భాగ్యనగరంలో గ్యాస్ కొరత
హైదరాబాద్: అంతా అద్భుతం.. అన్నీ చాలా సజావుగా జరిగిపోతాయి అని ప్రచారం జరుగుతున్నా, మరోవైపు.. ఇటీవలి కాలంలో జనం మరచిపోయిన 'గ్యాస్ కొరత' నగరంలోని కొన్ని ప్రాంతాల వాసులకు మళ్లీ సమస్యగా మారుతోంది. వంటగ్యాస్ సిలిండర్లు సకాలంలో రాకపోవడం, ప్లాంటులోనే గ్యాస్ కొరత ఉన్నదని, తామేమీ చేయలేమని ఏజన్సీలు చెబుతుండడంతో.. వినియోగదారులు ఖంగు తింటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న మాదాపూర్ ప్రాంతంలోనే వినియోగదారులు వంటగ్యాస్ సిలిండర్లు సకాలంలో అందడం లేదు. సిలిండర్ బుక్ చేసి నెల రోజులైందని, ఎస్సెమ్మెస్ మాత్రం పది రోజుల కిందటే వచ్చేసిందని.. తీరా ఏజన్సీకి ఫోన్ చేస్తే ఇప్పట్లో రాదని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు.
అయ్యప్ప సొసైటీ ప్రాంతానికి ప్రణీత్ గ్యాస్ ఏజన్సీ వారు హెచ్‌పీ సరఫరాదారులుగా ఉన్నారు. నెల రోజుల కిందట గ్యాస్ బుక్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజి వచ్చిందని, డెలివరీకి వస్తున్నట్లు వారం కిందటే మెసేజి వచ్చిందని, తీరా ఏజన్సీకి ఫోను చేస్తే స్టాకు లేదని చెబుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. సిలిండర్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదని ఏజన్సీ వారు అంటున్నారని, గ్యాస్ ప్లాంట్ లోనే ప్రాబ్లం ఉంది, వస్తే తప్ప పంపలేం.. వెయిట్ చేయాల్సిందే.. అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని వాపోతున్నారు. నెలకిందట బుక్ చేసి.. ఇళ్లలో ఉన్న రెండో సిలిండర్ కూడా అయిపోవడంతో నానా యాతన పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు.