
రబీ గయా..
గణనీయంగా తగ్గిన రబీ సాగు
81657 హెక్టార్ల భూములు బీళ్లు
9 మీటర్ల లోతులో భూగర్భజలం
వెంటాడుతున్న కరెంట్ కష్టాలు
ఆరుతడి పంటలకూ కష్టకాలం
పెట్టుబడులు రాని గడ్డు పరిస్థితి
జిల్లాలో రబీ రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటివనరులు వట్టిపోయి భూగర్భజాలు అడు గంటాయి. బావుల్లో నీళ్లున్నా.. కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలు పంటల సాగుకు ప్రతిబంధకంగా మారాయి. వెరసి జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దాదాపు 81,657 హెక్టార్ల సాగు భూములు బీడువోతున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే లక్ష హెక్టార్లు సాగు విస్తీర్ణం తగ్గడం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను కళ్లకు కడుతోంది.
- కరీంనగర్ అగ్రికల్చర్
కరీంనగర్ అగ్రికల్చర్ : రబీ సీజన్ ప్రారంభమై నాలుగు నెలలవుతోంది. జిల్లాలో బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల ఆధారంగా రబీ పంటలు సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీరు ఇవ్వలేమని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని నీటిపారుదల, వ్యవసాయ అధికారులు సూచించినప్పటికీ పలువురు రైతులు బోర్లు, బావులను నమ్ముకొని వరిసాగు చేపట్టారు. జిల్లాకు ప్రధాన సాగునీటి వనరు అయిన ఎస్సారెస్పీ నుంచి పంటలకు నీరివ్వలేమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. జిల్లాలోని దిగువ మానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టులతో పాటు శనిగరం, బొగ్గులవాగు తదితర చిన్నతరహా జలాశాలు, చెరువులు, కుంటల్లో నీటిమట్టం అడుగంటింది.
ఈ నేపథ్యంలో సాగునీరు, కరెంటు కొరతతో పంటల సాగు గణనీయంగా తగ్గింది. రబీలో సాధారణ విస్తీర్ణం 2.38 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 1.64 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది రబీ సీజన్‌లో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ చేసిన ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించలేదు. వరి సాగును వేసుకోకుండా ప్రత్యామ్నాయంగా ఆరుతడిని ప్రోత్సహించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారు.
ఆరుతడి పంటల కోసం రూ.2.15 కోట్లతో 10,461 క్వింటాళ్ల ఆరుతడి విత్తనాలను రైతులకు 50 శాతం రాయితీపై సరఫరా చేసినట్లు చెబుతున్నా మండలస్థాయిలో ఎక్కువ మొత్తంలో మిగిలిపోయాయి. సాధారణ విస్తీర్ణం 1.55 హెక్టార్లకు 78 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. వరి తర్వాత రైతులు మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. 56,004 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఇతర పంటల సాగు నామమాత్రమే.
పాతాళంలో జలం
గతేడాది 32శాతం అధిక వర్షపాతం ఉంటే.. ఈ ఏడాది 32 శాతం లోటు ఏర్పడడం అన్నదాతలకు శాపంగా మారింది. జిల్లాలోని 57 మండలాల్లో ఎనిమిది మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. బోయినపల్లి మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో భూగర్భజలాలు గతేడాదికంటే సగటున 9మీటర్ల లోతుకు పడిపోయాయి. మెట్టప్రాంతమైన వేములవాడలో 18.17 మీటర్ల లోతుకు దిగజారాయి.
బోయినపల్లిలో 14.07, ఎల్లారెడ్డిపేట 17.89, చిగురుమామిడి 15.79, గంగాధర 16.91, కొడిమ్యాల 14.65, మల్యాల 13.45, సైదాపూర్ 11.73, హుస్నాబాద్‌లో 11.71, తిమ్మాపూర్‌లో 11.46, చొప్పదండిలో 11.43, బెజ్జంకి11.01, కోనరావుపేటలో 12.97, గంభీరావుపేటలో 11.81, మహదేవపూర్‌లో 11.55 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి.
కరెంటు కట్‌కట..
కరెంటు కొరతకు తోడు అనధికార కోతలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జిల్లాలో ట్రాన్స్‌కో పరిధిలో 2.85 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. వీటికి 795 ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి రోజుకు 7గంటలు బదులు 6గంటల విద్యుత్‌ను విడతలవారీగా కాకుండా నిరంతరంగా సరఫరా చేస్తున్నారు. నిరంతరంగా సరఫరా చేయడం వల్ల బావుల్లో ఊట తగ్గుతోంది. బావుల్లో 4గంటల విద్యుత్‌కు కూడా నీళ్లు సరిపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రబీ సాధారణ సాగు విస్తీర్ణం తగ్గడంతో కోటా కుదించి కరెంటు కోతలు విధిస్తున్నారు. వినియోగం పెరుగుతుండడంతో కోటా దాటుతోందనే కారణంతో అనధికారికంగా మరో రెండు గంటల పాటు కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో నెలవారీ కోటా 239.070 మిలియన్ యూనిట్లు కేటాయించారు. ప్రతిరోజు 7.969 మిలియన్ యూనిట్లకు ప్రస్తుతం 10 మిలియన్ యూనిట్లు వినియోగమవుతుండడంతో కోటా దాటుతోందని విద్యుత్ అధికారులు కోతలకు దిగుతున్నారు.