Gas shortage
-
బొగ్గు.. భగ్గు!
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలు.. ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాలు, కరోనా నుంచి కోలుకుని పరిశ్రమల్లో వినియోగం పెరగడం, వ్యవసాయ సీజన్ కావడం, విదేశీ బొగ్గు ధరలు ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని బొగ్గుకు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. కొరత కారణంగా పలు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు సంక్షోభంతో సోమవారం నాటికి దేశంలోని దాదాపు 13 రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ కోతలు అనివార్యమవుతున్నాయి. అంతర్జాతీయ, దేశీయ విపణిలో బొగ్గు కొరత తీరే వరకు మరికొన్ని రోజుల పాటు కోతలు కొనసాగే అవకా>శాలున్నాయి. జాతీయ స్థాయిలో గ్రిడ్ నిర్వహణను నియంత్రించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’(పోసోకో) నివేదికలను విశ్లేషిస్తే వారం పది రోజులుగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యాణా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కోతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. బిహార్, ఝార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8 – 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండడం లేదని జాతీయ మీడియా పేర్కొంటోంది. దక్షిణాదిన కేరళలో విద్యుత్ కొరత గణనీయంగా ఉండగా కర్ణాటక, ఏపీలో స్వల్పంగా కొరత నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. చైనా లాంటి దేశాలు కూడా బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతలతో చైనాలోని పరిశ్రమలు అల్లాడుతున్నాయి. మన దేశంలోనూ విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగింది. మరోవైపు గత ఏడాది కాలంలో విదేశీ బొగ్గు ధరలు దాదాపు రెట్టింపు కావడంతో బొగ్గు దిగుమతులపై ఆధారపడ్డ థర్మల్ ప్లాంట్లపై ఆర్థిక భారం పెరిగిపోయింది. దీంతో దేశీయ కోల్ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వీటి నుంచి సరఫరాను క్రమంగా పెంచడం ద్వారా సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్రం పేర్కొంటోంది. రోజూ 80 – 110 ఎంయూల కొరత దేశంలో ఈ ఏడాది తలెత్తిన కొరతలో ప్రస్తుత అక్టోబర్ నెల తొలి వారం రోజుల్లోనే ఏకంగా 11.2 శాతం కొరత నమోదు కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్ తొలి వారంలో తలెత్తిన కొరతతో పోల్చితే ఇప్పుడు ఈ నెల తొలివారంలో 21 రెట్లు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత వారం రోజులుగా దేశంలో సగటున రోజుకు 3,880 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వినియోగం ఉండగా 80 – 110 ఎంయూల వరకు కొరత నెలకొంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) తాజా నివేదిక ప్రకారం దేశంలోని 1,65,066 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సగటున కేవలం నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా విద్యుత్ ప్లాంట్లలో 15 – 30 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సినా 115 విద్యుత్ కేంద్రాల్లో ఆరు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు కొరత నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపిత సామర్థ్యం కన్నా తక్కువ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి.. ఏపీలో 8,075 మెగావాట్ల ఉత్పత్తి కోసం సౌర, పవన విద్యుత్ వనరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వీటి నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కెపాసిటీ 5,010 మెగావాట్లు కాగా వీటికి అవసరమైన బొగ్గు సమకూర్చేందుకు కోల్ ఇండియా, సింగరేణి సంస్థలతో పాటు విదేశాల నుంచి దిగుమతులే ఆధారం. జెన్కో బొగ్గు ప్లాంట్లకు రోజుకు ఇంచుమించు 70,000 టన్నుల బొగ్గు అవసరం కాగా సెప్టెంబరు చివరిలో 24,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు పెరిగింది. దొరకని గ్యాస్ రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 908 మెగావాట్లు ఉన్నప్పటికీ కేవలం 100 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయటానికి మాత్రమే గ్యాస్ అందుబాటులో ఉంది. గ్యాస్ ప్లాంట్ల నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయటానికి గ్యాస్ లభ్యత లేదు. రాష్ట్రంలోని డిస్కంలలో 63,070 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా బొగ్గు, జల, పవన విద్యుత్, సౌర విద్యుత్ అన్ని కలిపి 50 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే లభ్యం అవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే.. రాష్ట్రంలో 20130 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా 1600 మెగావాట్లు కృష్ణపట్నం నుంచి, 600 మెగావాట్లు ఆర్టీపీపీ నుంచి, 1,040 మెగావాట్లు హెచ్‌ఎన్‌పీసీఎల్ నుంచి, 400 మెగావాట్లు కేఎస్కే నుంచి, 7,000 మెగావాట్లు సౌర పవన ఇతర విద్యుత్ వనరుల నుంచి లభ్యమవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే ఈ విద్యుత్ ఉత్పత్తి వనరులు రాష్ట్ర అవసరాలను తీర్చగలుగుతాయి. నిజానికి రాష్ట్రంలో 2018 అక్టోబర్‌లో కూడా బొగ్గు కొరత సంక్షోభం ఏర్పడింది. అప్పుడు రాష్ట్రంలో కొన్ని చోట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో డిస్కంలు బయట నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో జెన్కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్ వేలం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో పీక్ అవర్స్‌లో మాత్రమే ‘రాష్ట్రంలో ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడం లేదు. నిర్వహణ కోసం మాత్రమే అక్కడక్కడా సరఫరా ఆపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పీక్ అవర్స్‌లో కొంత వరకూ పవర్ కట్స్ ఉంటున్నాయి. అది కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఒకటి రెండు గంటలు మాత్రమే’ – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి తెలంగాణాలో పరిస్థితి భిన్నం తెలంగాణలో సహజసిద్ధంగా బొగ్గు గనులు ఉండటం వల్ల అక్కడ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం తమ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందువల్ల సింగరేణి గనుల నుంచి ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా జరగటం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణలో మాత్రమే 5 నుంచి 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండటానికి ఇదే కారణం. -
భాగ్యనగరంలో గ్యాస్ కొరత
హైదరాబాద్: అంతా అద్భుతం.. అన్నీ చాలా సజావుగా జరిగిపోతాయి అని ప్రచారం జరుగుతున్నా, మరోవైపు.. ఇటీవలి కాలంలో జనం మరచిపోయిన 'గ్యాస్ కొరత' నగరంలోని కొన్ని ప్రాంతాల వాసులకు మళ్లీ సమస్యగా మారుతోంది. వంటగ్యాస్ సిలిండర్లు సకాలంలో రాకపోవడం, ప్లాంటులోనే గ్యాస్ కొరత ఉన్నదని, తామేమీ చేయలేమని ఏజన్సీలు చెబుతుండడంతో.. వినియోగదారులు ఖంగు తింటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న మాదాపూర్ ప్రాంతంలోనే వినియోగదారులు వంటగ్యాస్ సిలిండర్లు సకాలంలో అందడం లేదు. సిలిండర్ బుక్ చేసి నెల రోజులైందని, ఎస్సెమ్మెస్ మాత్రం పది రోజుల కిందటే వచ్చేసిందని.. తీరా ఏజన్సీకి ఫోన్ చేస్తే ఇప్పట్లో రాదని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. అయ్యప్ప సొసైటీ ప్రాంతానికి ప్రణీత్ గ్యాస్ ఏజన్సీ వారు హెచ్‌పీ సరఫరాదారులుగా ఉన్నారు. నెల రోజుల కిందట గ్యాస్ బుక్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజి వచ్చిందని, డెలివరీకి వస్తున్నట్లు వారం కిందటే మెసేజి వచ్చిందని, తీరా ఏజన్సీకి ఫోను చేస్తే స్టాకు లేదని చెబుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. సిలిండర్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదని ఏజన్సీ వారు అంటున్నారని, గ్యాస్ ప్లాంట్ లోనే ప్రాబ్లం ఉంది, వస్తే తప్ప పంపలేం.. వెయిట్ చేయాల్సిందే.. అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని వాపోతున్నారు. నెలకిందట బుక్ చేసి.. ఇళ్లలో ఉన్న రెండో సిలిండర్ కూడా అయిపోవడంతో నానా యాతన పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. -
కరెంటు కష్టాలకు ఢిల్లీ పరిష్కారం!
గ్యాస్ పూలింగ్ విధానంపై కేంద్రం కసరత్తు అన్ని గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తికి కార్యాచరణ దేశీయ, విదేశీ గ్యాస్‌తో కొరత తీర్చే యోచన రూ. 5.50కే యూనిట్ విద్యుత్ దక్కే అవకాశం తెలంగాణకు తక్షణ ఉపశమనం హైదరాబాద్: విద్యుత్ కష్టాలతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి ఉపశమనం లభించేలా ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) కేంద్రంగా రూపొందుతున్న గ్యాస్ పూలింగ్ ధరల విధానంతో తక్కువ ధరకే విద్యుత్ లభించనుంది. గ్యాస్‌తో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రూ. 5.50కే యూనిట్ చొప్పున అందించేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం గ్యాస్ కొరతతో నిరుపయోగంగా ఉన్న విద్యుత్ ప్లాంట్లలో కనీసం 50 నుంచి 60 శాతం ప్లాంట్ లోడు ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్)తో ఉత్పత్తిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. దేశీయంగా లభించే గ్యాసుకు తోడు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుని తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందుకయ్యే అదనపు భారాన్ని వయబులిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్-వ్యత్యాస నిధి)గా భరించాలని కూడా యోచిస్తోంది. ఈ గ్యాస్ పూలింగ్ విధానం అమల్లోకి వస్తే తెలంగాణకు 23 నుంచి 28 మిలియన్ యూనిట్ల(ఎంయూ) మేర విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీంతో విద్యుత్ కష్టాలు కొంత తీరుతాయన్న ఆశాభావం ఇంధన శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలా మొదలైంది.. దేశీయ, విదేశీ గ్యాస్‌ను రెండింటినీ కలిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి తక్కువ ధరకే విద్యుత్‌ను అందించేందుకు ఉద్దేశించిందే గ్యాస్ పూలింగ్ విధానం. ఈ విధానంపై కేంద్ర విద్యుత్, ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో గత ఆగస్టు 19న పీఎంవో అంతర్గతంగా సమావేశమైంది. యూనిట్ విద్యుత్‌ను రూ. 5.50 కే అందించాలంటే ఏం చేయాలనే కార్యాచరణను తమకు సమర్పించాలని ఈ మూడు శాఖలను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఆ శాఖలు పీఎంవో ముందు తాజాగా ఓ నివేదికను ఉంచాయి. దీని ప్రతిని ‘సాక్షి’ సంపాదించింది. దీని ప్రకారం గ్యాసు పూలింగ్ విధానం అమలు చేసేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలను తీసుకోవాలని ఆ శాఖలు స్పష్టం చేశాయి. దేశంలోని గ్యాస్ ప్లాంట్లను 50 నుంచి 60 పీఎల్‌ఎఫ్‌తో నడిపితే తక్షణ విద్యుత్ కష్టాలు తీర్చవచ్చునని తెలిపాయి. దీనికి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, గ్యాస్ సరఫరా సంస్థలు, ప్లాంట్ల యాజమాన్యాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించాయి. అంద రూ చేతులు కలిపితేనే..! గ్యాసు పూలింగ్ విధానాన్ని అమలు చేసేందుకు అన్ని వర్గాలూ చేయూతనివ్వాల్సి ఉంటుంది. పీఎంవోకి ఇచ్చిన నివేదిక ప్రకారం.. ► రాష్ట్ర ప్రభుత్వం సహజగ్యాస్పై ఎటువంటి వ్యాట్ వసూలు చేయరాదు. ప్రస్తుతం ఇది 14 శాతం వరకూ ఉంది. ► గ్యాస్ ప్లాంట్ల యాజమాన్యాలు కూడా తమ స్థిర చార్జీలను యూనిట్‌కు 85 పైసలకే పరిమితం చేసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ చార్జీలు రూపాయి నుంచి రూ. 1.10 వరకూ ఉన్నాయి. ► ప్రజలు కూడా గ్రీన్ఎనర్జీ సెస్ కింద కొంత చెల్లించాల్సి ఉంటుంది. ► రిలయన్స్ సంస్థ గ్యాస్ సరఫరా చార్జీలను సుమారు 20 శాతం మేర తగ్గించుకోవాలి. ► కేంద్రం వీజీఎఫ్ కింద 2015-16లో సుమారు రూ. 3027 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ మన ప్లాంట్ల పరిస్థితి! కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్లో గ్యాస్ ఉత్పత్తిని రిలయన్స్ రోజురోజుకీ తగ్గించడంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కష్టాలు వచ్చిపడ్డాయి. వాస్తవానికి రిలయన్స్ షెడ్యూల్ మేరకు 2015 నాటికి రోజుకు 120 ఎంఎంఎస్‌సీఎం (మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల) గ్యాస్ ఉత్పత్తి కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం కేవలం రోజుకు 30 ఎంఎంఎస్సీఎంలే ఉత్పత్తవుతోంది. ఫలితంగా ఏకంగా 2233 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. అదేవిధంగా నిర్మాణం పూర్తయి, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 4061 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో నాలుగు ప్లాంట్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం ఓఎన్జీసీ, రవ్వ క్షేత్రాల నుంచి వస్తున్న గ్యాసుతో పాత విద్యుత్ ప్లాంట్లు ఆరు మాత్రమే(1285 మెగావాట్లు) నడుస్తున్నాయి. ఇవి కూడా కేవలం సగటున 32 శాతం ప్లాంటు లోడు ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో మాత్రమే నడుస్తున్నాయి. ఈ గ్యాసు ప్లాంట్లతో తెలంగాణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ పూలింగ్ విధానం అమల్లోకి వస్తే 7579 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లలో కనీసం 50 నుంచి 60 శాతం పీఎల్‌ఎఫ్‌తో 3,789 మెగావాట్ల నుంచి 4,547 మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఇందులో తెలంగాణకు సగం విద్యుత్ అందినా ప్రస్తుత కొరత తీరిపోతుంది. ఇక దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ప్లాంట్ల సామర్థ్యం 24,149 మెగావాట్లు. ఈ ప్లాంట్లకు రోజుకు 41.7 ఎంఎంఎస్‌సీఎం గ్యాస్ అవసరం కాగా కేవలం 18.8 ఎంఎంఎస్‌సీఎం గ్యాస్ మాత్రమే సరఫరా అవుతోంది. గ్యాస్ దిగుమతి చేసుకుని వీటిని కనీసం 50 శాతం పీఎల్‌ఎఫ్‌తో నడిపితే అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కష్టాలు తీరుతాయని కేంద్రం భావిస్తోంది.