కరెంటు కష్టాలకు ఢిల్లీ పరిష్కారం! | Delhi, the solution to the current difficulties! | Sakshi
Sakshi News home page

కరెంటు కష్టాలకు ఢిల్లీ పరిష్కారం!

Published Thu, Sep 25 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

కరెంటు కష్టాలకు ఢిల్లీ పరిష్కారం!

కరెంటు కష్టాలకు ఢిల్లీ పరిష్కారం!

గ్యాస్ పూలింగ్ విధానంపై కేంద్రం కసరత్తు
     
అన్ని గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తికి కార్యాచరణ
దేశీయ, విదేశీ గ్యాస్‌తో కొరత తీర్చే యోచన
రూ. 5.50కే యూనిట్ విద్యుత్ దక్కే అవకాశం
తెలంగాణకు తక్షణ ఉపశమనం

 
హైదరాబాద్: విద్యుత్ కష్టాలతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి ఉపశమనం లభించేలా ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) కేంద్రంగా రూపొందుతున్న గ్యాస్ పూలింగ్ ధరల విధానంతో తక్కువ ధరకే విద్యుత్ లభించనుంది. గ్యాస్‌తో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రూ. 5.50కే యూనిట్ చొప్పున అందించేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం గ్యాస్ కొరతతో నిరుపయోగంగా ఉన్న విద్యుత్ ప్లాంట్లలో కనీసం 50 నుంచి 60 శాతం ప్లాంట్ లోడు ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)తో ఉత్పత్తిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. దేశీయంగా లభించే గ్యాసుకు తోడు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుని తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందుకయ్యే అదనపు భారాన్ని వయబులిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్-వ్యత్యాస నిధి)గా భరించాలని కూడా యోచిస్తోంది. ఈ గ్యాస్ పూలింగ్ విధానం అమల్లోకి వస్తే తెలంగాణకు 23 నుంచి 28 మిలియన్ యూనిట్ల(ఎంయూ) మేర విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీంతో విద్యుత్ కష్టాలు కొంత తీరుతాయన్న ఆశాభావం ఇంధన శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇలా మొదలైంది..

దేశీయ, విదేశీ గ్యాస్‌ను రెండింటినీ కలిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి తక్కువ ధరకే విద్యుత్‌ను అందించేందుకు ఉద్దేశించిందే గ్యాస్ పూలింగ్ విధానం. ఈ విధానంపై కేంద్ర విద్యుత్, ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో గత ఆగస్టు 19న పీఎంవో అంతర్గతంగా సమావేశమైంది. యూనిట్ విద్యుత్‌ను రూ. 5.50 కే అందించాలంటే ఏం చేయాలనే కార్యాచరణను తమకు సమర్పించాలని ఈ మూడు శాఖలను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఆ శాఖలు పీఎంవో ముందు తాజాగా ఓ నివేదికను ఉంచాయి. దీని ప్రతిని ‘సాక్షి’ సంపాదించింది. దీని ప్రకారం గ్యాసు పూలింగ్ విధానం అమలు చేసేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలను తీసుకోవాలని ఆ శాఖలు స్పష్టం చేశాయి. దేశంలోని గ్యాస్ ప్లాంట్లను 50 నుంచి 60 పీఎల్‌ఎఫ్‌తో నడిపితే తక్షణ విద్యుత్ కష్టాలు తీర్చవచ్చునని తెలిపాయి. దీనికి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, గ్యాస్ సరఫరా సంస్థలు, ప్లాంట్ల యాజమాన్యాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించాయి.

అంద రూ చేతులు కలిపితేనే..!

గ్యాసు పూలింగ్ విధానాన్ని అమలు చేసేందుకు అన్ని వర్గాలూ చేయూతనివ్వాల్సి ఉంటుంది. పీఎంవోకి ఇచ్చిన నివేదిక ప్రకారం..
►  రాష్ట్ర ప్రభుత్వం సహజగ్యాస్‌పై ఎటువంటి వ్యాట్ వసూలు చేయరాదు. ప్రస్తుతం ఇది 14 శాతం వరకూ ఉంది.
►   గ్యాస్ ప్లాంట్ల యాజమాన్యాలు కూడా తమ స్థిర చార్జీలను యూనిట్‌కు 85 పైసలకే పరిమితం చేసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ చార్జీలు రూపాయి నుంచి రూ. 1.10 వరకూ ఉన్నాయి.
► ప్రజలు కూడా గ్రీన్‌ఎనర్జీ సెస్ కింద కొంత చెల్లించాల్సి ఉంటుంది.
► రిలయన్స్ సంస్థ గ్యాస్ సరఫరా చార్జీలను సుమారు 20 శాతం మేర తగ్గించుకోవాలి.
► కేంద్రం వీజీఎఫ్ కింద 2015-16లో సుమారు రూ. 3027 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ మన ప్లాంట్ల పరిస్థితి!

కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తిని రిలయన్స్ రోజురోజుకీ తగ్గించడంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కష్టాలు వచ్చిపడ్డాయి. వాస్తవానికి రిలయన్స్ షెడ్యూల్ మేరకు 2015 నాటికి రోజుకు 120 ఎంఎంఎస్‌సీఎం (మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల) గ్యాస్ ఉత్పత్తి కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం కేవలం రోజుకు 30 ఎంఎంఎస్‌సీఎంలే ఉత్పత్తవుతోంది. ఫలితంగా ఏకంగా 2233 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. అదేవిధంగా నిర్మాణం పూర్తయి, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 4061 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో నాలుగు ప్లాంట్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం ఓఎన్‌జీసీ, రవ్వ క్షేత్రాల నుంచి వస్తున్న గ్యాసుతో పాత విద్యుత్ ప్లాంట్లు ఆరు మాత్రమే(1285 మెగావాట్లు) నడుస్తున్నాయి. ఇవి కూడా కేవలం సగటున 32 శాతం ప్లాంటు లోడు ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో మాత్రమే నడుస్తున్నాయి. ఈ గ్యాసు ప్లాంట్లతో తెలంగాణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) ఉన్నాయి.

ఈ మేరకు తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ పూలింగ్ విధానం అమల్లోకి వస్తే 7579 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లలో కనీసం 50 నుంచి 60 శాతం పీఎల్‌ఎఫ్‌తో 3,789 మెగావాట్ల నుంచి 4,547 మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఇందులో తెలంగాణకు సగం విద్యుత్ అందినా ప్రస్తుత కొరత తీరిపోతుంది. ఇక దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ప్లాంట్ల సామర్థ్యం 24,149 మెగావాట్లు. ఈ ప్లాంట్లకు రోజుకు 41.7 ఎంఎంఎస్‌సీఎం గ్యాస్ అవసరం కాగా కేవలం 18.8 ఎంఎంఎస్‌సీఎం గ్యాస్ మాత్రమే సరఫరా అవుతోంది. గ్యాస్ దిగుమతి చేసుకుని వీటిని కనీసం 50 శాతం పీఎల్‌ఎఫ్‌తో నడిపితే అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కష్టాలు తీరుతాయని కేంద్రం భావిస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement