణంగానైనా సోలార్ సిస్టం పనిచేయకుంటే యథావిధిగా చేతిపంపు పనిచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement