అమీర్‌పేట: పౌరసత్వ సవరణ చట్టంపై వివరాలు సేకరించేందుకు వచ్చారన్న అనుమానంతో వంట గ్యాస్ విచారణ కోసం వచ్చిన ఓ వ్యక్తిని కొందరు యువకులు చితక్కొట్టారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డలోని ఆదిత్య (హెచ్‌పీ) గ్యాస్ ఏజెన్సీ ద్వారా గత కొన్ని రోజులుగా గ్యాస్ కనెక్షన్లపై విచారణ చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఐదేళ్లు పూర్తయిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి కనెక్షన్‌కు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌కు చెందిన స్వామి అనే యువకుడు ఉదయం ఎర్రగడ్డ ఫాతిమానగర్‌కు వచ్చాడు.
ఓ ఇంట్లోకి వెళ్లి గ్యాస్‌ను పరిశీలించాడు. ఆధార్‌కార్డు చూపించాలని అడగటంతో పౌరసత్వ సవరణ చట్టంపై వివరాలు సేకరించేందుకు వచ్చాడన్న అనుమానం వ్యక్తం చేస్తూ ఐడీ కార్డు చూపించాలని అడిగారు. స్వామి వద్ద ఉన్న కార్డును చూపించాడు. కార్డుపై ఫోటో అతికించి ఉన్నట్లు కనిపించడంతో మరింత అనుమానం వచ్చి సదరు యువకుడిని కొందరు వ్యక్తులు చితక బాదారు. వారే 100కు డయల్ చేసి అక్కడికి చేరుకున్న పోలీసులకు స్వామిని అప్పగించారు.
ఈ సంఘటనకు గల కారణాలపై విచారణ జరిపిన పోలీసులు స్వామి అనే యువకుడు గ్యాస్ కనెక్షన్ల వివరాలు సేకరించేందుకే వచ్చినట్లు నిర్థారించారు. కాగా, గ్యాస్ కనెక్షన్ల విచారణ కోసం నియమించిన వ్యక్తులకు శాశ్వత గుర్తింపు కార్డులు లేని కారణంగా వేరే వ్యక్తుల పేర్లపై ఉన్న ఐడీ కార్డులపై స్వామి ఫొటోను అతికించినట్లు విచారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అప్పు, అబేద్ అనే యువకులపై కేసు నమోదు చేశామని ఎస్సై మహేందర్ తెలిపారు. ప్రస్తుతం ఆ యువకులు పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment