HP gas
-
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్
గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై పేటీఎం భారీ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ బుక్ చేస్తే ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు అని పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకు అందుబాటులో ఉంది. దేశంలో 14 కిలోల గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.808-850 వరకు ఉంది. అయితే పేటిఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ. 10 నుంచి రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. మీకు కనుక అదృష్టం ఉంటే గ్యాస్ ఉచితంగానే లభించవచ్చు. అయితే, ఈ ఆఫర్ మొదటి సారి పేటీఎం నుంచి గ్యాస్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. పేటీఎం ద్వారా ఉచితంగా ఎల్పీజీ సిలిండర్ పొందాలంటే మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మొదట మీరు మీ మొబైల్ ఫోన్లో పేటీఎం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్, ఇండెన్ గ్యాస్ ఆప్షన్ లలో మీ డీలర్ షిప్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వంట గ్యాస్ ప్రొవైడర్, వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్ నంబర్లను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లావాదేవీల కోసం వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత 48 గంటలోపు స్క్రాచ్ కార్డు లభిస్తుంది. స్క్రాచ్ కార్డు ఓపెన్ చేసి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ మొదటి సారి గ్యాస్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే అని మరిచిపోవద్దు. మీకు రూ.10 నుంచి రూ.800 వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ రావొచ్చు. మీరు స్క్రాచ్ కార్డును వారం రోజులోగా ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కార్డు ఎక్స్పైరీ అవుతుంది. -
పౌరసత్వ వివరాలు సేకరించేందుకేమోనని
అమీర్‌పేట: పౌరసత్వ సవరణ చట్టంపై వివరాలు సేకరించేందుకు వచ్చారన్న అనుమానంతో వంట గ్యాస్ విచారణ కోసం వచ్చిన ఓ వ్యక్తిని కొందరు యువకులు చితక్కొట్టారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డలోని ఆదిత్య (హెచ్‌పీ) గ్యాస్ ఏజెన్సీ ద్వారా గత కొన్ని రోజులుగా గ్యాస్ కనెక్షన్లపై విచారణ చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఐదేళ్లు పూర్తయిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి కనెక్షన్‌కు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌కు చెందిన స్వామి అనే యువకుడు ఉదయం ఎర్రగడ్డ ఫాతిమానగర్‌కు వచ్చాడు. ఓ ఇంట్లోకి వెళ్లి గ్యాస్‌ను పరిశీలించాడు. ఆధార్‌కార్డు చూపించాలని అడగటంతో పౌరసత్వ సవరణ చట్టంపై వివరాలు సేకరించేందుకు వచ్చాడన్న అనుమానం వ్యక్తం చేస్తూ ఐడీ కార్డు చూపించాలని అడిగారు. స్వామి వద్ద ఉన్న కార్డును చూపించాడు. కార్డుపై ఫోటో అతికించి ఉన్నట్లు కనిపించడంతో మరింత అనుమానం వచ్చి సదరు యువకుడిని కొందరు వ్యక్తులు చితక బాదారు. వారే 100కు డయల్ చేసి అక్కడికి చేరుకున్న పోలీసులకు స్వామిని అప్పగించారు. ఈ సంఘటనకు గల కారణాలపై విచారణ జరిపిన పోలీసులు స్వామి అనే యువకుడు గ్యాస్ కనెక్షన్ల వివరాలు సేకరించేందుకే వచ్చినట్లు నిర్థారించారు. కాగా, గ్యాస్ కనెక్షన్ల విచారణ కోసం నియమించిన వ్యక్తులకు శాశ్వత గుర్తింపు కార్డులు లేని కారణంగా వేరే వ్యక్తుల పేర్లపై ఉన్న ఐడీ కార్డులపై స్వామి ఫొటోను అతికించినట్లు విచారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అప్పు, అబేద్ అనే యువకులపై కేసు నమోదు చేశామని ఎస్సై మహేందర్ తెలిపారు. ప్రస్తుతం ఆ యువకులు పరారీలో ఉన్నారు. -
భాగ్యనగరంలో గ్యాస్ కొరత
హైదరాబాద్: అంతా అద్భుతం.. అన్నీ చాలా సజావుగా జరిగిపోతాయి అని ప్రచారం జరుగుతున్నా, మరోవైపు.. ఇటీవలి కాలంలో జనం మరచిపోయిన 'గ్యాస్ కొరత' నగరంలోని కొన్ని ప్రాంతాల వాసులకు మళ్లీ సమస్యగా మారుతోంది. వంటగ్యాస్ సిలిండర్లు సకాలంలో రాకపోవడం, ప్లాంటులోనే గ్యాస్ కొరత ఉన్నదని, తామేమీ చేయలేమని ఏజన్సీలు చెబుతుండడంతో.. వినియోగదారులు ఖంగు తింటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న మాదాపూర్ ప్రాంతంలోనే వినియోగదారులు వంటగ్యాస్ సిలిండర్లు సకాలంలో అందడం లేదు. సిలిండర్ బుక్ చేసి నెల రోజులైందని, ఎస్సెమ్మెస్ మాత్రం పది రోజుల కిందటే వచ్చేసిందని.. తీరా ఏజన్సీకి ఫోన్ చేస్తే ఇప్పట్లో రాదని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. అయ్యప్ప సొసైటీ ప్రాంతానికి ప్రణీత్ గ్యాస్ ఏజన్సీ వారు హెచ్‌పీ సరఫరాదారులుగా ఉన్నారు. నెల రోజుల కిందట గ్యాస్ బుక్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజి వచ్చిందని, డెలివరీకి వస్తున్నట్లు వారం కిందటే మెసేజి వచ్చిందని, తీరా ఏజన్సీకి ఫోను చేస్తే స్టాకు లేదని చెబుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. సిలిండర్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదని ఏజన్సీ వారు అంటున్నారని, గ్యాస్ ప్లాంట్ లోనే ప్రాబ్లం ఉంది, వస్తే తప్ప పంపలేం.. వెయిట్ చేయాల్సిందే.. అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని వాపోతున్నారు. నెలకిందట బుక్ చేసి.. ఇళ్లలో ఉన్న రెండో సిలిండర్ కూడా అయిపోవడంతో నానా యాతన పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. -
కళ్లలో కారం కొట్టి లక్షలు చోరీ
పటాన్చెరు(మెదక్): విధులు ముగించుకుని వెళ్తున్న ఓ ఉద్యోగి కళ్లలో కారం కొట్టి దుండగులు రూ.4.5లక్షలు అపహరించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం పటాన్చెరు పరిధిలో చోటు చేసుకుంది. కిష్టారెడ్డిపేటలోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్లో పనిచేస్తున్న విష్ణు అనే ఉద్యోగి బైక్‌పై వెళ్తున్నాడు. మార్గంమధ్యలో ఉండగా దుండగులు ఆ ఉద్యోగిని అడ్డగించి అతని కళ్లలో కారం కొట్టారు. అనంతరం అతని వద్ద ఉన్న నగదు రూ.4.5లక్షలు దోచుకుని పరారయ్యారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.