Gambhiravupeta
-
వాటర్షెడ్లతో గ్రామాల అభివృద్ధి
గంభీరావుపేట : వాటర్షెడ్లతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. నేల, నీరు, చెట్లు, పశు సంపద సంరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో బతుకుదెరువుకు దారులు చూపుతాయన్నారు. నాబార్డ్ నిధులు రూ.3కోట్లతో మండలంలోని గజసింగవరం, దమ్మన్నపేట, ముస్తఫానగర్ వాటర్షెడ్ల నిర్మాణానికి కలెక్టర్ కృష్ణభాస్కర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి ఎంపీ సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మాట్లాడారు. వాటర్షెడ్లను రైతులు సద్వినియోగం చేసుకుని సత్ఫలితాలు సాధించాలని కోరారు. ఉద్యమస్ఫూర్తితోనే రాష్ట్రంలో పాలన కొనసాగుతుందన్నారు. ఇక్కడి ప్రాంతంలో అడవులు ఉన్నప్పటికీ నీళ్లు లేక వ్యవసాయం కుంటుపడిందని..అందుకే వాటర్‌షెడ్ మంజూరు చేయించినట్లు తెలిపారు. యుద్ధప్రాతిపదికన ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సర్పంచ్ కొండూరి గాంధీ, నాబార్డు ఏజీఎం సుదర్శన్ చందర్, డీడీఎం రవిబాబు, ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ, జెడ్పీటీసీ మల్లుగారి పద్మ, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, వైస్ చైర్మన్ మోహన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. -
తాగునీటి పథకాలకు సౌర‘శక్తి’
- కరెంట్ కష్టాలకు ప్రత్యామ్నాయం - తొలి యూనిట్ పొన్నాలపల్లెలో ఏర్పాటు - త్వరలో మంత్రిచేతుల మీదుగా ప్రారంభం గంభీరావుపేట : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఎదురవుతున్న కరెంట్ కష్టాలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించింది. సౌర‘శక్తి’తో పల్లె ప్రజల గొంతు తడిపే పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొదటి యూనిట్‌ను గంభీరావుపేట మండలం దమ్మన్నపేట పంచాయతీ పరిధిలోని పొన్నాలపల్లెలో సౌరశక్తి ఆధారిత తాగునీరు సరఫరా పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకాన్ని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ప్రారంభించాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. జిల్లాకు మొదటి విడతగా ఆరు యూనిట్లు మంజూరు చేసినా ప్రారంభమైన యూనిట్ మాత్రం ఇదే కావడం గమనార్హం. సౌరశక్తి ఆధారిత తాగునీటి పథకం కింద పొన్నాలపల్లెతోపాటు జిల్లెల్లపల్లె, మహదేవ్పూర్ మండలం బొడాయిగూడెం, ఒడెడ్, మంథని మండలం మహబూబ్‌పల్లి, ముత్తారం మండలం పోచంపల్లికి యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్‌కు ఎన్‌ఆర్‌డబ్ల్యూపీ పథకం కింద రూ.4.50 లక్షలు వెచ్చించనున్నారు. జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ (హైదరాబాద్) కంపెనీ పథకం పనులు చేపట్టింది. ప్రొడక్ట్ మేనేజర్ ప్రదీప్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇదీ ఎంపిక విధానం * సోలార్ ఆధారిత తాగునీటి సరఫరా కోసం చిన్న పల్లెలను (హాబిటేషన్)లను అధికారులు ఎంపిక చేశారు. * గతంలో ఆర్డబ్ల్యూఎస్ విభాగం అధికారులు వేసిన బోరుబావులను పథకానికి వినియోగిస్తున్నారు. * చేతిపంపును ఏర్పాటు చేసి, సోలార్‌తో నడిచే సింగిల్‌ఫేజ్ మోటార్‌ను బోరుబావిలో దింపుతారు. * వంద మీటర్ల లోతు నుంచి నీటిని పైకి తీసుకురాగల సామర్థ్యం మోటారుకు ఉంటుంది. * కొద్ది ఎత్తులో ఐదువేల లీటర్ల సామర్థ్యం గల ప్లాస్టిక్ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తారు. * ట్యాంక్‌పై 740వాల్ట్స్ సామర్థ్యం గల మూడు సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేస్తారు. * ట్యాంక్ నిండిపోయినా.. బోరులో మోటారుకు నీరు అందకపోయినా మోటారు దానంతట అదే ఆగిపోతుంది. * బోరుబావికి 150మీటర్ల దూరం చొప్పున మూడు పబ్లిక్ నల్లాలు ఏర్పాటు చేస్తారు. * వీటితోపాటు చేతి పంపు కూడా పనిచేస్తుంది. * ఏ కారణంగానైనా సోలార్ సిస్టం పనిచేయకుంటే యథావిధిగా చేతిపంపు పనిచేస్తుంది.